Online Fraud In Pensions: ఉద్యోగులకు పెద్ద మొత్తంలో డబ్బు అవసరమైనప్పుడు ఆదుకునే మార్గాల్లో ఒకటి పెన్షన్ ఫండ్ లేదా పీఎఫ్ ఫండ్. మీ పని పూర్తయ్యేందుకు & మీరు మరెక్కడా డబ్బు అడగాల్సిన అవసరం లేకుండా ఇది సహకరిస్తుంది. చాలా మంది, ఎక్కువ మొత్తంలో డబ్బు కావలసినప్పుడు రుణం తీసుకోకుండా పీఎఫ్‌ ఖాతా నుంచి వీలైనంత ఎక్కువ డబ్బును విత్‌డ్రా చేస్తుంటారు. ఇలాంటి అవసరంలో ఉన్న వ్యక్తులను కొన్ని వెబ్‌సైట్‌లు, ఇ-మెయిల్ లేదా SMSలు ఆకర్షిస్తాయి.

PFRDA హెచ్చరికమీ పెన్షన్ ఫండ్ నుంచి మొత్తం డబ్బును ఉపసంహరించుకోవడంలో మీకు సాయం చేస్తామని ఇ-మెయిల్ లేదా SMSలు వస్తుంటాయి. నిజానికి అవి "మోసపూరిత ప్రకటనలు". అలాంటి ప్రకటనల మాయలో పడవద్దని 'పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్ అథారిటీ' ‍(Pension Fund Regulatory and Development Authority - PFRDA) హెచ్చరించింది. దీనిపై ప్రజలను హెచ్చరిస్తూ ఒక పబ్లిక్ నోటీసును కూడా జారీ చేసింది. "పెన్షన్‌ ఫండ్‌ డబ్బును పాక్షికంగా కాకుండా పూర్తిగా ఉపసంహరించుకోవచ్చని, అందుకు సాయం చేస్తామని చెప్పేవాళ్లు సైబర్ మోసగాళ్ళు కావచ్చు. పెన్షన్ నిధులను ఉపసంహరించుకునేందుకు మీకు సాయం చేసే పేరుతో మీ జీవితకాల పొదుపును దోచుకుంటారు" అని PFRDA హెచ్చరించింది. 

నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS), అటల్ పెన్షన్ యోజన (APY) వంటి పథకాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ 100% పెన్షన్ ఫండ్ మొత్తాన్ని ఉపసంహరించుకోలేరని PFRDA స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం, కొంత భాగాన్ని (పాక్షికంగా) మాత్రమే ఉపసంహరించుకోవచ్చని వెల్లడించింది.

సైబర్ దుండగులు పెన్షన్లను దొంగిలించే విధానం ఇదీ... పెండింగ్‌లో ఉన్న పెన్షన్ విడుదల పేరుతో, లైఫ్ సర్టిఫికెట్ అప్‌డేట్ పేరుతో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రభుత్వ విభాగాలు, బ్యాంకులు ఎప్పటికప్పుడు ఇలాంటి దుశ్చర్యల గురించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. అయినప్పటికీ సైబర్ మోసాలకు అడ్డకట్ట మాత్రం పడడం లేదు. పెన్షనర్ల జీవిత ధృవీకరణ పత్రాన్ని ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేసేందుకు సాయం చేసే నెపంతో సైబర్ మోసగాళ్ళు ఫోన్‌ కాల్స్‌ చేస్తున్నారని, వారి వలలో పడినవారిని మోసం చేసి పెన్షన్‌ డబ్బు దోచుకుంటున్నారని హెచ్చరిస్తూ 'సెంట్రల్ పెన్షన్ అకౌంటింగ్ ఆఫీస్' (CPAO) కూడా తన వెబ్‌సైట్‌లో స్పష్టంగా పేర్కొంది,  

OTP ద్వారా పెన్షన్ ఖాతాలకు యాక్సెస్ఫోన్‌ చేస్తున్న ఆన్‌లైన్‌ నేరగాళ్లు, పింఛనుదార్ల పెన్షన్ పేమెంట్‌ ఆర్డర్ (PPO) నంబర్, పుట్టిన తేదీ, బ్యాంక్ వివరాలు, ఆధార్ నంబర్ మొదలైన వ్యక్తిగత వివరాలను అడుగుతారు. ఆ తర్వాత, ధృవీకరణ కోసం, పింఛనుదారు మొబైల్‌ నంబర్‌కు వచ్చే వన్ టైమ్ పాస్‌వర్డ్‌ను (OTP) తమకు చెప్పని సూచిస్తారు. OTPని అనుమానిత వ్యక్తులకు చెబితే, పెన్షన్ ఖాతా యాక్సెస్ మోసగాడి చేతిలోకి వెళ్తుంది. ఖాతాలో ఉన్న డబ్బు మొత్తం స్వాహా అవుతుంది. బాధితులు తమ డబ్బును తిరిగి పొందడం కూడా కష్టంగా మారుతుంది.

ఒకవేళ, ఏ వ్యక్తి అయినా సైబర్‌ నేరం వల్ల డబ్బు కోల్పోతే, మొదటి గంట సమయం లోపలే బ్యాంక్‌ అధికార్లకు విషయం చెప్పాలి. దీనిని "గోల్డెన్‌ అవర్‌" అంటారు. దీనివల్ల, పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందే అవకాశాలు మెరుగుపడతాయి.

మరో ఆసక్తికర కథనం: భారత్‌లో ఉద్యోగాలకు 'టెస్లా' ప్రకటన - మోదీ చేసిన 'మ్యాజిక్‌' ఇది