Gold Quality Check: ఈ రోజుల్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పెళ్లిళ్లు అయినా, పండుగలు అయినా లేదా పెట్టుబడి పెట్టడానికి అవకాశం అయినా, ప్రజలు తమ డబ్బును సురక్షితమైన స్థలంలో ఉంచాలని కోరుకుంటారు. బంగారం కంటే మంచి ఎంపికలు చాలా తక్కువ. కానీ డిమాండ్ పెరగడంతోపాటు మోసం చేసే వాళ్లు, నకిలీ బంగారం అంటగట్టే ఘటనలు చూస్తూనే ఉన్నాం. చాలా మంది బరువు లేదా మెరుపును చూసి బంగారం నిజమైనదిగా భావిస్తారు, అయితే ఇప్పుడు నకిలీ ఆభరణాలు కూడా నిజమైన వాటిలాగే కనిపిస్తాయి. అటువంటి పరిస్థితిలో, అసలైన, నకిలీ బంగారాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. దీనికి మీరు కొన్ని సులభమైన మార్గాల ద్వారా ఇంట్లో కూర్చొని బంగారం నాణ్యతను తనిఖీ చేయవచ్చు. మీరు కొనుగోలు చేసిన బంగారం నిజమైనదా లేదా కాదా అని తెలుసుకోవచ్చు. కాబట్టి, ఇంట్లో కూర్చొని మార్కెట్ నుంచి కొనుగోలు చేసిన బంగారం అసలైనదా లేదా నకిలీదా అని ఎలా తనిఖీ చేయాలో తెలుసుకుందాం.
బంగారం అసలైనదా లేదా నకిలీదా అని ఇంట్లో ఎలా తెలుసుకోవాలి?
ఇప్పుడు మీరు ప్రతిసారీ బంగారం పరీక్ష కోసం బంగారం తయారు చేసే వాళ్లను సంప్రదించాల్సిన అవసరం లేదు. కొన్ని సులభమైన మార్గాల ద్వారా మీరు కూడా దీన్ని తనిఖీ చేయవచ్చు.
1. హాల్‌మార్క్ చూసి గుర్తించండి - హాల్‌మార్క్ చూడటం చాలా సులభమైన, నమ్మదగిన మార్గం. హాల్‌మార్క్ అనేది బంగారం ఎంత శాతం స్వచ్ఛమైనదో తెలిపే ప్రభుత్వ ధృవీకరణ విధానం. భారతదేశంలో, BIS హాల్‌మార్క్‌ను ధృవీకరిస్తుంది. ఆభరణాలపై హాల్‌మార్క్ లేకపోతే, అది నకిలీ లేదా కల్తీ కావచ్చు.
2. అయస్కాంతంతో పరీక్షించండి - ఇది ఒక సాధారణ హోంట్రిక్. బంగారం ఒక అయస్కాంత ఆకర్షణకు గురి కాని లోహం. మీరు ఆభరణాల వద్ద అయస్కాంతం పెడితే అది ఆకర్షించగలిగిత అందులో కల్తీ ఉందని అర్థం చేసుకోండి. అయస్కాంతం ఎటువంటి ప్రభావాన్ని చూపకపోతే, ఆభరణాలు నిజమైనవి కావచ్చు.
3. నీటిలో ముంచి పరీక్షించండి - ఇంట్లో కూర్చొని అసలైన లేదా నకిలీ బంగారాన్ని పరీక్షించడానికి, ఒక పాత్రలో శుభ్రమైన నీరు నింపి, అందులో ఆభరణాలను వేయండి. నిజమైన బంగారం బరువుగా ఉంటుంది, కాబట్టి అది నీటిలో మునిగిపోతుంది. ఆభరణాలు తేలియాడితే, అది నకిలీ లేదా కల్తీ కావచ్చు.
4. వెనిగర్‌తో పరీక్షించండి - అసలైన లేదా నకిలీ బంగారాన్ని పరీక్షించడానికి, ఆభరణాలపై 2-3 చుక్కల వెనిగర్ వేయండి. దాని రంగు మారడం ప్రారంభిస్తే, అందులో కల్తీ ఉంది. ఎటువంటి మార్పు లేకపోతే, ఆభరణాలు నిజమైనవి కావచ్చు.
5. సిరామిక్ ప్లేట్‌పై రుద్దడం ద్వారా పరీక్షించండి - ఇంట్లో కూర్చొని అసలైన లేదా నకిలీ బంగారాన్ని పరీక్షించడానికి, పాలిష్ చేయని తెల్లటి సిరామిక్ ప్లేట్ తీసుకోండి. ఆభరణాలను తేలికగా దానిపై రుద్దండి. ఆభరణాల నుంచి బంగారు గీతలు వస్తే, అది నిజమైనది. నల్లటి గీతలు వస్తే అది నకిలీది.
6. క్యారెట్‌ల ద్వారా బంగారం నాణ్యతను అర్థం చేసుకోండి - బంగారం నాణ్యతను క్యారెట్‌లలో కొలుస్తారు. ఉదాహరణకు, 24 క్యారెట్ల బంగారం 99.9 శాతం స్వచ్ఛమైనది, కానీ చాలా మృదువుగా ఉంటుంది. ఇది ఎక్కువగా నాణేలు, కడ్డీలలో ఉపయోగిస్తారు. అదే సమయంలో, 22 క్యారెట్ల బంగారం 91.6 శాతం స్వచ్ఛమైంది . ఆభరణాలకు అనువైనది. 18 క్యారెట్లు, 14 క్యారెట్ల బంగారంలో ఇతర లోహాలు ఎక్కువగా కలుపుతారు, దీని వలన ఇది చౌకగా, కొంచెం తక్కువ స్వచ్ఛంగా ఉంటుంది. క్యారెట్లు ఆభరణాలపై రాసి ఉంటుంది. కాబట్టి కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా తనిఖీ చేయండి.