National Pension System: జాతీయ పెన్షన్ పథకానికి ‍‌(NSP) సంబంధించిన రూల్స్‌లో కీలక మార్పుతో, కొత్త స్కీమ్‌ తీసుకురావాలని PFRDA నిర్ణయించింది. దీనివల్ల, రిటైర్మెంట్‌ తర్వాత చందాదారుకు ఉపయోగం ఉంటుంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA), ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ఈ స్కీమ్‌ను అమల్లోకి తీసుకురావచ్చు.


60% ఫండ్‌కు 'సిస్టమాటిక్‌ విత్‌డ్రాల్‌ ప్లాన్‌'
ప్రస్తుతం, నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌ సభ్యులకు 60 ఏళ్లు నిండిన తర్వాత, పదవీ విరమణ సమయంలో, అకౌంట్‌లో ఉన్న మొత్తంలో 60 శాతం డబ్బును ఒకేసారి వెనక్కు తీసుకుంటున్నారు. మిగిలిన 40 శాతాన్ని కచ్చితంగా యాన్యుటీ పథకాల్లో పెట్టుబడిగా పెట్టాలి. PFRDA కొత్త ప్లాన్ ప్రకారం, 60% అమౌంట్‌ను వన్ టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద విత్‌డ్రా చేసుకునే బదులు, క్రమపద్ధతిలో ఉపసంహరించుకోవడానికి (systematic withdrawal plan - SWP) అనుమతి ఇస్తారు. SWP కింద నెలవారీ, త్రైమాసిక, అర్ధ వార్షిక, వార్షిక పద్ధతిలో ఉపసంహరణ ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయి. పింఛనుదారు తన అవసరాన్ని బట్టి ఏదో ఒక ఆప్షన్‌ ఎంచుకోవచ్చు. ఇలా, అతనికి 75 సంవత్సరాలు వచ్చే వరకు ఆ డబ్బును కొంత మొత్తం చొప్పున విత్‌ డ్రా చేసుకోవచ్చు. 40% డబ్బును యాన్యూటీ స్కీమ్స్‌లో పెట్టుబడి పెట్టాలన్న రూల్‌లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు.


NPS మీద మంచి ఆదాయం వస్తుందన్న అంచనా
చాలా మంది NPS సబ్‌స్క్రైబర్లు, రిటైర్మెంట్‌ తర్వాత ఒకేసారి 60% ఫండ్‌ను వెనక్కు తీసుకునేందుకు ఇష్టపడటం లేదు. NPS మీద మంచి ఆదాయం వస్తుందని ఎక్కువ మంది భావిస్తుండడంతో, తమ డబ్బును అదే ఫండ్‌లో కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో, తమ డబ్బు మొత్తాన్ని NPSలోనే ఉంచి, క్రమపద్ధతిలో విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతించాలంటూ చాలా విజ్ఞప్తులు PFRDAకి అందాయి. చందాదార్ల విన్నపాల ప్రకారం ఈ కొత్త స్కీమ్‌ తెస్తోంది PFRDA. అలాగే, ఈ స్కీమ్‌లో చేరేందుకు కనీస వయసును 70 ఏళ్లకు పెంచింది. స్కీమ్‌ నుంచి బయటకు వచ్చే గరిష్ట వయస్సు 75 ఏళ్లుగా డిసైడ్‌ చేసింది. అంటే, NSPలో SWP ఆప్షన్‌ ఎంచుకున్నవాళ్లు, వాళ్లకు 75 సంవత్సరాల వయస్సు వచ్చేలోగా తమ డబ్బు మొత్తాన్ని వెనక్కు తీసుకోవాలి, లేదా ఆ సమయానికి మిగిలిన ఫండ్‌ మొత్తాన్ని ఒకేసారి విత్‌డ్రా చేసుకోవాలి.


SWP ఈ ఏడాది సెప్టెంబరు నాటికి అమల్లోకి రావచ్చని PFRDA ఛైర్మన్‌ దీపక్‌ మొహంతి చెప్పారు. ఖాతాదారు, నెలవారీ, త్రైమాసికం, అర్ధ వార్షిక, వార్షిక ప్రాతిపదికన విత్‌డ్రా చేసుకునే డబ్బు మొత్తాన్ని ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు. 


ఎన్‌పీఎస్‌ సభ్యులు, ఫండ్‌ డేటా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, ప్రభుత్వేతర రంగం నుంచి 1.3 మిలియన్ల (13 లక్షలు) కొత్త NPS సబ్‌స్క్రైబర్లు యాడ్‌ అవుతారని అంచనా వేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 1 మిలియన్‌ (10 లక్షలు) పైగా కొత్త ఖాతాదార్లు యాడ్‌ అయ్యారు. గతేడాది చివరి నాటికి ఎన్‌పీఎస్‌లో 12 మిలియన్ల (ఒక కోటి 20 లక్షలు) మంది సభ్యులు ఉండగా, ఆ సంఖ్య ఈ ఏడాది చివరి నాటికి 13 మిలియన్లకు (ఒక కోటి 30 లక్షలు) చేరుకుంటుందని లెక్కలు వేశారు. అదే సమయంలో, అటల్ పెన్షన్ యోజన (APY) కింద 54 మిలియన్ల మంది చేరారు. ప్రస్తుతం, NPS, NPS లైట్‌, APY కింద మొత్తం రూ. 9.58 లక్షల కోట్ల ఫండ్ ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇవి రూ. 10 లక్షల కోట్ల మార్క్‌ను చేరతాయని భావిస్తున్నారు.


మరో ఆసక్తికర కథనం: టాక్స్‌ వసూళ్లలో టాప్‌ లేపిన సర్కారు, ఇప్పటివరకు ₹3.80 లక్షల కోట్ల కలెక్షన్స్‌