Home Loan: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ‍‌(Reserve Bank Of India), ఈ ఆర్థిక సంవత్సరంలో (2022-23) రెపో రేటును వరుసగా ఆరోసారి పెంచింది. తాజాగా, రెపో రేటును 0.25 శాతం పెంచుతూ సెంట్రల్ బ్యాంక్‌ బుధవారం ‍‌(08 ఫిబ్రవరి 2023) ప్రకటించింది. దీంతో కలిపి, 2022 మే నెల నుంచి 2023 ఫిబ్రవరి వరకు రెపో రేటు 2.5 శాతం పెరిగింది. 2022 మేలో రెపో రేటు 4.0 శాతంగా ఉంటే, తాజా పెంపు తర్వాత అది పెరిగి పెరిగి 6.50 శాతానికి చేరింది. 


వడ్డీ రేటు పెంపు తర్వాత, బ్యాంకుల నుంచి తీసుకున్న గృహ రుణం (Home Loan), కారు లోన్‌ (Car Loan) వంటి వాటి మీద నెలవారీ వాయిదాల (EMI) భారం పెరిగింది.


మీరు కూడా హోమ్ లోన్ తీసుకున్నట్లయితే, మీ నెలవారీ హోమ్ లోన్ EMI మొత్తం పెరుగుతుంది లేదా హోమ్ లోన్‌ను తిరిగి చెల్లించే కాల పరిమితి పెరుగుతుంది. ఉదాహరణ చూస్తే... మీరు గత ఏడాది మే నెలలో 7 శాతం వడ్డీ వద్ద రెపో ఆధారిత గృహ రుణం తీసుకుంటే, ప్రస్తుత పెంపు తర్వాత అది 9.5 శాతానికి చేరింది. అంటే, చెల్లించాల్సిన వడ్డీ ఏడాదిలోనే (రెపో రేటు పెంపునకు అనుగుణంగా) 2.5 శాతం పెరిగింది. ఇంతలా పెరిగిన వడ్డీతో కలిసి మీ రుణ భారాన్ని లెక్కిస్తే తడిసి మోపెడవుతుంది. 20 ఏళ్ల కాల వ్యవధి కోసం మీరు తీసుకున్న అప్పును తిరిగి తీర్చడానికి ఇప్పుడు 30 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. 


వడ్డీ రేట్ల పెంపు ఇదే ఆఖరు కాదు
వడ్డీ రేట్ల పెంపు ఇదే ఆఖరు అని రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ అభయం ఏమీ ఇవ్వలేదు. పైగా, ద్రవ్యోల్బణాన్ని కిందకు దించడమే తమ ప్రథమ కర్తవ్యంగా చెప్పుకొచ్చారు. అంటే, భవిష్యత్‌లో వడ్డీ రేట్ల పెంపు కొనసాగవచ్చన్న సూచన కూడా ఇచ్చారు. ఈ లెక్కన మీ ఇంటి రుణ భారం మరింత పెరిగి, EMIల చెల్లింపులు సుదీర్ఘ కాలం పాటు కొనసాగే అవకాశం ఉంది. ఈ పరిస్థితిలో, గృహ రుణాలు తీసుకున్న వాళ్ల ఏం చేయాలి అనేది అతి పెద్ద ప్రశ్న. 
వడ్డీ రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో దీర్ఘకాలం పాటు EMIలు చెల్లిస్తూ వెళ్లడం తెలివైన పని కాదన్నది ఆర్థిక నిపుణుల సూచన. రుణ భారాన్ని తగ్గించుకునేందుకు EMI మొత్తాన్ని పెంచుకోవడం, అసలు రుణాన్ని సాధ్యమైనంత వరకు ముందస్తుగానే చెల్లిస్తూ (Prepay) వెళ్లడం ఉత్తమంగా చెబుతున్నారు.


రుణగ్రహీత చేయాల్సిన తెలివైన పనేంటి?
తెలివైన పెట్టుబడిదారు ఎప్పుడూ నిపుణుల సూచనను పాటిస్తాడు. మీ ఇంటికి సంబంధించి, మీ వ్యక్తిగతంగా అవసరం లేని ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా పొదుపును పాటించాలి. ఆ డబ్బును ఇంటి రుణం EMIలోకి మళ్లించాలి. మీరు సంవత్సరానికి ఒకసారి మీ EMI మొత్తాన్ని 5-10% వరకు పెంచుకునేందుకు ప్రయత్నించండి. ఈ మొత్తం మీకు పెద్ద భారం అవ్వదు. మీ ఆదాయం పెరిగిన ప్రతి సందర్భంలోనూ దీనిని పాటించండి. ఇది మీ లోన్ కాల పరిమితిని తగ్గిస్తుంది, రుణం చాలా త్వరగా తీరిపోతుంది. 


ఒకవేళ, EMI మొత్తాన్ని పెంచుకోవడం ఇబ్బంది అనుకున్న వాళ్లు, రుణం అసలులో ఏటా 5 శాతాన్ని తిరిగి చెల్లించే ప్రయత్నం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల 20 ఏళ్ల కాల పరిమితి అప్పును మీరు 12 సంవత్సరాల్లోనే తిరిగి చెల్లించవచ్చు. మీరు రుణ అసలులో ఏడాదికి 5% కంటే ఎక్కువ చెల్లిస్తూ వెళితే, కొన్నేళ్లకు ముందస్తు చెల్లింపుల అవసరం ఉండదు. అప్పుడు అదే మొత్తాన్ని ఎక్కువ రాబడి అందించే మార్గాల్లోకి మళ్లించవచ్చు. ఈ విధంగా రుణం తొందరగా తీర్చడంతోపాటు, సంపదను సృష్టించేందుకు కూడా వీలు కలుగుతుంది.