HDFC Bank Hikes MCLR by 35 bps Effect from May 7 Housing Vehicle Personal Loan EMI Become Expensive : దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ (HDFC Bank) కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల రుణాలపై ఎంసీఎల్‌ఆర్‌ (MCLR) వడ్డీరేటును 35 బేసిస్‌ పాయింట్ల మేర పెంచింది. 2022, జూన్‌ 7 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. కొన్ని రోజుల ముందే హెచ్‌డీఎఫ్‌సీ 25 బేసిస్‌ పాయింట్ల మేర ఎంసీఎల్‌ఆర్‌ రేటును పెంచడం గమనార్హం. మొత్తంగా కస్టమర్లపై ఈఎంఐ (EMI) భారం మరింత పెరుగనుంది.


ఎంసీఎల్‌ఆర్‌ రేటును పెంచితే గృహ, వాహన, వ్యక్తిగత, ఇతర రుణాలు మరింత ప్రియం అవుతాయి. వివిధ రుణాలపై చెల్లించాల్సిన నెలసరి వాయిదాల మొత్తం పెరుగుతుంది. సోమవారం రాత్రి వరకు హెచ్‌డీఎఫ్‌సీ ఎంసీఎల్‌ఆర్ వడ్డీరేటు 7.15 శాతంగా ఉండగా ఇప్పుడది 7.55 శాతానికి చేరుకుంది.


ప్రస్తుతం నెల రోజుల ఎంసీఎల్‌ఆర్‌ 7.55 శాతంగా ఉండగా 3, 6 నెలల ఎంసీఎల్‌ఆర్‌ వరుసగా 7.60%, 7.70%గా ఉన్నాయి. సాధారణంగా వినియోగదారుల రుణాలు ఎక్కువగా వార్షిక ఎంసీఎల్‌ఆర్‌కు అనుసంధానమై ఉంటాయి. ఇప్పుడా రేటు 7.85 శాతంగా మారింది. రెండు, మూడేళ్ల రేటు వరుసగా 7.95%, 8.05% ఉండటం గమనార్హం.


ఇంటి రుణాలు తీసుకున్న కస్టమర్లు ఓ విషయం గమనించాలి. మీ లోన్ రీసెట్‌ తేదీ సమీపించినప్పుడు మాత్రమే ఈఎంఐపై సవరించిన ఎంసీఎల్‌ఆర్‌ రేటు అమల్లోకి వస్తుంది. రీసెట్‌ తేదీ రాగానే మీ ఇంటి రుణంపై అప్పటి ఎంసీఎల్‌ఆర్‌ను బ్యాంకు వర్తింపజేస్తుంది. సాధారణంగా బ్యాంకులు ఇంటి రుణాలను వార్షిక వడ్డీరేటుకు అనుసంధానం చేస్తాయి.


ఉదాహరణకు మీ ఇంటిరుణం ఎంసీఎల్‌ఆర్‌కు లింకైందని అనుకుందాం. ఆగస్టులోనే రీసెట్‌ తేదీ వచ్చిందనుకుందాం. అలాంటప్పుడు మీ హౌజ్‌ లోన్‌ ఈఎంఐ ఆగస్టులోనే పెరుగుతుంది. అప్పటి వరకు పాతదే ఉంటుంది. సాధారణంగా రుణాల వడ్డీరేట్లను ప్రతి మూడు నెలలకు సమీక్షిస్తారు. అందుకే రెపో రేటు పెంచగానే ఈఎంఐపై భారం పెరుగుతుంది.