EPFO New Rule: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO), తన మెంబర్ల ప్రయోజనాల కోసం నిబంధనలను ఎప్పటికప్పుడు సరళంగా మారుస్తుంది లేదా కొత్త రూల్స్‌ తీసుకొస్తుంటుంది. తాజాగా, ఈపీఎఫ్‌ కంట్రిబ్యూటర్‌కు మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో ఎక్కువ డబ్బును అందుబాటులోకి తెచ్చేలా కొత్త నిబంధన ప్రవేశపెట్టింది. ఫామ్‌-31లోని 68J పేరా కింద, ముందస్తు విత్‌డ్రా పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ. 50,000 నుంచి రూ. 1 లక్షకు పెంచింది. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చిన సమయంలో, ఈ రూల్‌ EPF మెంబర్‌కు బాగా ఉపయోగపడుతుంది. ఆటో క్లెయిమ్ సెటిల్‌మెంట్ల కోసం అప్‌డేట్ చేసిన పరిమితిని వివరిస్తూ, 2024 ఏప్రిల్ 16న ఒక సర్క్యులర్‌ను EPFO జారీ చేసింది.


ఫామ్‌ 31, పేరా 68J
పేరా 68J ప్రకారం, EPF సభ్యుడు ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటే, పెద్ద శస్త్రచికిత్స జరిగితే, క్షయ, కుష్టువ్యాధి, పక్షవాతం, క్యాన్సర్, మానసిక అనారోగ్యం, గుండె జబ్బుల వంటి క్లిష్టమైన ఆరోగ్య సమస్యలు ఉంటే పీఎఫ్‌ ఖాతా నుంచి కొంత డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. దీనికి అర్హత పొందాలంటే, ఆ ఉద్యోగి PF ఖాతాలో కనీసం ఒక లక్ష రూపాయలు బ్యాలెన్స్ ఉండాలి. సబ్‌స్క్రైబర్‌ 6 నెలల ప్రాథమిక వేతనం ‍‌(basic wage) + డియర్‌నెస్ అలవెన్స్ (DA), లేదా, వడ్డీతో కలిపి ఉద్యోగి వాటా.. ఈ రెండింటిలో ఏది తక్కువైతే అది క్లెయిమ్ చేసుకోవడానికి EPFO నుంచి అనుమతి లభిస్తుంది.


పేరా 68J కింద క్యాష్‌ విత్‌డ్రా చేయాలంటే.. ఆ కంపెనీ యాజమాన్యం అనుమతి, చికిత్స చేసే వైద్యుడు సంతకం చేసిన సర్టిఫికేట్‌ ఉండాలి. దీంతోపాటు ఫామ్ 31 అవసరం.


UAN వ్యవస్థ
EPFO, 'యూనివర్సల్ అకౌంట్ నంబర్' (UAN) వ్యవస్థను కూడా అనుసంధానించింది. యజమాని ధృవీకరణ లేకుండానే క్లెయిమ్ చేసుకునేందుకు ఈ విధానంలో వీలవుతుంది. చందాదారు UAN అతని ఆధార్ నంబర్‌ & బ్యాంక్ ఖాతాకు లింక్ జరిగి ఉంటే.. చందాదారు నేరుగా EPFOకి క్లెయిమ్ ఫారాన్ని సమర్పించవచ్చు. ఈ ప్రాసెస్‌లో రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌ కూడా అవసరం. ఆ మొబైల్‌ నంబర్‌కు వచ్చే వన్ టైమ్ పాస్‌వర్డ్‌ను (OTP) ధృవీకరించాల్సి ఉంటుంది.


వివిధ అత్యవసర సందర్భాల్లో పాక్షికంగా డబ్బు వెనక్కు తీసుకోవడానికి ఫామ్ 31 వీలు కల్పిస్తుంది. పేరా 68J కింద మెడికల్ ఎమర్జెన్సీ కాకుండా.. ఇతర ప్రత్యేక సందర్భాల్లో (68B), ప్రత్యేక పరిస్థితుల్లో ముందస్తు చెల్లింపులు (68H), వివాహాలు లేదా పిల్లల ఉన్నత విద్య (68K), దివ్యాంగుల పరికరాల కొనుగోలు కోసం చేసిన అప్పును తీర్చడానికి ముందస్తు ఉపసంహరణ (68N), పదవీ విరమణకు ముందు ఉపసంహరణలను (68NN) ఫామ్ 31 సులభతరం చేస్తుంది.


PPO నంబర్ అంటే ఏంటి?
EPFOలో రిజిస్టర్‌ అయిన ప్రతి ఉద్యోగికి ప్రత్యేకంగా 12 అంకెల సంఖ్యను కేటాయిస్తారు. ఈ నంబర్‌ను పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (Pension Payment Order - PPO) అంటారు. ఈ నంబర్ సాయంతో పెన్షన్‌కు సంబంధించిన అన్ని వివరాలు తనిఖీ చేయొచ్చు. ఉద్యోగుల పెన్షన్ స్కీమ్‌తో (EPS) అనుబంధంగా ఉంటుంది. మొత్తం EPS సమాచారం ఈ నంబర్‌లో దాగి ఉంటుంది. పింఛను పొందేందుకు PPO నంబర్‌ తప్పనిసరి. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో ఏదైనా ఫిర్యాదు దాఖలు చేసే సమయంలో, సంప్రదింపులు, లావాదేవీలు జరిపే విషయంలో రిఫరెన్స్ నంబర్‌గా PPO పని చేస్తుంది. ఒక బ్యాంక్ ఖాతా మూసివేసి, మరో బ్యాంక్ ఖాతా ద్వారా పెన్షన్ పొందేందుకు కూడా PPO నంబర్ తప్పనిసరి.


మరో ఆసక్తికర కథనం: ఈ టిప్స్‌ ఫాలో అయితే టాక్స్‌ రిఫండ్‌ వేగంగా వస్తుంది - ఎక్కువ డబ్బు జమ అవుతుంది!