Credit Score: మీ క్రెడిట్‌ స్కోర్ మీ ఆర్థిక స్థితిని, క్రెడిట్‌ బిహేవియర్‌ను సూచిస్తుంది. లోన్‌ కోసం మీరు అప్లై చేసుకున్నప్పుడు.. మీ క్రెడిట్‌ స్కోర్‌ను బట్టే మీ ఫైనాన్షియల్‌ స్టేటస్‌, రిపేమెంట్‌ బిహేవియర్‌ను బ్యాంక్‌లు/ఆర్థిక సంస్థలు అంచనా వేస్తాయి. మీరు నమ్మమైన వ్యక్తా, కాదా; మీకు ఎంత లోన్‌ మంజూరు చేయవచ్చన్న విషయాన్ని క్రెడిట్‌ స్కోర్‌ ఆధారంగానే లెక్కగడతాయి. మంచి స్కోర్‌తో ఉంటే.. త్వరగా లోన్‌ రావడం, తక్కువ వడ్డీ రేటు సహా మరిన్ని చాలా ఆర్థిక ప్రయోజనాలు అందుతాయి. మరోవైపు, తక్కువ క్రెడిట్‌ స్కోరు ఉన్నవాళ్లకు ఈ అవకాశాలను యాక్సెస్ చేయడం కష్టంగా మారుతుంది.


తక్కువ వడ్డీ రేటుతో, సులభంగా లోన్‌ దక్కాలంటే క్రెడిట్ స్కోరు 750కి పైన ఉండాలి. ఒకవేళ మీ స్కోర్ 750 కంటే తక్కువలో ఉంటే, దాన్ని పెంచడానికి స్పెషల్‌ ఫోకస్‌ పెట్టాలి. 650 కంటే తక్కువగా ఉంటే మాత్రం చాలా సీరియస్‌గా తీసుకోవాలి. మీ క్రెడిట్‌ స్కోర్‌ను తక్కువ కాలంలో 100 పాయింట్ల వరకు పెంచుకునేందుకు అనేక చిట్కాలు ఉన్నాయి.


క్రెడిట్‌ మీటర్‌ పెంచుకుందాం ఇలా:


1. మీరు తీసుకున్న లోన్ల మీద చెల్లింపులను గడువు లోగా కచ్చితంగా పూర్తి చేయండి. క్రెడిట్ కార్డు బిల్లును గానీ, లోన్ EMIను గానీ లాస్ట్‌ డేట్‌ రాకముందే చెల్లించండి. ఏ కారణం వల్ల గడువు దాటినా, ఆ ప్రభావం క్రెడిట్ స్కోర్‌ మీద పడుతుంది. దీనికి బోనస్‌గా పెనాల్టీ రూపంలో మీరు మరికొంత డబ్బు కట్టాల్సి వస్తుంది.


2. ఎక్కువ లోన్లు, అవసరం లేకపోయినా క్రెడిట్ కార్డ్‌లు తీసుకోవద్దు. ఎక్కువ లోన్స్ లేదా ఎక్కువ కార్డులు మీ దగ్గరుంటే నెల తిరిగే సరికి పెద్ద మొత్తంలో డబ్బు కట్టాల్సి వస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి తారుమారై, డబ్బు కట్టకపోతే క్రెడిట్ స్కోర్‌ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి, అనవసర ప్రయాస వద్దు.


3. సురక్షిత (సెక్యూర్డ్), అసురక్షిత (అన్‌ సెక్యూర్డ్‌) రుణాలను జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోండి. మీరు తీసుకునే అప్పుల్లో ఇవన్నీ ఉండేలా చూసుకోండి. మంచి క్రెడిట్‌ మిక్స్‌ మీకు ప్లస్‌ పాయింట్‌ అవుతుంది. ఆస్తి పేపర్లు తనఖా పెట్టుకుని ఇచ్చే హోమ్ లోన్స్, కార్ లోన్స్‌ను సెక్యూర్డ్ లోన్స్ అని... తనఖా ఏమీ లేకుండా ఇచ్చే పర్సనల్ లోన్స్‌, క్రెడిట్ కార్డ్ లోన్స్‌ను అన్‌ సెక్యూర్డ్ లోన్స్‌ అని బ్యాంకులు పరిగణిస్తాయి. 


4. మీ క్రెడిట్ కార్డ్‌లోని లిమిట్‌ మొత్తాన్నీ వాడొద్దు. క్రెడిట్ కార్డు లిమిట్‌లో సగం వరకు మాత్రమే ఉపయోగించడం ఉత్తమం. మీరు తరచుగా క్రెడిట్‌ కార్డ్‌ లిమిట్‌ మొత్తాన్నీ వాడుతుంటే, అనవసర ఖర్చులు పెట్టే వ్యక్తిగా బ్యాంకులు మిమ్మల్ని పరిగణిస్తాయి. లోన్‌ ఇచ్చే సమయంలో ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుంటాయి.


5. నెల నెలా మీరు చెల్లించే EMIల మొత్తం మీ నెలవారీ జీతం లేదా మొత్తం ఆదాయంలో 50 శాతం దాటకుండా చూసుకోండి. ఇలాంటి నియంత్రణ పాటిస్తే గడువులోగా EMIలన్నీ వెళ్లిపోతాయి. క్రెడిట్‌ స్కోర్‌ సాఫీగా పెరుగుతుంది.


6. లోన్లు లేదా క్రెడిట్‌ కార్డుల కోసం పదేపదే అప్లై చేయొద్దు. ఇలా చేస్తే మీ మీద నెగెటివ్‌ ఇంపాక్ట్‌ పడుతుంది. మీరేదో అత్యవసరంలో ఉన్నారని, అప్పు తీసుకున్నాక చెల్లించే పరిస్థితి మీకు ఉంటుందో, లేదోనని ఆర్థిక సంస్థలు అనుమానిస్తాయి. మీ క్రెడిట్‌ రిపోర్ట్‌లోనూ ఈ నెగెటివ్‌ రిమార్క్‌ పడుతుంది.


7. రేటింగ్‌ ఏజెన్సీలు ఇచ్చే క్రెడిట్ రిపోర్ట్‌లు దాదాపు కరెక్ట్‌గానే ఉంటాయి. ఒక్కోసారి వాటిలో తప్పులు దొర్లే అవకాశముంది. కాబట్టి, మీ క్రెడిట్ రిపోర్ట్‌ను 3-4 నెలలకు ఒకసారైనా పరిశీలించండి. ఒకవేళ ఏదైనా తప్పు కనిపిస్తే, కస్టమర్‌ కేర్‌కు కాల్‌ చేసి సాధ్యమైనంత త్వరగా సరిచేయించుకోండి.


మరో ఆసక్తికర కథనం: ఇల్లు కడుతున్నారా?, ఈ వార్త చదివితే ఎగిరి గంతేస్తారు 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial