Special Fixed Deposit: దేశంలోని ప్రధాన బ్యాంకులన్నీ ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్లను ప్రవేశపెట్టాయి. వీటి ద్వారా సీనియర్ సిటిజన్‌లు (Senior Citizen), సాధారణ పౌరులు ఎక్కువ వడ్డీని పొందవచ్చు. అయితే.. ఈ స్పెషల్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాల తుది గడువు దగ్గర పడింది. ఈ ప్రత్యేక FDలు మార్చి 31వ తేదీ తర్వాత కనిపించవు. మీరు ఎక్కువ వడ్డీ కోసం FDలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నట్లయితే, మార్చి 31లోగా వీటిలో పెట్టుబడి పెట్టవచ్చు. 


కొన్ని ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ల స్కీమ్‌ల గురించిన సమాచారాన్ని ఇక్కడ ఇస్తున్నాం. వీటిలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు మంచి వడ్డీ ఆదాయాన్ని పొందవచ్చు. ఏయే బ్యాంకులు ఈ ఆఫర్లను అందిస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషల్ FD
దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ SBI, రెండు ప్రత్యేక FDలను తీసుకొచ్చింది, వాటి గడువు మార్చి 31తో ముగియనుంది. అవి వియ్‌కేర్‌ FD (SBI WeCare FD), 400 రోజుల FD. ఈ రెండు స్కీమ్‌లను 2020లో ప్రారంభించారు. సాధారణ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లతో పోలిస్తే.. WeCare పథకంలో 30 bps నుంచి 50 bps వరకు అదనపు వడ్డీ చెల్లిస్తారు. ఎస్‌బీఐ వెబ్‌సైట్ ప్రకారం, ఈ పథకం కింద చెల్లించే వడ్డీ 7.50 శాతం. 400 రోజుల అమృత్‌ కలశ్‌ స్పెషల్ ఎఫ్‌డీపై సీనియర్ సిటిజన్‌లకు 7.60 శాతం వడ్డీని బ్యాంక్‌ ఆఫర్‌ చేస్తోంది.


HDFC బ్యాంక్ స్పెషల్ FD
ఈ బ్యాంక్, సీనియర్ సిటిజన్ల కోసం 2020 మే నెలలో ప్రత్యేక FDని ప్రారంభించింది. ఈ ప్రత్యేక పథకం కింద 0.25 శాతం అదనపు వడ్డీ ఇస్తారు. దీని కాలపరిమితి 10 సంవత్సరాలు & వడ్డీ 7.75 శాతం.


IDBI బ్యాంక్ స్పెషల్‌ FD
ఈ బ్యాంక్ 400 రోజులు & 700 రోజుల కాల వ్యవధి గల ప్రత్యేక FDలపై సాధారణ ప్రజలకు 0.25% వడ్డీని & సీనియర్ సిటిజన్‌లకు 0.50% వడ్డీని అదనంగా అందిస్తోంది. ఈ FDపై సీనియర్ సిటిజన్లకు 7.50% వడ్డీ చెల్లిస్తారు. అదే సమయంలో, 10 సంవత్సరాల కాల గడువు FD మీద 7 శాతం వడ్డీని ఆఫర్‌ చేస్తోంది.


ఇండియన్ బ్యాంక్ స్పెషల్ FD              
555 రోజుల ప్రత్యేక FD పథకాన్ని ఈ బ్యాంక్‌ ప్రవేశపెట్టింది. దీని కింద, సాధారణ ప్రజలకు 7% వడ్డీని & సీనియర్ సిటిజన్లకు 7.50% వడ్డీని ఈ బ్యాంక్‌ చెల్లిస్తోంది. ఈ స్కీమ్‌లో కనిష్టంగా రూ. 5,000 నుంచి గరిష్టంగా రూ. 2 కోట్ల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.


పంజాబ్ అండ్ సింథ్‌ బ్యాంక్         
ఈ బ్యాంక్ మూడు రకాల ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌లను అమలు చేస్తోంది. మొదటిది 222 రోజుల ప్రత్యేక FD. ఈ పథకం కింద 8.85 శాతం వరకు వడ్డీని బ్యాంక్‌ చెల్లిస్తోంది. రెండో స్కీమ్‌ 601 రోజుల FD. ఈ పథకం కింద 7.85 శాతం వరకు వడ్డీని ఇస్తోంది. మూడో స్కీమ్‌ 300 రోజుల FD. ఈ కాల గడువు డిపాజిట్ల మీద 8.35 శాతం వరకు వడ్డీని బ్యాంక్‌ చెల్లిస్తోంది.