EPF Interest Amount: ప్రస్తుతం 2023 మార్చి నెల జరుగుతోంది, ఈ నెలతో 2022-23 ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి EPF పై వార్షిక వడ్డీ రేటును కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ, EPFO బోర్డు ఇంకా  నిర్ణయించలేదు. 


గత ఆర్థిక సంవత్సరం, అంటే 2021-22 సంవత్సరానికి, ఖాతాదార్లు కష్టపడి సంపాదించిన డబ్బుపై ఈపీఎఫ్ ఖాతాలో 8.1 శాతం వడ్డీ రేటు ఇవ్వాలని నిర్ణయించారు. దీనికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం కూడా లభించింది. విచిత్రం ఏంటంటే... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపునకు వచ్చినా, గత ఆర్థిక సంవత్సరం నిర్ణయించిన వడ్డీని మాత్రం ఇంత వరకు చాలా మంది ఖాతాల్లో జమ చేయలేదు. దీనిపై ఈపీఎఫ్ ఖాతాదార్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు, EPFOపై విమర్శల వర్షం కురిస్తున్నారు.


2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి EPF పై వడ్డీ మొత్తం జమ కాకపోవడంపై.. ఒకరిద్దరు కాదు, వేల సంఖ్యలో ఖాతాదార్లు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ విమర్శలు, ఫిర్యాదులు EPFO దృష్టికి వెళ్లాయి, ఆ సంస్థ స్పందించింది. వడ్డీ చెల్లింపు ప్రక్రియ కొనసాగుతుంది, త్వరలో మీ ఖాతాలో మొత్తం వడ్డీ ప్రతిబింబిస్తుంది అంటూ తన ట్విట్టర్‌ హ్యాండిల్‌ ద్వారా EPFO ట్వీట్‌ చేసింది. వడ్డీ మొత్తం పూర్తిగా చెల్లిస్తామని, ఎవరికీ వడ్డీ తగ్గదని పేర్కొంది.






EPF పై వడ్డీ మొత్తం రాకపోవడంపై, ట్విట్టర్‌ ద్వారా చాలా మంది EPF ఖాతాదార్లు ఫిర్యాదు చేస్తున్నారు. వడ్డీ డబ్బులే జమకానప్పుడు ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడం వల్ల ఏం లాభం అంటూ కోమల్ శర్మ అనే యూజర్ రాసుకొచ్చారు. మా ప్రావిడెంట్ ఫండ్‌పై మాకు వడ్డీ రావడం లేదు. గతేడాది కూడా బాకీ ఉండగా ఈ ఏడాది కూడా పెండింగ్‌లో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 2021-22కి వడ్డీ తక్కువగా ఉందని మరో వినియోగదారు అడిగారు. ఇంత కాలం ఎందుకు వేచి ఉండాల్సి వచ్చింది? దీన్ని ఎందుకు పరిష్కరించడం లేదు? అని ప్రశ్నించారు.






ఈ ట్వీట్ల పరంపరపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందించింది. ఏ సబ్‌స్క్రైబర్‌కు వడ్డీ నష్టం జరగదని ట్వీట్ చేసింది. వడ్డీ మొత్తం EPF ఖాతాదారులందరి ఖాతాకు బదిలీ అవుతుందని, పన్ను విధానంలో మార్పు కారణంగా సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేయడం వల్ల ప్రకటనలో అది కనిపించడం లేదని వెల్లడించింది. EPF నుంచి వైదొలగడం లేదా EPF నుంచి విత్‌డ్రా చేసుకున్న సబ్‌స్క్రైబర్‌కు మొత్తం డబ్బును వడ్డీతో కలిపి అందజేస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.






2021-22 బడ్జెట్‌లో, PF ఖాతాలో ఏటా రూ. 2.5 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే వచ్చే వడ్డీపై పన్ను విధించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పరిమితి ఏడాదికి రూ. 5 లక్షలుగా నిర్ణయించారు. పన్ను నిబంధనలలో ఈ మార్పు కారణంగా, EPFO సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ చేస్తున్నారు. దీంతో, ఆయా ఖాతాల్లోకి వడ్డీ రావడంలో జాప్యం జరుగుతోంది.