UIDAI Alert to Aadhaar Card Users: భారతదేశంలో, ఆధార్ కార్డ్‌ అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్‌. ఇది లేకుండా ఏ ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడం కుదరదు. మన దేశంలో ప్రైవేటు సంస్థలు కూడా, సంబంధిత వ్యక్తుల నుంచి ఆధార్‌ కార్డ్‌ నంబర్‌ అడుగుతున్నాయి. భారత పౌరుడి గుర్తింపు పత్రాల్లో ఒకటిగా ఇది మారింది. ఆధార్‌ అంటే ఒట్టి సంఖ్య మాత్రమే కాదు, ఆ కార్డులో మీ పేరు, వయస్సు, చిరునామా వంటి సమాచారంతో పాటు అతి కీలకమైన మీ వేలిముద్రలు (బయోమెట్రిక్), కంటిపాపల (ఐరిస్‌) సమాచారం కూడా ఉంటుంది. కాబట్టి, ఇది చాలా చాలా ముఖ్యమైన పత్రం. అన్ని రకాల లావాదేవీల్లో ఆధార్‌ కార్డుకు ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో, దీని ద్వారా ఊహించలేని రీతిలో మోసాలు కూడా జరుగుతున్నాయి. మోసాలు, తప్పుడు విధానాలను నివారించి ప్రజల్లో అవగాహన పెంచడానికి, ఆధార్ జారీ చేసే సంస్థ యూఐడీఏఐ (ఉడాయ్‌ - UIDAI) ఎప్పటికప్పుడు తగిన సూచనలు, సమాచారం ఇస్తూనే ఉంటుంది.      


ప్రస్తుతం, UIDAI పేరుతో ఒక మెసేజ్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీకు సోషల్‌ మీడియా అకౌంట్‌ ఉంటే, మీకు కూడా ఈ సందేశం ఇప్పటికే వచ్చి ఉంటుంది, లేదా అతి త్వరలోనే స్వీకరించే అవకాశం ఉంది.      


UIDAI పేరిట ఉన్న మెసేజ్‌ ఏంటి?
ఆధార్ కార్డ్ వినియోగం గురించి కేంద్ర ప్రభుత్వం చేసిన ఒక హెచ్చరికకు సంబంధించిన సమాచారం, సోషల్‌ మీడియా తెగ తిరుగుతున్న సందేశంలో ఉంది. ఆధార్ కార్డ్‌ హోల్డర్లు తమ ఆధార్ సంబంధిత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని కేంద్ర ప్రభుత్వం సలహా జారీ చేసిందని ఆ మెసేజ్‌లో ఉంది. సాధారణంగా, ఏదైనా ప్రభుత్వ పథకాన్ని పొందాలంటే, వినియోగదారుకు చెందిన ఆధార్ కార్డు జిరాక్స్‌ కాపీని సంబంధిత ప్రభుత్వ కార్యాలయాల్లో సమర్పించాల్సి ఉంటుంది. ఇకపై, ఆధార్‌ కార్డ్‌ నకలును ప్రభుత్వ కార్యాలయాలు సహా ఎవరితోనూ పంచుకోవాల్సిన పని లేదన్న విషయం ఆ మెసేజ్‌లో ఉంది. ఆధార్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు రాసి ఉంది.    


కేంద్ర ప్రభుత్వం నిజంగా ఆధార్‌ మార్గదర్శకాలు జారీ చేసిందా?
ఈ మెసేజ్ వైరల్‌ కావడంతో, ఉడాయ్‌ దృష్టికి కూడా వెళ్లింది, ఆ సంస్థ స్పందించింది. ఈ వైరల్ క్లెయిమ్ పూర్తిగా ఫేక్ అని, తాము గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదని వెల్లడించింది. మెసేజ్‌లో పేర్కొన్న సమాచారం పూర్తిగా అబద్ధమని, పుకారు మాత్రమేనని ఉడాయ్‌ స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆ సర్క్యులర్ జారీ చేయలేదని ప్రకటించింది. దీంతో పాటు, సర్క్యులర్‌లో పేర్కొన్న UIDAI లింక్‌ను కూడా తప్పేనని, ఆ లింక్‌ను ఎవరూ ఫాలో కావద్దని సూచించింది. 


 






 


ఆధార్‌కు సంబంధించిన తాజా సమాచారాన్ని పొందడానికి, uidai.gov.in ని సందర్శించవచ్చు.