Bank FD Update: గత రెండు నెలలుగా రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగిన తర్వాత కూడా, రిజర్వ్ బ్యాంక్ రెపో రేటులో ఎలాంటి మార్పు చేయలేదు. కమర్షియల్‌ బ్యాంకులు మాత్రం ఫిక్స్‌డ్ డిపాజిట్‌ స్కీమ్‌ల మీద వడ్డీ రేట్లను అడ్డంగా కట్‌ చేయడం ప్రారంభించాయి. ప్రస్తుతం, బ్యాంక్ FDల్లో బెస్ట్ డేస్‌ ముగిసినట్లు కనిపిస్తోంది. టర్మ్‌ డిపాజిట్లు లాభాలు ఇవ్వడం మాని లాస్‌ డీల్స్‌గా మారే సూచనలు తొంగి చూస్తున్నాయి.


ముచ్చటగా మూడోసారి కూడా మార్పు లేదు
ఈ నెల 8-10 తేదీల్లో రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (RBI MPC) సమావేశం జరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023-24) రిజర్వ్ బ్యాంక్ MPC యొక్క మూడో సమావేశం ఇది. ఈ మూడో మీటింగ్‌లో కూడా రెపో రేట్‌ను కేంద్ర బ్యాంక్‌ పెంచలేదు, 6.50 శాతం వద్ద స్థిరంగా ఉంచింది. ఈ ఏడాది ఏప్రిల్, జూన్ నెలల్లో జరిగిన MPC సమావేశంలోనూ ఇదే రెపో రేటు కంటిన్యూ అయింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో (2022-23) రెపో రేట్ ఆరు సార్లు పెరిగింది, 4.50 శాతం నుంచి 6.50 శాతానికి చేరింది. ఆ ఆర్థిక సంవత్సరంలో రెపో రేటును కంటిన్యూగా పెంచడం వల్ల గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, వాహన రుణ వ్యయాల భారం పెరిగింది, మరోవైపు సేవింగ్స్ ఖాతాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంకులు చెల్లించే వడ్డీ రేటు పెరగడం కూడా ప్రారంభమైంది. గత మూడు దఫాలుగా రెపో రేటు పెంపు ఆగిపోవడంతో ఎఫ్‌డీ రేటు పెంపు సైకిల్‌ కూడా ఆగిపోయింది.


FD రేట్లను తగ్గించిన బ్యాంకులు
గత 2 నెలల్లో 5 బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మీద వడ్డీ రేట్లలో కోత పెట్టాయి. యాక్సిస్ బ్యాంక్, తన FD రేట్లను 0.10 శాతం వరకు తగ్గించింది. కొత్త రేట్లు ఈ ఏడాది జులై 26 నుంచి అమల్లోకి వచ్చాయి. రెండో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (PNB) కూడా తన FD రేట్లను 0.05 శాతం మేర కట్‌ చేసింది. PNB కొత్త రేట్లు ఈ ఏడాది జూన్ 1 నుంచి అమలులోకి వచ్చాయి.


బ్యాంక్ ఆఫ్ ఇండియా (BoI), తన ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్స్‌ మీద వడ్డీ రేట్లను గరిష్టంగా 1% వరకు తగ్గించింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త వడ్డీ రేట్లు ఈ ఏడాది జులై 28 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఈ నెల (ఆగస్టు) 5 నుంచి FD రేట్లను 0.25 శాతం మేర కత్తిరించింది. అదే సమయంలో, AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వడ్డీ రేట్లు 0.85 శాతం వరకు దిగి వచ్చాయి. 


మరిన్ని బ్యాంకులు తగ్గించవచ్చు
MPC మూడో సమావేశంలోనూ రెపో రేటును స్థిరంగా ఉంచిన నేపథ్యంలో, మరికొన్ని బ్యాంకులు కూడా రాబోయే రోజుల్లో FDలపై వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంది. రాబోయే కాలంలో ప్రజలు ఎఫ్‌డీల నుంచి తక్కువ రాబడిని పొందబోతున్నారని స్పష్టంగా అర్ధం అవుతోంది.


మరో ఆసక్తికర కథనం: వచ్చే 4 రోజుల్లో 3 రోజులు ఒక్క బ్యాంక్‌ కూడా పని చేయదు, పనుంటే ముందే ప్లాన్ చేసుకోండి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial