ప్రపంచ దేశాలతో పోల్చితే భారత్‌లో బంగారం ధరలులో నిరంతర పెరుగుదల కనిపిస్తోంది. ధరలు పెరగడంతో పాటు దొంగతనాలు, చైన్ స్నాచింగ్, ఇళ్లలో చోరీలు వంటి సంఘటనలు కూడా సర్వసాధారణం అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో బంగారం నగలు కొనేవారిలో ఆందోళన సైతం పెరుగుతోంది. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, బంగారం నగలు కొనుగోలు చేసినప్పుడు, దానితో పాటు ఉచిత గోల్డ్ ఇన్సూరెన్స్ సైతం లభిస్తుంది. దీనివల్ల బంగారం నగలు దొంగిలించినా లేదా నష్టపోయినా పూర్తి డబ్బు తిరిగి పొందవచ్చు. కనుక బంగారం నగలు కొనుగోలు చేసిన వెంటనే ఒక ఏడాది పాటు బీమా ఎలా లభిస్తుందో ఇక్కడ వివరాలు తెలుసుకుందాం.
గోల్డ్ జ్యువెలరీ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?
వాస్తవానికి గోల్డ్ ఇన్సూరెన్స్ అనేది బంగారు నగలకు భద్రత కల్పించే బీమా కవరేజ్ (Gold Jewellery Insurance). కారు, ఇల్లు లేదా హెల్త్ ఇన్సూరెన్స్ మాదిరిగానే మీ బంగారు ఆభరణాలను ఈ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. బీమా కాలపరిమితిలో నగలు చెరీ అయినా, పోగొట్టుకున్నా, అగ్నిప్రమాదంలో కాలిపోయినా లేదా వరద వంటి పరిస్థితుల్లో పాడైపోయినా, ఇన్సూరెన్స్ కంపెనీ వాటి విలువను భర్తీ చేయనుంది. బంగారం నగలు కొనుగోలు చేసే సమయంలో ఈ జ్యువెలరీ ఇన్సూరెన్స్ వివరాలు అడిగి తెలుసుకుంటే మరీ మంచిది.
బంగారం నగలు కొనుగోలు చేస్తే 1 సంవత్సరం పాటు ఉచిత బీమా
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, మీరు ఒక ప్రసిద్ధ జ్యువెలరీ షాప్ నుండి బంగారం కొనుగోలు చేసినప్పుడు, సాధారణంగా ఒక ఏడాది పాటు ఉచిత ఇన్సూరెన్స్ లభిస్తుంది. ఈ ఉచిత ఇన్సూరెన్స్ పాలసీ కింద, కంపెనీ మీకు జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తుంది. దీని కోసం కస్టమర్ ప్రత్యేకంగా నగదు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఏ పరిస్థితుల్లో క్లెయిమ్ లభిస్తుంది?
గోల్డ్ ఇన్సూరెన్స్ కింద దొంగతనం, చైన్ స్నాచింగ్, దోపిడీ, అగ్నిప్రమాదం, భూకంపం, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలతో పాటు రవాణా సమయంలో జరిగే నష్టాలు కవర్ అవుతాయి. కొన్ని పాలసీలలో అల్లర్లు, సమ్మెలు వంటి సంఘటనలలో నగలు పోయినా, దెబ్బతిన్నా ప్రయోజనం లభిస్తుంది. అయితే, బీమా క్లెయిమ్ కోసం అత్యంత ముఖ్యమైన కండీషన్ ఏమిటంటే, మీ వద్ద నగలు కొనుగోలు చేసిన రసీదు ఉండాలి. బిల్లు లేకుండా క్లెయిమ్ అంగీకరించరు. అలాగే, సంఘటన గురించి బీమా కంపెనీకి సకాలంలో తెలియజేయాలని గుర్తించుకోండి.
ఏయే కంపెనీలు గోల్డ్ ఇన్సూరెన్స్ అందిస్తాయి?
భారతదేశంలో HDFC, రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ (Reliance General Insurance), Oriental Insurance, రాయల్ సుందరం (Royal Sundaram) వంటి కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు గోల్డ్ ఇన్సూరెన్స్ కవర్ అందిస్తాయి. పెద్ద జ్యువెలర్లు సాధారణంగా ఈ కంపెనీలతో గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటారు. పెద్ద జ్యువెలర్ షాప్ యజమానులు తమ స్టాక్ భద్రత కోసం గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకుంటారు. ఈ పాలసీ కింద, కస్టమర్లకు అమ్మిన నగలు కూడా ఒక నిర్దిష్ట కాలపరిమితి వరకు కవర్ అవుతాయి. కనుక దొంగతనం లేదా నష్టం జరిగితే, బీమా కంపెనీ కస్టమర్‌కు వాటి విలువ చాలా మొత్తం వరకు భర్తీ చేస్తుంది. బంగారం నగలకు లభించే బీమా సాధారణంగా ఒక సంవత్సరం పాటు ఉంటుంది. ఆ తర్వాత, కస్టమర్లు కావాలనుకుంటే దానిని రెన్యూవల్ సైతం చేసుకోవచ్చు.