Sovereign Gold Bond Scheme: బంగారం రేటు సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. పసిడి ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయే గానీ తగ్గడం లేదు. ముఖ్యంగా, ఈ పెళ్లిళ్ల సీజన్‌లో ప్రజలను మరీ ఇబ్బందులు పెడుతున్నాయి. పుండు మీద కారం చల్లినట్లు, ప్రభుత్వం కూడా ఓ పెద్ద నిర్ణయం తీసుకోబోతోంది, ఇది సామాన్య జనాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది.

శనివారం నాటి బడ్జెట్ (Budget 2025) తర్వాత, మీడియా ప్రతినిధులు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ (Finance Minister Nirmala Sitharaman) సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ పథకం (SGB Scheme) గురించి ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని మూసివేసే దిశలో ఉందని ఆర్థిక మంత్రి బదులిచ్చారు. అసలు.. సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ అంటే ఏంటి, దానిని క్లోజ్‌ చేయాలని సర్కారు ఎందుకు భావిస్తోంది, మూసివేత వల్ల సామాన్యులకు చౌకగా బంగారం దొరకే మార్గం ఎలా మూసుకుపోతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం.

సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ అంటే ఏంటి?పసిడి ధరలు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో, మార్కెట్ ధర కంటే తక్కువ ధరలకు సామాన్యులకు బంగారాన్ని అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2015లో ఈ పథకాన్ని ప్రారంభించింది. అంతేకాదు.. ప్రజల భౌతిక బంగారం కొనుగోళ్లను నిరుత్సాహపరచడం & డిజిటల్ బంగారంలో పెట్టుబడులను ప్రోత్సహించడంపై కూడా ఈ పథకం దృష్టి పెడుతుంది.

అయితే, 01 ఫిబ్రవరి 2025న, కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ, ఈ పథకం కింద తీసుకునే రుణాలపై ప్రభుత్వం అధిక వడ్డీని చెల్లించాల్సి వస్తోందని, దీనివల్ల ఖజానాపై ఆర్థిక భారం పెరుగుతోందని చెప్పారు. ఆ భారాన్ని తగ్గించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని మూసివేసే యోచనలో ఉంది.

భారీ లాభాలు ఆర్జించిన SGB పెట్టుబడిదార్లుSGB పెట్టుబడిదార్లకు, ఈ పథకం మెచ్యూరిటీ నాటికి లేదా ముందస్తు ఉపసంహరణ నాటికి ఉన్న బంగారం ధరను ప్రభుత్వం చెల్లిస్తుంది. దీనికి వడ్డీని కూడా కలిపి ఇస్తుంది. వాస్తవానికి, గత కొన్నేళ్లుగా బంగారం ధర అనూహ్యంగా పెరిగింది. పుత్తడి తారస్థాయికి చేరుతుందని కేంద్ర ప్రభుత్వం కూడా అనుకోలేదు. సర్కారు అంచనాలను తలకిందులు చేస్తూ పుత్తడి ప్రకాశం పెరగడం వల్ల పెట్టుబడిదార్లకు చెల్లించాల్సిన డబ్బు & ఖజానాపై భారం విపరీతంగా పెరిగాయి. ET రిపోర్ట్‌ ప్రకారం, గత కొన్ని సంవత్సరాలలో SGB పథకం పెట్టుబడిదారులు 160 శాతం వరకు రాబడిని పొందారు. సామాన్య ప్రజలు భారీగా లాభపడుతున్నా, ఆర్థిక దృక్కోణం నుండి దీనిని కొనసాగించడం ప్రభుత్వానికి కష్టంగా మారింది.

పెట్టుబడిదార్లకు కొత్త పథకాలుప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్‌ స్కీమ్‌ను నిలిపివేసే యోచనలో ఉన్నప్పటికీ, గోల్డ్ ఇటీఎఫ్‌లు (ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్‌లు) & ఇతర ఆర్థిక ఉత్పత్తులు వంటి కొత్త పథకాలను పరిశీలిస్తోంది. ఈ పథకాలు బంగారంలో పెట్టుబడి పెట్టడానికి సురక్షితమైన & సులభమైన మార్గంగా ఉంటాయి. దీనితో పాటు, బంగారం దిగుమతులను నియంత్రించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు, తద్వారా దేశీయ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా ఉంటాయి.

మరో ఆసక్తికర కథనం: ప్యూన్‌ నుంచి పెద్ద ఆఫీసర్‌ వరకు - ఏ ఉద్యోగి జీతం ఎంత పెరుగుతుంది?