Fixed Deposits - Senior Citizen: మీరు సీనియర్ సిటిజన్ అయి, మీ డబ్బును మంచి మార్గంలో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తుంటే ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది. దేశంలోని కొన్ని బ్యాంకులు సీనియర్ సిటిజన్‌ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ మీద అద్భుతమైన వడ్డీని అందిస్తున్నాయి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడం చాలా సురక్షితమైన మార్గంగా ప్రజలు పరిగణిస్తారు. అనేక బ్యాంకులు FD మీద ఇచ్చే వడ్డీకి సంబంధించిన సమాచారాన్ని ఈ వార్తలో మేం అందజేస్తున్నాం. మీ అవసరాలకు అనుగుణంగా, మీరు ఒక బ్యాంకును ఎంచుకోవచ్చు.


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనల ప్రకారం, మీరు మీ డబ్బును ఏకమొత్తంగా బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్‌ (FD) చేయవచ్చు. దానిపై మీరు ప్రతి సంవత్సరం వడ్డీ ప్రయోజనాన్ని పొందుతారు. మీరు కావాలనుకుంటే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ మెచ్యూరిటీ కాలాన్ని పొడిగించవచ్చు. ఇందులో సీనియర్ సిటిజన్లకు ఎక్కువ వడ్డీ అందుతుంది. FDల మీద సీనియర్‌ సిటిజన్లు ఎక్కువ ఆసక్తి చూపుతారు.


దేశంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు గతేడాది (2022) నుంచి రెపో రేటులో రిజర్వ్‌ బ్యాంక్‌ చాలాసార్లు మార్పులు చేసింది. రెపో రేటుకు అనుగుణంగా బ్యాంకులు కూడా డిపాజిట్ల మీద వడ్డీలు పెంచాయి. దీంతో, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ మీద ఆకర్షణీయమైన పథకాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. యాక్సిస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ సహా చాలా బ్యాంకులు FDల మీద 8 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. సీనియర్ సిటిజన్లకు 8 శాతం లేదా అంతకంటే ఎక్కువ వడ్డీని ఆఫర్‌ చేస్తున్నాయి.


సీనియర్‌ సిటిజన్‌ - సూపర్‌ సీనియర్ సిటిజన్‌ 
60 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన వ్యక్తిని సీనియర్‌ సిటిజన్‌గా వ్యవహరిస్తారు. 80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తిని సూపర్‌ సీనియర్ సిటిజన్‌గా పిలుస్తారు.


FD మీద 8 శాతం కంటే ఎక్కువ రాబడి అందించే బ్యాంకులు ఇవి:


పంజాబ్ నేషనల్ బ్యాంక్ ‍‌(Punjab National Bank) - సూపర్ సీనియర్ సిటిజన్లు 666 రోజుల FD మీద 8.05% రాబడి పొందుతారు.
యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) - సీనియర్ సిటిజన్లు 2 సంవత్సరాల నుంచి 30 నెలల కంటే తక్కువ FD మీద 8.01% వడ్డీని పొందుతారు.
డీసీబీ బ్యాంక్ (DCB Bank) - సీనియర్ సిటిజన్లు 700 రోజుల నుంచి 36 నెలల కంటే తక్కువ FD మీద 8.35% రాబడి పొందుతారు.
ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ (IDFC FIRST Bank) - సీనియర్ సిటిజన్లు 18 నెలల 1 రోజు నుంచి 3 సంవత్సరాల FD మీద 8% రాబడి పొందుతారు.
యెస్ బ్యాంక్ (YES Bank) - సీనియర్ సిటిజన్లు 25 నెలల FD మీద 8% వడ్డీని & 35 నెలల ప్రత్యేక FD మీద 8.25% వడ్డీని పొందుతారు.


అదే విధంగా.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank‌), ఐసీఐసీఐ బ్యాంకు (ICICI Bank‌) సీనియర్ సిటిజన్లకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మీద 7.50 శాతం వడ్డీని అందిస్తున్నాయి. కెనరా బ్యాంక్‌లో (Canara Bank‌) సీనియర్ సిటిజన్లు 444 రోజుల FD మీద 7.65 శాతం వడ్డీని పొందుతున్నారు.


ALSO READ: తెలుగు రాష్ట్రాలకు మరిన్ని వందే భారత్‌ రైళ్లు, బడ్జెట్‌లో శుభవార్త వినే ఛాన్స్‌!