Changes in Nifty50 Rejig: ఫుడ్‌ డెలివెరీ కంపెనీ జొమాటో, ఫిన్‌టెక్‌ కంపెనీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ షేర్లను NSE ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీ50లో చేరుస్తున్నారు. ఈ రెండు స్టాక్స్‌ 28 మార్చి 2025 నుంచి నిఫ్టీ50 ఇండెక్స్‌లో ట్రేడ్ అవుతాయి. ఈ ఇండెక్స్‌లో ఇప్పటికే ఉన్న బ్రిటానియా ఇండస్ట్రీస్, BPCL (భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్) స్టాక్స్‌ను ఇవి భర్తీ చేస్తాయి. అంటే, బ్రిటానియా ఇండస్ట్రీస్, బీపీసీఎల్ స్టాక్స్‌ 28 మార్చి 2025 నుంచి నిఫ్టీ50లో కనిపించవు. BSE ప్రధాన ఇండెక్స్‌ సెన్సెక్స్‌30 ఇండెక్స్‌లో జొమాటో ఇప్పటికే భాగమైంది.


ప్రధాన సూచీలలో మార్పులు 
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) తన అన్ని సూచీలలో కీలక మార్పులు చేసింది, ఆ మార్పుల గురించి వెల్లడిస్తూ ఒక ప్రెస్‌ నోట్‌ విడుదల చేసింది. జియో ఫైనాన్షియల్, జొమాటో ఇకపై నిఫ్టీ50లో భాగమవుతాయని ప్రెస్‌ నోట్‌లో తెలిపింది. NSE ప్రకటన ప్రకారం.. నిఫ్టీ నెక్ట్స్‌ 50లో 7 కొత్త స్టాక్స్ జాయిన్‌ అవుతాయి. గత సంవత్సరం స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్‌ అయిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, స్విగ్గీ, హ్యుందాయ్ మోటార్స్‌ ఇండియా, బీపీసీఎల్, బ్రిటానియా, CG పవర్, ఇండియన్ హోటల్స్ ఇప్పుడు నిఫ్టీ నెక్ట్ 50లో భాగం కానున్నాయి. కాగా... అదానీ టోటల్ గ్యాస్, BHEL, IRCTC, జియో ఫైనాన్షియల్, NHPC, యూనియన్ బ్యాంక్, జొమాటో ఈ సూచీ నుంచి బయటకు వచ్చాయి. 


నిఫ్టీ50 & నిఫ్టీ నెక్ట్స్‌ 50 సూచీల్లో మార్పులకు అనుగుణంగా, నిఫ్టీ100 ఇండెక్స్‌లోనూ మార్పులు జరిగాయి. నిఫ్టీ100 ఇండెక్స్‌లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, స్విగ్గీ, హ్యుందాయ్ మోటార్ ఇండియా, ఇండియన్ హోటల్స్, CG పవర్ వచ్చి చేరాయి. అదానీ టోటల్ గ్యాస్, BHEL, IRCTC, NHPC, యూనియన్ బ్యాంక్ ఈ సూచిక నుంచి బయటకు వచ్చాయి. 


నిఫ్టీ 500 సూచీలో కూడా 29 స్టాక్స్‌ను మినహాయించారు & 30 కొత్త స్టాక్స్‌ను చేర్చారు. నిఫ్టీ మిడ్‌ క్యాప్ 150 సూచీలో 17 స్టాక్స్‌ మారాయి. నిఫ్టీ స్మాల్‌ క్యాప్ 250 ఇండెక్స్‌లో 33 మార్పులు జరిగాయి. 


నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, తన బెంచ్‌మార్క్ ఇండెక్స్‌ల్లో చేసిన ఈ మార్పులన్నీ 28 మార్చి 2025 నుంచి అమలులోకి వస్తాయి. 


జొమాటో, గత సంవత్సరమే సెన్సెక్స్ 30 సూచీలో చోటు సాధించింది. అప్పటి నుంచి, ఈ షేర్లు నిఫ్టీ50లోకీ ఎంట్రీ ఇస్తాయని పెట్టుబడిదార్లు ఎదురు చూస్తున్నారు, వాళ్ల నిరీక్షణ ఫలించే సమయం దగ్గర పడింది. అయితే, జియో ఫైనాన్షియల్ సెన్సెక్స్‌లోని 30 స్టాక్స్‌లో భాగం కాలేదు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: బ్యాంక్‌ కస్టమర్లకు భారీ గుడ్‌న్యూస్‌ - లోన్‌ ప్రిక్లోజర్‌ ఛార్జీలు ఇకపై కనిపించవు, వినిపించవు!