Get Toll Amount Refund: మన దేశంలో, టోల్ ప్లాజా లేదా టోల్‌ గేట్‌ గుండా ప్రతి రోజు కోట్లాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఇలా వెళ్ళే ప్రతి వాహనం నుంచి (మినహాయింపు ఉన్న వాహనాలు తప్ప) పన్ను (Toll) వసూలు చేస్తారు. ఈ డబ్బు, ఆ రహదారిని నిర్మించిన కాంట్రాక్ట్‌ సంస్థ ఖాతాలోకి వెళుతుంది. లేదా, ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది & ఆ డబ్బును రోడ్ల నిర్వహణ, మరమ్మతుల సహా ఇతర అభివృద్ధి పనులకు ఉపయోగిస్తారు. ఏదైనా వాహనం టోల్‌ గేట్‌ నుంచి వెళ్తున్నప్పుడు, కొన్నిసార్లు, ఫాస్టాగ్‌ (FASTag)తో లింక్‌ అయిన బ్యాంక్‌ ఖాతా నుంచి పొరపాటున రెండుసార్లు టోల్‌ కట్‌ అవుతుంది. చాలామంది, రెండోసారి కట్‌ అయిన డబ్బును వదిలేసుకుని వెళ్లిపోతారు & కొందరు మాత్రమే రిఫండ్‌ (Toll Collection Refund) కోసం అడుగుతారు. 2024 సంవత్సరంలో, టోల్ గేట్ల వద్ద తప్పుగా పన్ను వసూలైన 12.55 లక్షల కేసులు నమోదైనట్లు అధికార గణాంకాల ప్రకారం తెలుస్తోంది. 


ఈ కారణాల వల్ల పొరపాటున టోల్ కట్‌ అవుతుంది
ప్రస్తుతం, ఏదైనా వాహనం టోల్‌ గేట్‌ను క్రాస్‌ చేస్తున్నప్పుడు ఫాస్టాగ్ ఉపయోగించి టోల్ ఛార్జీ ఆటోమేటిక్‌గా కట్‌ అవుతుంది. ఈ వ్యవస్థలో ఇప్పటికీ కొన్ని లోపాలు ఉన్నాయి, కొన్నిసార్లు టోల్ రెండుసార్లు కట్‌ అవుతూ వాహన యజమాన్లను ఇబ్బంది పెడుతోంది. మరికొన్ని సందర్భాల్లో, వాహనం టోల్ గుండా ప్రయాణించకపోయినా బ్యాంక్‌ ఖాతా నుంచి డబ్బు కట్‌ అవుతోంది. ఇంకొన్ని సందర్భాల్లో, వాహనానికి నిర్దేశించిన వర్గం కంటే ఎక్కువ టోల్‌ కట్‌ అవుతోంది. ఈ లోపాలు ఇక్కడితో ఐపోలేదు, సాంకేతిక లోపం కారణంగా వాహనంపై అదనపు ఛార్జీలు పడిన కేసులు కూడా ఉన్నాయి. ఇవన్నీ సాంకేతిక లోపాలు అయితే, కొన్నిసార్లు టోల్ ఆపరేటర్‌ తప్పు వల్ల అదనంగా డబ్బు కట్‌ అవుతోంది.


తప్పుడు టోల్ వసూలు విషయంలో కీలక సంస్కరణ
టోల్‌ ఏజెన్సీ తప్పు వల్ల వాహనదారుడి నుంచి తప్పుగా లేదా అదనంగా టోల్ వసూలు చేసినప్పుడు టోల్ ఏజెన్సీ బాధ్యత వహిస్తుందని & తప్పుగా వసూలు చేసిన టోల్ మొత్తానికి 1,500 రెట్లు జరిమానా విధించవచ్చని కేంద్ర రహదారి రవాణా & జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) గురువారం లోక్‌సభలో వెల్లడించారు.


"నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్" (NETC) ప్రోగ్రామ్‌ ద్వారా సెంట్రల్ క్లియరింగ్ హౌస్ (CCH) సేవలను అందించే 'నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' (NPCI), 2024 సంవత్సరంలో 410 కోట్ల ఫాస్టాగ్ లావాదేవీలలో 12.55 లక్షల తప్పుడు పన్ను వసూలు కేసులను నివేదించింది, ఇది మొత్తం ఫాస్టాగ్ లావాదేవీలలో 0.03 శాతం" అని నితిన్‌ గడ్కరీ లోక్‌సభలో చెప్పారు. తప్పుడు టోల్ వసూలు కేసుల్లో సంబంధిత ఏజెన్సీలపై ఇప్పటివరకు రూ. 2 కోట్లకు పైగా జరిమానా విధించడం జరిగిందని కూడా కేంద్ర మంత్రి వెల్లడించారు. 2024లో, అటువంటి 5 లక్షలకు పైగా కేసులలో డబ్బు వాపసు (Toll Collection Refund) చేశారని మంత్రి తెలిపారు.


రీఫండ్ కోసం ఇక్కడ ఫిర్యాదు చేయండి
మీ FASTag ఖాతా నుంచి పొరపాటున టోల్‌ డబ్బు కట్‌ అయితే, మీరు ఆ డబ్బు వాపసు కోసం అడగవచ్చు. దీని కోసం, మీరు టోల్ ఫ్రీ నంబర్ 1033 కు కాల్ చేసి వివరాలు చెప్పాలి. లేదా, falsededuction@ihmcl.com కు ఇ-మెయిల్ పంపవచ్చు. మీ ఫిర్యాదు స్వీకరించిన తర్వాత అధికారులు విచారణ చేసి, రిఫండ్‌ జారీ చేస్తారు.