HDFC Bank reduces MCLR: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నుంచి హోమ్ లోన్ తీసుకునే వాళ్లకు, తీసుకున్న వాళ్లకు శుభవార్త. మీ గృహ రుణంపై నెలనెలా చెల్లించాల్సిన/ చెల్లిస్తున్న EMI ఇప్పుడు తగ్గింది. మరికొన్ని రుణాల EMIలు కూడా తగ్గవచ్చు. HDFC బ్యాంక్, కొన్ని రకాల రుణాల రేట్లలో మార్పులు చేసింది. ఆయా లోన్లు తీసుకున్నవాళ్లు, తీసుకోబోయేవాళ్లు లబ్ధి పొందనున్నారు. HDFC బ్యాంక్, తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR)ను తగ్గించింది.
HDFC బ్యాంక్, MCLRను ఐదు బేసిస్ పాయింట్లు (0.05%) తగ్గించింది. ఈ సవరణ తర్వాత MCLR రేట్లు 9.15% నుంచి 9.45% మధ్యలోకి చేరాయి, రుణగ్రహీతలకు కాస్త ఉపశమనం కలిగించాయి.
తగ్గిన లోన్ రేటు జనవరి 07 నుంచి వర్తింపు
HDFC బ్యాంక్ తగ్గించిన రుణ రేటు (కొత్త రేట్లు) 2025 జనవరి 07వ తేదీ, మంగళవారం నుంచి అమలులోకి వచ్చాయి. గృహ రుణం, వ్యక్తిగత రుణం (Personal loan), వ్యాపార రుణాలు (Business Loans) MCLRతో అనుసంధానమై ఉంటాయి. ఇప్పుడు, రుణ రేటును తగ్గించడం వల్ల, ఇప్పటికే తీసుకున్న ఈ మూడు రకాల లోన్‌లపై (హోమ్ లోన్, పర్సనల్ లోన్ & బిజినెస్ లోన్) మునుపటి కంటే తక్కువ EMI చెల్లిస్తే చాలు.
ఓవర్‌నైట్ MCLRను ఐదు బేసిస్ పాయింట్ల కోతతో, 9.20% నుంచి 9.15%కు తగ్గించారు. 6 నెలలు & ఒక సంవత్సరానికి MCLR 9.50% నుంచి 9.45%కు తగ్గింది. మూడేళ్ల ఎంసీఎల్‌ఆర్‌లోనూ ఇదే మార్పు జరిగింది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఇచ్చే ప్రాథమిక రుణ రేటు సంవత్సరానికి 9.45%. వివిధ అంశాలు & పరిస్థితులపై ఆధారపడి స్వల్ప వ్యత్యాసాలు ఉంటాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ హోమ్ లోన్‌పై వడ్డీ రేటు (HDFC Bank home loan interest rate), రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు (RBI Repo Rate)పై ఆధారపడి మారుతూ ఉంటుంది.
MCLR అంటే ఏంటి?
MCLR అంటే.. అన్ని రకాల రుణాలు ఇవ్వడానికి ఒక బ్యాంక్ నిర్ణయించిన ప్రాథమిక కనీస రేటు. రుణ ఖర్చులు, లాభం, మరికొన్ని ఇతర అంశాలను కలుపుకుని ప్రతి బ్యాంక్ MCLRను నిర్ణయిస్తుంది. ఇది కనిష్ట రేటు, ఈ రేటు కంటే తక్కువ రేటుకు బ్యాంక్ రుణాలు ఇవ్వదు. రెపో రేట్‌లో రిజర్వ్ బ్యాంక్ మార్పులు చేస్తే తప్ప రెపో రేట్ కూడా మారుతుంది, లేకపోతే దాదాపు అదే స్థాయిలో కొనసాగుతుంది.
మారిన ఎఫ్‌డీ రేట్లు
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రూ. 3 కోట్లకు పైబడి & రూ. 5 కోట్ల కంటే తక్కువ ఉన్న బల్క్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (bulk fixed deposits) వడ్డీ రేట్లను కూడా సవరించింది. రివిజన్ తర్వాత... FDలు సాధారణ ప్రజలకు 4.75% నుంచి 7.40% వరకు & సీనియర్ సిటిజన్‌లకు 7.90% వరకు, కాల వ్యవధిని బట్టి మార్పులు చేసింది.
మీరు లోన్ తీసుకోవాలనుకుంటున్నా లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తున్నా, ఇలాంటి మార్పుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం వల్ల మీ ఆర్థిక నిర్ణయాలు మరింత మెరుగ్గా ఉంటాయి.
మరో ఆసక్తికర కథనం: మిమ్మల్ని ఎప్పుడూ 'పవర్‌ఫుల్'గా ఉంచే బెస్ట్ వైర్‌లెస్ 'పవర్ బ్యాంక్'లు