Credit card UPI payment: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (Unified Payments Interface - UPI) ద్వారా లావాదేవీలు ఎలాంటి ఆటంకం లేకుండా, క్షణాల్లో జరిగిపోతున్నాయి. గత నెలలో (2024 డిసెంబర్), యూపీఐ లావాదేవీల సంఖ్య రికార్డు స్థాయిలో 16.73 బిలియన్లకు చేరుకుంది. నవంబర్‌లో 15.48 బిలియన్ల UPI లావాదేవీల సంఖ్య కంటే ఇది 8 శాతం ఎక్కువ.
UPIకి గణనీయంగా పెరుగుతున్న ప్రజాదరణను చూసిన ఆర్‌బీఐ, గతంలోనే, క్రెడిట్ కార్డ్‌లను కూడా UPI పరిధిలోకి తీసుకొచ్చింది. ఇప్పుడు, క్రెడిట్ కార్డ్ వినియోగదారులు కొనుగోళ్ల కోసం ఈ డిజిటల్ పేమెంట్ ఆప్షన్‌ను కూడా ఎంచుకుంటున్నారు. అంటే, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్‌ను యూపీఐ ద్వారా చేస్తున్నారు. UPI చెల్లింపు సమయంలో క్రెడిట్ కార్డ్ ఉపయోగించడం చాలా సులభం. UPI చెల్లింపు కోసం క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించాలంటే, ముందుగా మీ క్రెడిట్ కార్డ్‌ను UPIతో లింక్ చేయాలి.
యూపీఐకి క్రెడిట్ కార్డ్‌ను ఎలా లింక్ చేయాలి?
ముందుగా, UPI యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. మీరు మొదటిసారి UPIని ఉపయోగిస్తుంటే, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ కోసం 'భారత్ ఇంటర్‌ఫేస్ ఫర్ మనీ' (BHIM) యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడం ఉత్తమం. ఇప్పుడు యాప్‌ను ఓపెన్ చేసి, 'add payment method' విభాగం లోకి వెళ్లండి. అక్కడ క్రెడిట్ కార్డ్ ఆప్షన్‌ను ఎంచుకుని, మీ క్రెడిట్ కార్డ్ నంబర్, CVV & గడువు తేదీని ఎంటర్ చేయండి. డిటైల్స్ ఎంటర్ చేయగానే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. OTPని నమోదు చేస్తే మీ క్రెడిట్ కార్డ్‌ను యూపీఐతో లింక్ అవుతుంది. ఆ తర్వాత, మీ క్రెడిట్ కార్డ్ నుంచి UPI IDని క్రియేట్ చేయండి. లేదా, డీఫాల్ట్‌గా ఉన్న UPI IDని ఉపయోగించుకోవడానికి యాప్‌లోని ప్రొఫైల్ విభాగానికి వెళ్లి UPI IDని ఎంచుకోండి. చివరిగా, ఈ IDని మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయండి. ఇప్పుడు, మీరు మీ క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించి UPI ద్వారా చెల్లింపు చేయవచ్చు లేదా స్వీకరించవచ్చు. ఆన్‌లైన్ పేమెంట్స్ చేయడానికి ఇక మీ క్రెడిట్ కార్డ్‌ను వెంట తీసుకువెళ్లాల్సిన అవసరం ఉండదు.
క్రెడిట్ కార్డ్ ద్వారా UPI చెల్లింపు ఎలా చేయాలి?
క్రెడిట్ కార్డ్ ద్వారా UPI పేమెంట్ చేయడానికి, ముందుగా QR కోడ్‌ని స్కాన్ చేయండి లేదా 'pay phone number' లేదా 'pay contacts' ఎంపికను ఎంచుకుని, మీ UPI IDని నమోదు చేయండి. లేదా, యాప్‌లోని సంబంధిత చెల్లింపు ఆప్షన్‌కు వెళ్లండి. మీకు కావాలంటే, మీరు 'Self-transfer' ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు, మీ పేరిట ఉన్న ఒక ఖాతా నుంచి మీ పేరిటే ఉన్న మరొక ఖాతాకు డబ్బును బదిలీ చేయవచ్చు. QR కోడ్ లేదా ఫోన్ నంబర్‌ను ధృవీకరించిన తర్వాత, బదిలీ చేయవలసిన మొత్తాన్ని నమోదు చేయండి. చెల్లింపు కోసం క్రెడిట్ కార్డ్ ఆప్షన్ ఎంచుకోండి. ఇప్పుడు మీ పేమెంట్ PINని ఎంటర్ చేస్తే చాలు. పేమెంట్ విజయవంతమవుతుంది.
మరో ఆసక్తికర కథనం: వాహన రంగానికి కావాలి వరాలు - నిర్మలమ్మ కనికరిస్తే భారీగా తగ్గుతుంది బండి రేటు!