SBI PAN Update Alert: మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్ అయితే, ఈ వార్త మీకోసమే. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా, ఈ బ్యాంక్ తన ఖాతాదారులకు కొత్త సౌకర్యాలను అందిస్తోంది. ఇందులో, SBI మొబైల్ బ్యాంకింగ్ యాప్ SBI YONO (SBI YONO Mobile Banking App) ఒకటి.
ఖాతాదార్లు స్టేట్ బ్యాంక్ శాఖకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఇంట్లోనే కూర్చొని యోనో యాప్ ద్వారా వివిధ లావాదేవీలు పూర్తి చేస్తున్నారు. సమయం, డబ్బు రెండూ ఆదా అవుతుండడంతో, ఈ మొబైల్ బ్యాంకింగ్ యాప్‌నకు చాలా ఆదరణ కనిపిస్తోంది. SBI YONO వినియోగం గత కొన్ని సంవత్సరాలుగా చాలా వేగంగా పెరిగింది.
పాన్ నంబర్ అప్‌డేట్ చేయమంటూ సందేశం
గత కొన్ని రోజులుగా, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఒక వార్త వైరల్ అవుతోంది. SBI ఖాతాదార్లు తమ యోనో అకౌంట్‌లో పాన్ నంబర్‌ను అప్‌డేట్ (PAN Number Updating) చేయకపోతే, ఆ యోనో ఖాతా బ్లాక్ అవుతుందని ఆ మెసేజ్‌లో ఉంది. స్టేట్ బ్యాంక్ ఈ అలెర్ట్ జారీ చేసినట్లుగా ఆ మెసేజ్‌లో కనిపిస్తోంది. ఇది సోషల్ మీడియాలో చాలా వేగంగా ఒకరి నుంచి మరొకరికి చేరుతోంది. దీంతో పాటు ఒక లింక్ కూడా వెళుతోంది. ఆ లింక్ మీద క్లిక్ మీద చేయడం ద్వారా మీరు మీ పాన్ కార్డును కొన్ని నిమిషాల్లోనే అప్‌డేట్ చేసుకోవచ్చని మెసేజ్‌లో సందేశం ఉంది. మీ దగ్గరకు కూడా ఈ సందేశం వచ్చిందా?, ఒకవేళ రాకపోయినా మరికొన్ని రోజుల్లోనే వచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ లింక్ మీద క్లిక్ చేసి పాన్ నంబర్ అప్‌డేట్ చేసుకోవాలా, వద్దా?
PIB ఫ్యాక్ట్ చెక్‌లో తేలిన విషయం ఇది
ఈ వార్త వైరల్ కావడంతో, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) కూడా దానిపై దృష్టి పెట్టింది. ఫ్యాక్ట్ చేసి అసలు విషయం వెలుగులోకి తీసుకొచ్చింది. ఎస్‌బీఐ పేరుతో వైరల్ అవుతున్న ఈ సందేశం పూర్తిగా అబద్ధమని పీఐబీ ట్వీట్ చేసింది. ఎవరైనా మీకు అలాంటి సందేశం లేదా ఈ-మెయిల్ పంపితే, ఆ లింక్‌పై అస్సలు క్లిక్ చేయవద్దని హెచ్చరించింది.
ఎస్‌బీఐ వెర్షన్ ఏంటి?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలెర్ట్ (State Bank of India Alert), సైబర్ నేరాల గురించి సమాచారం ఇవ్వడం ద్వారా తన కస్టమర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉంటుంది. ఎవరైనా మీకు కాల్ చేసి లేదా మెసేజ్ పంపడం ద్వారా మీ మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, పాన్ కార్డ్ నంబర్, క్రెడిట్/ డెబిట్ కార్డ్ నంబర్ మొదలైన మీ వ్యక్తిగత వివరాలను అడిగితే, అవతలి వ్యక్తిని అనుమానించాలని ఎస్‌బీఐ చెబుతోంది. మీ వివరాలను అలాంటి వ్యక్తులతో అస్సలు పంచుకోవద్దని సూచించింది. దీంతో పాటు, మీ మొబైల్ నంబర్‌కు వచ్చే OTPలను చెప్పమని బ్యాంక్ గానీ బ్యాంక్ ప్రతినిధులు గానీ ఎప్పటికీ అడగరని, ఒకవేళ ఎవరైన అలా అడిగితే వాళ్లు మోసగాళ్లుగా గుర్తించాలని హెచ్చరించింది. OTPలను ఎవరితో పంచుకోవద్దని సూచించింది. ఈ సూచనలు కచ్చితంగా పాటించడం వల్ల మీరు సైబర్ నేరాల బారిన పడకుండా సురక్షితంగా ఉంటారు.
ఈ హెచ్చరికను పట్టించుకోకుండా మీరు పొరపాటున లేదా కావాలని ఆ లింక్స్ మీద క్లిక్ చేసి మీ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం వల్ల సైబర్ మోసానికి గురయ్యే ప్రమాదం ఉంది, తస్మాత్ జాగ్రత్త.