PAN-Aadhaar Link Deadline Extension: శాశ్వత ఖాతా నంబర్‌ను (PAN) ఆధార్ నంబర్‌తో అనుసంధానించే గడువు మరికొన్ని రోజుల్లో ముగియనుంది. అయితే, ఈ డెడ్‌లైన్‌ను ప్రభుత్వం మరో 'రెండు నుంచి మూడు నెలల వరకు' పొడిగించే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ అధికారుల మాటలను బట్టి ఇది అర్ధం అవుతోంది.
త్వరలో CBDT నోటిఫికేషన్
పాన్-ఆధార్ నంబర్ అనుసంధాన గడువును పెంచుతూ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (Central Board of Direct Taxes- CBDT) త్వరలోనే ఒక నోటిఫికేషన్ జారీ చేయవచ్చని ఒక ప్రభుత్వ అధికారి ఒక జాతీయ వార్త పత్రికకు చెప్పారు. ఈ వార్త విషయంలో తన పేరు వెల్లడించవద్దని కోరారు.
పాన్-ఆధార్ లింకింగ్ గడువు పెంచుతూ CBDT నోటిఫికేషన్ జారీ చేసినా, ఆ కాలానికి ఆలస్య రుసుము (late fee for PAN-Aadhaar linking) చెల్లించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ ఇంకా రాలేదు కాబట్టి, పాన్-ఆధార్‌ను అనుసంధానించడానికి చివరి తేదీని (PAN-Aadhaar linking deadline) మార్చి 31, 2023గానే ప్రస్తుతం లెక్కలోకి తీసుకోవాలి.
ప్రభుత్వం ఇప్పటికే నాలుగు సార్లు ఈ గడువును పొడిగించింది. చివరిసారిగా.. 2022 మార్చి 30న, పాన్-ఆధార్ నంబర్ అనుసంధాన డెడ్‌లైన్‌ను ఒక సంవత్సరం పాటు పొడిగించిన కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్, 2022 ఏప్రిల్ 1 నుంచి మూడు నెలల వరకు రూ. 500 ఆలస్య రుసుమును వసూలు చేసింది. ఆ తర్వాత రూ. 1000 లేట్ ఫీజ్ నిర్ణయించింది.
ఆదాయ పన్ను చట్ట ప్రకారం చర్యలు
2023 మార్చి 31వ తేదీ లోగా తమ పాన్‌ను ఆధార్ సంఖ్యతో అనుసంధానించడంలో విఫలమైన వ్యక్తుల పాన్ నిష్క్రియంగా (inoperative) మారుతుంది. తద్వారా, పాన్ సమాచారాన్ని మీరు ఉద్దేశపూర్వకంగా ఆదాయ పన్ను విభాగానికి అందించనట్లు పరిగణిస్తారు. పాన్ సమాచారం తెలియజేయడంలో విఫలమైనందుకు ఆదాయపు పన్ను చట్టం ప్రకారం వర్తించే అన్ని పరిణామాలు లేదా చర్యలు అటువంటి పన్ను చెల్లింపుదార్లకు వర్తిస్తాయని ఆదాయ పన్ను విభాగం చెప్పింది.
పాన్‌తో ఆధార్ సంఖ్యను ఎందుకు లింక్ చేయాలి?
ప్రతి ఒక్కరి KYCలో పాన్, ఆధార్ ముఖ్యమైన భాగం. పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీనివల్ల నకిలీ పాన్ కార్డుల వినియోగాన్ని నిరోధించవచ్చు. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉన్న కేసులు కూడా చాలా బయటపడ్డాయి. ఇలాంటి వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.
పాన్‌ను ఆధార్ సంఖ్యతో అనుసంధానించడంలో విఫలమై పాన్ కార్డ్ డియాక్టివేట్ అయితే, అప్పుడు సదరు పన్ను చెల్లింపుదారు ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయలేడు. అలాగే, కొత్త పాన్ పొందేందుకు ఆధార్‌ను ఇవ్వడం తప్పనిసరి. ఆధార్ - పాన్ లింక్ చేయకపోతే ఈ విషయంలోనూ ఇబ్బందులు ఎదురవుతాయి. దీంతో పాటు... కొత్తగా ఒక బ్యాంక్ అకౌంట్ లేదా డీమ్యాట్ అకౌంట్ వంటివి కూడా ఓపెన్ చేయలేడు. షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ వంటి స్టాక్ మార్కెట్ పెట్టుబడులు పెట్టలేడు.
కాబట్టి, మీరు ఇప్పటికీ మీ పాన్ - ఆధార్ అనుసంధానాన్ని పూర్తి చేయకపోతే తక్షణమే ఆ ప్రక్రియ పూర్తి చేయండి.