Key Changes in EDLI Death Benefits: మీరు ఏదైనా కంపెనీలో పని చేస్తూ, EPFO (Employees' Provident Fund Organisation)లో సభ్యుడిగా ఉంటే, మీకు EDLI (Employees' Deposit Linked Insurance) పథకం గురించి తెలిసే ఉంటుంది. మీకు & మీ కుటుంబానికి ఒక ముఖ్యమైన సామాజిక భద్రత కవచంలా ఈ స్కీమ్ పని చేస్తుంది. EPFO, ఇటీవల EDLI స్కీమ్‌లో 3 ప్రధాన మార్పులు చేసింది. నూతన మార్పులు ఉద్యోగుల కుటుంబాలకు మరింత ప్రయోజనం చేకూరుస్తాయి.
EDLI పథకం అంటే ఏమిటి?
'ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్' అనేది ఉద్యోగుల భవిష్య నిధి (Employees' Provident Fund - EPF)లో ఒక భాగం. ఈ పథకం కింద, ఒక ఉద్యోగి ఉద్యోగం చేస్తున్న కాలంలో దురదృష్టవశాత్తు మరణిస్తే అతని కుటుంబానికి బీమా డబ్బు లభిస్తుంది.
EDLI స్కీమ్‌లో కొత్త ఎలాంటి మార్పులు వచ్చాయి?
1. మొదటి ఉద్యోగంలో చేరిన మొదటి సంవత్సరంలో కూడా బీమా కవరేజ్
గతంలో, ఒక ఉద్యోగి తన ఉద్యోగంలో చేరిన మొదటి సంవత్సరంలో మరణిస్తే అతని కుటుంబానికి ఎటువంటి బీమా ప్రయోజనాలు లభించవు. కొత్త నియమం ప్రకారం, ఇప్పుడు, అలాంటి సందర్భాలలో కూడా ఉద్యోగి కుటుంబానికి కనీసం రూ. 50,000 బీమా మొత్తం అందుతుంది. ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం సగటున 5,000 కుటుంబాలు ప్రయోజనం పొందుతాయని గణాంకాలు చెబుతున్నాయి.
2. ఉద్యోగం వదిలేసిన తర్వాత కూడా ప్రయోజనాలు
గతంలో, ఒక ఉద్యోగి ఉద్యోగం కోల్పోయి కొన్ని నెలల తర్వాత మరణిస్తే ఆ కుటుంబానికి ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్రయోజనం లభించేది కాదు. ఇప్పుడు, కొత్త నియమం ప్రకారం, ఉద్యోగి చివరి EPF సహకారం చెల్లించిన 6 నెలల లోపు మరణిస్తే ఆ కుటుంబానికి బీమా మొత్తం లభిస్తుంది. కంపెనీ రోల్ నుంచి ఉద్యోగి పేరును పూర్తిగా తొలగించకపోతే ఈ ప్రయోజనం వర్తిస్తుంది.
3. అనేక ఉద్యోగాలు మారినప్పుడు కూడా బీమా కవరేజ్ వర్తింపు
సాధారణంగా, ప్రైవేట్ రంగ ఉద్యోగులు పదోన్నతి లేదా మంచి జీతం వంటి అవకాశాలు వచ్చినప్పుడు కంపెనీ మారారు. ఒక ఉద్యోగి ఇలా ఉద్యోగాలు మారే సమయంలో కొన్ని రోజులు, వారాలు లేదా నెలల పాటు మరో ఉద్యోగంలో చేరకపోతే ( నిరుద్యోగిగా ఉంటే), గతంలో దానిని అతని "కంటిన్యుయస్ సర్వీస్"(Continuous service)గా పరిగణించేవారు కాదు. ఈ కారణంగా అతని కుటుంబానికి బీమా మొత్తం అందేది కాదు. ఇప్పుడు, రెండు ఉద్యోగాల మధ్య రెండు నెలల వరకు విరామం ఉన్నప్పటికీ, ఉద్యోగి కంటిన్యుయస్ సర్వీస్‌గా పరిగణిస్తారు. దీనివల్ల ఉద్యోగికి బీమా కవరేజ్ వర్తిస్తుంది. ఆ విరామ సమయంలో ఉద్యోగి మరణిస్తే బీమా మొత్తం ఆ కుటుంబానికి అందుబాటులో ఉంటుంది. దీనివల్ల ప్రతి సంవత్సరం సుమారు 1,000 కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది.
ఎంత బీమా కవర్ అందుబాటులో ఉంటుంది?
ఇప్పుడున్న నిబంధనల ప్రకారం, ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ఉద్యోగి కుటుంబానికి కనీసం రూ. 2.5 లక్షల నుంచి గరిష్టంగా రూ. 7 లక్షల బీమా మొత్తం లభిస్తుంది. ప్రస్తుతం, ఉద్యోగుల భవిష్య నిధిపై 8.25 శాతం వడ్డీ రేటు (EPF Interest Rate)ను అందిస్తున్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) 2024-25 ఆర్థిక సంవత్సరానికి EPF పై 8.25 శాతం వడ్డీ రేటును ఆమోదించింది. ఈ మార్పులు ప్రతి సంవత్సరం 14,000 కు పైగా కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తాయని & ఉద్యోగులు, వారి కుటుంబాల ఆర్థిక భద్రతను బలోపేతం చేస్తాయని EPFO చెబుతోంది.