Loan Recovery Agent Rules October 1:  లోన్ రికవరీ ఏజెంట్ల అరాచకాలకు అడ్డుకట్ట వేసేలా భారతీయ రిజర్వ్ బ్యాంక్  అత్యంత కఠినమైన మార్గదర్శకాలను సిద్ధం చేసింది. రికవరీ పేరుతో కస్టమర్లను వేధించడం, అసభ్య పదజాలంతో దూషించడం వంటి చర్యలకు చెక్ పెడుతూ రూపొందించిన ఈ కొత్త నిబంధనలు  అక్టోబర్ 1, 2026 నుంచి అమలులోకి రానున్నాయి. బ్యాంకులు, బ్యాంకేతర ఆర్థిక సంస్థలు తమ రికవరీ ప్రక్రియలో పాక్షిక బాధ్యత నుంచి తప్పించుకోకుండా పూర్తి జవాబుదారీతనాన్ని ఈ నిబంధనలు ఖరారు చేస్తున్నాయి.

Continues below advertisement

 సమయపాలనపై కఠిన ఆంక్షలు 

కొత్త నిబంధనల ప్రకారం, రికవరీ ఏజెంట్లు లేదా బ్యాంక్ సిబ్బంది లోన్ తీసుకున్న వ్యక్తులను ఉదయం  8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు  మాత్రమే సంప్రదించాలి. అర్ధరాత్రి కాల్స్ చేయడం లేదా తెల్లవారుజామునే ఇంటికి వెళ్లడం వంటి పద్ధతులు ఇకపై చెల్లవు. ఒకవేళ కస్టమర్ స్వయంగా వేరే సమయాన్ని కోరితే తప్ప, ఈ సమయపాలనను తప్పనిసరిగా పాటించాలి. ఫోన్ కాల్స్ మాత్రమే కాకుండా వాట్సాప్ మెసేజ్‌లు, ఎస్ఎంఎస్  లకు కూడా ఇదే నియమం వర్తిస్తుంది.

Continues below advertisement

 మొబైల్ డేటా యాక్సెస్ , ఫోన్ లాకింగ్‌పై నిషేధం 

డిజిటల్ రుణాల విషయంలో ఏజెంట్లు కస్టమర్ల మొబైల్ ఫోన్లలోని కాంటాక్ట్ లిస్ట్, ఫోటోలు వంటి వ్యక్తిగత డేటాను సేకరించడాన్ని ఆర్బీఐ ఖచ్చితంగా నిషేధించింది. అంతేకాకుండా, లోన్ రికవరీ కోసం వినియోగదారుల ఫోన్లను రిమోట్‌గా లాక్ చేయడం లేదా ఫంక్షన్లను నిలిపివేయడం వంటివి చేయకూడదు. ఒకవేళ ఫోన్ కొనుగోలు కోసమే లోన్ తీసుకున్నట్లయితే, ఆ లోన్ చెల్లించక 90 రోజులు గడిచిన తర్వాతే   కొన్ని హెచ్చరికల అనంతరం ఫోన్ లాక్ చేసే అవకాశం ఉంటుంది. అయితే అప్పుడు కూడా ఎమర్జెన్సీ కాల్స్, గవర్నమెంట్ అలర్ట్స్ వంటి ఫీచర్లను నిలిపివేయడానికి వీల్లేదు.

 ధృవీకరించిన ఏజెంట్లు మాత్రమే.. 

బ్యాంకులు ఇకపై ఏ ఏజెంట్‌ను పడితే ఆ ఏజెంట్‌ను రికవరీకి పంపడానికి వీల్లేదు.  ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ద్వారా సర్టిఫికేట్ పొందిన , శిక్షణ తీసుకున్న వ్యక్తులను మాత్రమే రికవరీ ఏజెంట్లుగా నియమించుకోవాలి. ఏజెంట్ కస్టమర్ ఇంటికి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఐడీ కార్డ్ ,  బ్యాంక్ ఇచ్చిన అధికార పత్రాన్ని వెంట ఉంచుకోవాలి. కస్టమర్ల పట్ల గౌరవంగా ప్రవర్తించడం, అసభ్య పదజాలం వాడకపోవడం, గోప్యతను కాపాడటం వంటివి ఈ శిక్షణలో భాగంగా ఉంటాయి.

 బ్యాంకులకే పూర్తి బాధ్యత 

రికవరీ ఏజెంట్లు ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే లేదా నిబంధనలు అతిక్రమిస్తే, దానికి సదరు బ్యాంక్ లేదా ఫైనాన్స్ సంస్థే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.  థర్డ్ పార్టీ ఏజెన్సీ తప్పు చేసింది మాకు సంబంధం లేదు అని బ్యాంకులు ఇకపై తప్పించుకోలేవు. కస్టమర్లకు జరిగిన నష్టానికి బ్యాంకులు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఏవైనా ఉల్లంఘనలు జరిగితే కస్టమర్లు నేరుగా బ్యాంక్ గ్రీవెన్స్ సెల్‌కు లేదా ఆర్బీఐ బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ కు ఫిర్యాదు చేయవచ్చు.