Household financial Savings:


భవిష్యత్తు అవసరాల కోసం కుటుంబాలు దాచుకొనే సొమ్ము రాను రాను తగ్గిపోతోంది. FY22లో జీడీపీలో 7.3 శాతంగా ఉన్న నికర ఆదా సొమ్ము ఈ ఏడాది ప్రథమార్థంలో 4 శాతానికి తగ్గిపోయిందని అంచనా. పెరిగిపోతున్న ఖర్చులు, ఇంటి అవసరాల కోసం వీటిని ఖర్చు చేస్తున్నారని సమాచారం.


ప్రస్తుత ఆర్థిక ఏడాది ప్రథమార్ధంలో కుటుంబాల సేవింగ్స్‌ రూ.5.2 లక్షల కోట్లు ఉండొచ్చని మోతీలాల్‌ ఓస్వాల్‌ అంచనా వేసింది. 2022లో ఇది రూ.17.2 లక్షల కోట్లని వివరించింది. రాబోయే త్రైమాసికాల్లో దాచుకొనే సొమ్ము పెరగకపోతే ఈ ట్రెండ్‌ ఇలాగే కొనసాగే అవకాశం ఉంటుంది. ఫలితంగా వినియోగం, పెట్టుబడులపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


చివరి ఐదేళ్లలో కుటుంబాల ఆదా జీడీపీలో 20 శాతంగా ఉండేదని మోతీలాల్‌ ఓస్వాల్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. H1FY23లో ఇది 15.7 శాతానికి తగ్గిందని పేర్కొంది. నిత్యావసర, వినియోగ వస్తువుల ధరలు పెరగడంతో కొనుగోళ్లు చేసేందుకు ఆదా సొమ్మును వాడుతున్నారని కంపెనీ ప్రధాన ఆర్థిక సలహాదారు నిఖిల్‌ గుప్తా అంటున్నారు. అయితే ఈ ఆర్థిక ఏడాది ద్వితీయార్ధంలో వ్యక్తిగత ఆర్థిక వినియోగ ఖర్చులు తగ్గే అవకాశం ఉందన్నారు.


నూతన నియామకాలు తగ్గడం, డిమాండ్‌ తగ్గుదల, అధిక ద్రవ్యోల్బణం, ఇంటి ఈఎంఐల పెరుగుదల కుటుంబాల ఆదా సొమ్ము తగ్గేందుకు కారణాలని కొటక్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ విశ్లేషకులు అంటున్నారు. ఫలితంగా అన్ని రంగాల్లో డిమాండ్‌ తగ్గిందని పేర్కొంటున్నారు. అందుకే పండగల తర్వాత మార్కెట్‌ డల్‌గా ఉందంటున్నారు. రెండో త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ రంగం 8.9 శాతం వృద్ధి నమోదు చేస్తుందని నీల్సన్‌ కంపెనీ అంచనా వేస్తోంది. చివరి త్రైమాసికంతో పోలిస్తే 2 శాతం తక్కువేనని వెల్లడించింది. గ్రామీణ మార్కెట్లోనూ పతనం ఎక్కువగానే ఉందని తెలిపింది.


జీడీపీలో కుటుంబాల ఆదా సొమ్ము 2019, 20, 21లో వరుసగా 7.9 శాతం, 8.1 శాతం, 12 శాతంగా ఉండేది. 2022లో అది 7.3 శాతానికి తగ్గింది. ఈ ఏడాది ప్రథమార్ధంలోనే 4 శాతానికి దిగజారింది. ఇదే సమయంలో కుటుంబాల అప్పులు వరుసగా 33.5, 34.8, 39.3, ౩6.8, 36 శాతంగా ఉన్నాయని మోతీలాల్‌ ఓస్వాల్‌ తెలిపింది.


సోషల్ మీడియాలో ఏబీపీ దేశం ఫాలో అవ్వండి: