Fixed Deposit Rates For Senior Citizens: దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) రెపో రేటును పెంచింది. దీనికి అనుగుణంగా, దేశంలోని అన్ని బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మీద చెల్లించే వడ్డీ రేట్లను పెంచాయి. సీనియర్‌ సిటిజన్లకు (60 సంవత్సరాలు వయస్సు పైబడిన పౌరులు) ఆకర్షణీయమైన రాబడిని ఆఫర్‌ చేస్తున్నాయి. 


తాజాగా... స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank), ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) మొదలు అన్ని ప్రధాన బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించాయి. అన్ని జాతీయ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.5% నుంచి 8% వరకు రాబడిని అందిస్తున్నాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లు (SFB) కూడా సీనియర్‌ సిటిజన్‌ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 9 నుంచి 9.5 శాతం వడ్డీని చెల్లిస్తోంది. 


సీనియర్ సిటిజన్‌ ఎఫ్‌డీలపై ఎక్కువ వడ్డీ ఆఫర్‌ చేస్తున్న బ్యాంకులు: 


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సీనియర్ సిటిజన్లకు, 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల మధ్య ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.5 శాతం వడ్డీ రేటును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తోంది. 400 రోజుల కాలానికి, అమృత్ కలశ్‌ పేరిట ప్రత్యేక డిపాజిట్ స్కీమ్‌ను కూడా ఈ బ్యాంక్‌ ప్రారంభించింది. ఈ పథకం మార్చి నెలాఖరు వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ స్కీమ్‌లో సాధారణ పౌరులకు 7.10 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం వడ్డీ రేటు లభిస్తుంది.


ICICI బ్యాంక్
ICICI బ్యాంక్‌లో సీనియర్ సిటిజన్లు 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల FDలపై 7.50 శాతం వడ్డీ రేటును పొందుతున్నారు. ఈ పథకం ఏప్రిల్ 7, 2023 వరకు అందుబాటులో ఉంటుంది.


HDFC బ్యాంక్
HDFC బ్యాంక్ సీనియర్ సిటిజన్స్ కోసం సీనియర్ సిటిజన్ కేర్ FDని ఆఫర్ చేసింది. ఇందులో వడ్డీ రేటు 7.75 శాతం, కాల గడువు 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఈ పథకం మార్చి 31, 2023 వరకు అందుబాటులో ఉంటుంది. రూ. 2 కోట్ల లోపు డిపాజిట్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.


IDBI బ్యాంక్
సీనియర్ సిటిజన్లకు ఎఫ్‌డీలపై అదనపు వడ్డీ రేటును IDBI బ్యాంక్ 0.75 శాతం వరకు పెంచింది. ఈ పథకం కింద కనీస డిపాజిట్ మొత్తం రూ. 10,000. గరిష్ట పరిమితి రూ. 2 కోట్లు. సీనియర్ సిటిజన్లు 1 సంవత్సరం - 2 సంవత్సరాల కాల గడువు (444 రోజులు & 700 రోజులు మినహా) ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.50 శాతం వడ్డీ రేటును పొందవచ్చు. 2 - 3 సంవత్సరాల FDలకు వడ్డీ రేటు 7.25 శాతంగా ఉంది. ఈ పథకం మార్చి 31, 2022 వరకు చెల్లుబాటులో ఉంటుంది.


యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
FDపై అత్యధిక వడ్డీని యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఆఫర్‌ చేస్తోంది. 1001 రోజుల FDపై 9.00% వడ్డీని, సీనియర్ సిటిజన్‌లకు 9.50% వడ్డీని అందిస్తోంది.


ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో 1001 రోజుల FDలో సాధారణ పౌరులకు 8.00 శాతం వడ్డీ & సీనియర్ సిటిజన్‌లకు 8.75 శాతం వడ్డీ ప్రయోజనం అందుతోంది.


నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
ఈ బ్యాంక్‌, 1001 రోజుల్లో మెచ్యూర్ అయ్యే FDలపై 8.00% వడ్డీని & ఇదే కాలానికి సీనియర్ సిటిజన్‌లకు 8.75% వడ్డీని అందిస్తోంది.


జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
ఈ బ్యాంకులో, సాధారణ ప్రజలకు 1001 రోజుల ఎఫ్‌డిపై 8.10 శాతం వడ్డీ రేటు ప్రయోజనం లభిస్తోంది, బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు 8.80 శాతం వడ్డీని బ్యాంక్‌ అందిస్తోంది.


సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో 1001 రోజుల FD కోసం ఇన్వెస్ట్ చేస్తే, సంవత్సరానికి 8.51 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. సీనియర్ అయితే, ఇదే కాల డిపాజిట్‌కు 8.76 శాతం వడ్డీని బ్యాంక్‌ అందిస్తుంది.


ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో 1001 రోజుల FDపై సాధారణ పౌరులకు 8.00% వార్షిక వడ్డీ, సీనియర్ సిటిజన్లకు 8.75 శాతం వడ్డీ లభిస్తోంది.


బంధన్ బ్యాంక్‌
బంధన్ బ్యాంక్ 3.00 శాతం నుంచి 8.50 శాతం వరకు వడ్డీ రేట్లను సీనియర్ సిటిజన్లకు ఆఫర్ చేస్తోంది. సాధారణ పెట్టుబడిదార్లతో పోలిస్తే, సీనియర్ సిటిజన్లకు 0.75 ఎక్కువ రేటు చెల్లిస్తోంది. ఈ బ్యాంక్‌లో 600 రోజుల ప్రత్యేక FD పథకాన్ని సీనియర్ సిటిజన్లు ఎంచుకోవచ్చు, దీనిపై 8.50 శాతం వడ్డీ రేటు వారికి లభిస్తుంది.