Capital gains tax on ULIP Withdrawal: మీ దగ్గర 'యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్' (ULIP) ఉంటే, ఒక సంవత్సరం పైగా దానిని హోల్డ్ చేస్తుంటే, ఇకపై మోత మోగిపోతుంది. యులిప్‌ను మీరు విత్‌డ్రా చేసినప్పుడు 'మూలధన లాభాల పన్ను' చెల్లించాలి. ఏప్రిల్ 01, 2026 నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుంది. అయితే, మీరు చెల్లించిన వార్షిక ప్రీమియం ₹2.5 లక్షలు దాటకపోతే మీరు మూలధన లాభాల పన్ను (CGT) చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే, మీద టాక్స్ భారం గణనీయంగా తగ్గుతుంది.
యులిప్ అంటే?యులిప్ (ULIP) ఒక పెట్టుబడి సాధనం. ఇది, జీవిత బీమా + పెట్టుబడి రెండు ప్రయోజనాలను అందిస్తుంది. అంటే, జీవిత బీమాను పెట్టుబడితో కలిపే ప్లాన్ ఇది. మీరు యులిప్‌లో పెట్టుబడి పెడితే, ఆ పెట్టుబడిలో కొంత భాగాన్ని మీ బీమా కవరేజ్ కోసం ఉపయోగిస్తారు, మిగిలిన మొత్తాన్ని ఈక్విటీ & డెట్‌లో పెట్టుబడి పెడతారు.
కేంద్ర బడ్జెట్ 2025లో క్లారిటీవాస్తవానికి, 'యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్'ల (ULIPలు)పై పన్ను విషయంలో నెలకొన్న సందేహాలకు కేంద్ర బడ్జెట్ 2025 ఓ క్లారిటీ వచ్చింది. ఆ బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) ప్రకటించిన ప్రకారం, ₹2.5 లక్షలకు పైగా వార్షిక ప్రీమియం చెల్లించే ULIPలకు ఆదాయ పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 10(10D) ప్రకారం పన్ను మినహాయింపు ఉండదు. అంతేకాదు, ఈ పాలసీలు మూలధన లాభాల కింద పన్ను పరిధిలోకి వస్తాయి. ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం పాటు ఉంచిన పాలసీల నుంచి వచ్చే లాభాలపై 'దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను' (LTCG) వర్తిస్తుంది, 12.5% టాక్స్ చెల్లించాలి. ముందే చెప్పినట్లు, 01 ఏప్రిల్ 2026 నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుంది.
నిర్మల సీతారామన్ ఇచ్చిన క్లారిటీతో, అధిక వార్షిక ప్రీమియం (₹2.5 లక్షలకు పైగా) ఉన్న ULIPలపై రాబడిని LTCG కింద పన్ను విధించాలా లేదా 'ఇతర వనరుల నుంచి వచ్చిన ఆదాయం' (income from other sources) కేటగిరీ కింద పన్ను విధించాలా అనే విషయంలో స్పష్టత వచ్చింది.
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌కు సమానంగా పన్ను₹2.5 లక్షల కంటే ఎక్కువ వార్షిక ప్రీమియం ఉన్న ULIPల నుంచి వచ్చిన రాబడిని ఏప్రిల్ నుంచి మూలధన లాభాలుగా వర్గీకరిస్తారు. ఆ రాబడిపై, ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 112A కింద పన్ను విధిస్తారు. పాలసీని 12 నెలలకు పైగా హోల్డ్ చేస్తే, విత్‌డ్రా సమయంలో దీర్ఘకాలిక మూలధన ఆస్తిగా పరిగణించి, లాభాలపై 12.5% పన్ను వేస్తారు. ఈ కొత్త ఫ్రేమ్‌వర్క్ ULIPలను ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ తరహాలో టాక్స్ కిందకు తీసుకొస్తుంది.
31 మార్చి 2025 వరకు ఇలా..
ప్రీమియం మొత్తం, హామీ ఇచ్చిన మొత్తంలో 10% దాటినప్పటికీ, విత్‌డ్రా మొత్తాన్ని మూలధన లాభంగా పరిగణించడం లేదు.
విత్‌డ్రా మొత్తానికి పన్ను మినహాయింపు లేనప్పటికీ, దానిపై ఏ పద్దు కింద పన్ను విధించాలో అస్పష్టత ఉంది.
01 ఏప్రిల్ 2025 నుంచి ఇలా...
ULIPల కింద అందుకున్న మొత్తానికి 'మూలధన లాభాలు' పద్దు కింద పన్ను చెల్లించాలి.
ఇతర బీమా పాలసీల నుంచి వచ్చిన రాబడిపై 'ఇతర వనరుల నుంచి వచ్చిన ఆదాయం'గా పన్ను విధిస్తారు.
ఈ మార్పు ఎందుకు తీసుకొచ్చారు?2025 కేంద్ర బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన ఈ మార్పులను ఆర్థిక చట్టం 2021 ఆధారంగా తీసుకొచ్చారు. ఈ చట్టం, ఇప్పటికే, ₹2.5 లక్షల కంటే ఎక్కువ ప్రీమియం కలిగిన ULIPలకు పన్ను మినహాయింపుల్లో కోతలు విధించింది. జీవిత బీమా పాలసీల ముసుగులో ఎక్కువ విలువైన పెట్టుబడులు పెట్టి, పన్ను ఎగవేతలకు పాల్పడే కేసులను అరికట్టడం & ఎక్కువ విలువైన బీమా పాలసీలు దుర్వినియోగం కాకుండా నిరోధించడం ఈ మార్పు ఉద్దేశం.