Savings at Risk: 


కుటుంబాలు డబ్బు ఆదా చేయడం తగ్గిపోతే దేశానికి మంచిది కాదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్పుల ఊబిలో కూరుకుపోతే పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వానికి నిధులు దొరకవని అంటున్నారు. అదే జరిగితే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థకు ముప్పు తప్పదని చెబుతున్నారు.


బ్యాంకు డిపాజిట్లు, నగదు, ఈక్విటీ పెట్టుబడుల నుంచి ఖర్చులు, అప్పులను మినహాయిస్తే కుటుంబ ఆదా వస్తుంది. గత ఆర్థిక ఏడాదిలో కుటుంబ ఆదా జీడీపీలో 7.2 శాతం ఉండగా ఈసారి 5.1 శాతానికి తగ్గిపోయినట్టు ఆర్బీఐ ద్వారా తెలిసింది. 2007 ఆర్థిక ఏడాది తర్వాత కుటుంబ ఆదాయం ఇంత తక్కువ స్థాయిలో ఉండటం ఇదే తొలిసారని ఇండస్‌ఇండ్‌ బ్యాంకు చీఫ్ ఎకానమిస్టు గౌరవ్‌ కపూర్‌ అంటున్నారు. దీంతో మిగిలిన ఏడాదంతా నిధులు కొరత ఉంటుందని అంచనా వేస్తున్నారు. మౌలిక సదుపాయాలు, యంత్రాలు, పనిముట్లపై పెట్టుబడులకు భారత ప్రభుత్వం ఎక్కువగా ఆదా చేసిన డబ్బునే వినియోగిస్తుందని వెల్లడించారు.


కరోనా సమయంలో ప్రపంచ వ్యాప్తంగా డబ్బులు ఆదా చేయడం పెరిగింది. కొవిడ్‌ నిబంధనల వల్ల ప్రజలు ఖర్చు పెట్టలేకపోవడమే ఇందుకు కారణం. అయితే నిబంధనలు తొలగించగానే ప్రజలు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం ఆరంభించారు. దాంతో ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడమే కాకుండా ద్రవ్యోల్బణమూ పెరిగింది.


చివరి 20 నెలల్లో 14 నెలలు భారత్‌లో వినియోగ వస్తువుల ధరలు ఆర్బీఐ లక్షిత ద్రవ్యోల్బణం 2-6 శాతం కన్నా ఎక్కువే ఉంటున్నాయి. ఇదే సమయంలో ప్రజల వేతనాలు పెరగలేదు. దాంతో కుటుంబ ఆదా తగ్గిపోయింది. ఇదిలాగే తగ్గితే ప్రభుత్వానికి నిధుల వ్యత్యాసం పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


'అభివృద్ధి వేగంతో కుటుంబ ఆదా పెరగకపోవడం ఆందోళనకరం' అని యాక్సిస్‌ బ్యాంకు ఎకానమిస్ట్‌ సౌగత భట్టాచార్య అంటున్నారు. స్థానికంగా సేవింగ్స్‌ లేకపోతే విదేశీ పెట్టుబడులపై ఆధార పడాల్సి వస్తుందని తెలిపారు. 


ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో భారత జీడీపీ 6.3 శాతంగా ఉంటుందని అంచనా. ప్రపంచంలోని మిగతా ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే ఇదే ఎక్కువ. ఇదిలాగే కొనసాగాలంటే పెట్టుబడులు కొనసాగించాలి. కేవలం అప్పులపై ఆధారపడొద్దు. కరోనా మహమ్మారి తర్వాత బ్యాంకుల దూకుడు వ్యూహంతో 30 కోట్ల కుటుంబాల అప్పుల స్థాయి పెరిగింది. వడ్డీరేట్ల తక్కువగా ఉండటంతో బ్యాంకుల రిటైల్‌ లోన్లు వృద్ధి చెందాయి. ఈ ఏడాది మేలో క్రెడిట్‌ కార్డుల వినియోగం రూ.1.47 లక్షల కోట్లకు పెరిగిన సంగతి తెలిసిందే.


మరోవైపు దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు భారతీయ స్టేట్‌ బ్యాంకు రూ.10,000 కోట్లను సమీకరించింది. 7.49శాతం కూపన్‌ రేటుతో నాలుగో దఫా మౌలిక సదుపాయాల బాండ్లను విడుదల చేసింది. ప్రావిడెంట్‌ ఫండ్లు, పెన్షన్‌ ఫండ్లు, బీమా కంపెనీలు, మ్యూచువల్‌ పండ్లు, కార్పొరేట్లు ఈ ఇష్యూకు పెట్టుబడిదారులుగా ఉన్నారు. తక్కువ ధర ఇళ్ల నిర్మాణాలు, మౌలిక సదుపాయాలకు సుదీర్ఘ కాలం ఈ నిధులను ఉపయోగిస్తామని ఎస్బీఐ తెలిపింది.


ఎస్బీఐ రూ.10,000 కోట్లు సమీకరిస్తున్న విషయం తెలిసినప్పటికీ కంపెనీ షేర్లు సోమవారం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. నేటి ఉదయం రూ.601 మొదలైన షేర్లు ఇంట్రాడేలో రూ.590 వద్ద కనిష్ఠాన్ని తాకాయి. రూ.601 వద్ద గరిష్ఠాన్ని అందుకున్నాయి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత నాలుగు రూపాయల నష్టంతో రూ.594 వద్ద ట్రేడవుతున్నాయి.