HDFC Bank Hikes Interest Rates: దేశంలో అతి పెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన HDFC బ్యాంక్, తన రుణ రేట్లను మరింత పెంచింది. ఈ నిర్ణయం వల్ల, ఇప్పటికే లోన్లు తీసుకున్న కస్టమర్లతో పాటు, తీసుకోనున్న వాళ్ల మీద EMI భారం పెరుగుతుంది. 


HDFC బ్యాంక్ వెబ్‌సైట్‌ ప్రకారం... MCLRను (Marginal Cost Of Lending Rates) 15 బేసిస్ పాయింట్ల మేర ఈ బ్యాక్‌ పెంచింది. కొత్త రేట్లు శుక్రవారం (జులై 7, 2023‌) నుంచి అమల్లోకి వచ్చాయి.


HDFC బ్యాంక్ లోన్స్‌పై కొత్త వడ్డీ రేట్లు:


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎంసీఎల్‌ఆర్‌లో పెరుగుదల ప్రకారం... ఓవర్‌నైట్ (ఒక్కో రోజు కోసం ఇచ్చే లోన్‌) MCLR 15 బేసిస్ పాయింట్లు పెరిగి 8.25 శాతానికి చేరుకుంది, ఇది గతంలో 8.10 శాతంగా ఉంది. 
1 నెల MCLR 10 బేసిస్ పాయింట్లు పెరిగి 8.20 శాతం నుంచి 8.30 శాతానికి పెరిగింది
3 నెలల MCLR 10 బేసిస్ పాయింట్లు పెంచిన బ్యాంక్‌, 8.60 శాతానికి చేర్చింది
6 నెలల MCLR 5 బేసిస్ పాయింట్లు పెరిగి 8.90 శాతానికి చేరింది 
1 సంవత్సరం పైబడిన లోన్ల విషయంలో MCLRలో ఎలాంటి మార్పు లేదు. ఏడాది టెన్యూర్‌తో ఉన్న లోన్ల మీద ఎంసీఎల్‌ఆర్‌ ప్రస్తుతం 9.05 శాతంగా ఉంది. HDFC బ్యాంక్‌ ఇస్తున్న కన్జ్యూమర్‌ లోన్లలో ఎక్కువ శాతం 1 సంవత్సరం కంటే ఎక్కువ టెన్యూర్‌తోనే ఉన్నాయి.


MCLR ఆధారంగా తీసుకున్న పర్సనల్‌ లోన్స్‌, ఫ్లోటింగ్ ఆటో లోన్స్‌ (వాహన రుణాలు) మీద చెల్లించాల్సిన వడ్డీ రేట్లపై ప్రభావం చూపుతాయి. కాబట్టి, పర్సనల్‌ లోన్స్, వెహికల్‌ లోన్స్‌ తీసుకున్నవాళ్లకు EMI భారం పెరుగుతుంది. 


ప్రస్తుతం, బ్యాంకులు ఇస్తున్న హౌసింగ్‌ లోన్స్‌ RBI రెపో రేటుతో అనుసంధానమై ఉంటాయి. కాబట్టి, MCLRను పెంచుతూ HDFC బ్యాంక్ తీసుకున్న నిర్ణయం హోమ్‌ లోన్‌ కస్టమర్లపై ఎలాంటి ప్రభావం చూపదు. గృహ రుణాలు తీసుకున్న వాళ్లకు ఇబ్బంది లేదు, EMI అమౌంట్‌ పెరగదు. 


MCLRను పెంచుతూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తీసుకున్న నిర్ణయం మార్కెట్‌ను ఆశ్చర్య పరిచింది. ఎందుకంటే, గత రెండు మానిటరీ పాలసీ కమిటీ సమావేశాల్లోనూ రెపో రేట్లలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతోంది కాబట్టి, వచ్చే నెలలో (ఆగస్టు) జరిగే MPC భేటీలోనూ కూడా పాలసీ రేట్లను RBI పెంచకపోవచ్చన్న అంచనాలు ఉన్నాయి. 


HDFC బ్యాంక్‌ - HDFC మెర్జర్‌
HDFC బ్యాంకుకు ఈ నెల చాలా ప్రత్యేకం. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ & పేరెంట్‌ కంపెనీ అయిన HDFC, ఈ నెల 1 (01 జులై 2023) నుంచి HDFC బ్యాంక్‌లో విలీనం అయింది. హెచ్‌డీఎఫ్‌సీ షేర్ల ట్రేడింగ్ ఈ నెల 12 సాయంత్రం నుంచి స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో నిలిచిపోతుంది. ఈ నెల 13 నుంచి HDFC బ్యాంక్‌ టిక్కెట్‌ పైనే HDFC షేర్లు కూడా ట్రేడ్‌ అవుతాయి. 


మెర్జర్‌ అగ్రిమెంట్‌ ప్రకారం.. షేర్ల కేటాయింపు కోసం అర్హులైన షేర్‌హోల్డర్లను నిర్ణయించడానికి ఈ నెల 13ను రికార్డ్ డేట్‌గా నిర్ణయించారు. అర్హులైన షేర్‌హోల్డర్లకు, హెచ్‌డీఎఫ్‌సీలో హోల్డ్‌ చేస్తున్న ప్రతి 25 షేర్లకు బదులు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు చెందిన 42 షేర్లు కేటాయిస్తారు.