New Rules From November 1: నవంబర్ నెల ప్రారంభంతో, సామాన్యులకు సంబంధించిన అనేక ముఖ్యమైన విషయాలలో మార్పులు రాబోతున్నాయి. ఈ మార్పులు మీ జేబుపై నేరుగా ప్రభావం చూపుతాయి - అది బ్యాంకింగ్, టాక్సేషన్ లేదా ప్రభుత్వ పత్రాల గురించి అయినా చాలా ఛేంజెస్ వస్తున్నాయి. నవంబర్ 1 నుంచి అమలులోకి వచ్చే ఈ ప్రధాన మార్పుల గురించి వివరంగా తెలుసుకుందాం.
1. SBI కార్డ్ హోల్డర్ల కోసం కొత్త ఫీజు విధానం
ఒకటో తేదీ నుంచి, SBI క్రెడిట్ కార్డ్ వినియోగదారులు కొన్ని లావాదేవీలపై అదనపు ఛార్జీలు చెల్లించవలసి ఉంటుంది. విద్యకు సంబంధించిన చెల్లింపులు (పాఠశాల/కళాశాల ఫీజులు వంటివి) CRED లేదా MobiKwik వంటి మూడో పక్ష యాప్‌ల ద్వారా చేస్తే, అదనంగా 1% ఛార్జ్ విధిస్తారు. అలాగే, మీరు డిజిటల్ వాలెట్ (Paytm లేదా PhonePe వంటివి) లో ₹1,000 కంటే ఎక్కువ మొత్తం SBI కార్డ్ నుంచి లోడ్ చేస్తే, దానిపై కూడా 1% రుసుము చెల్లించాలి.
2. ఆధార్ కార్డ్ అప్‌డేట్ ఛార్జీలలో పెద్ద మార్పు
UIDAI పిల్లల ఆధార్ కార్డ్ అప్‌డేట్ విషయంలో ఉపశమనం కలిగించింది. పిల్లల బయోమెట్రిక్ అప్‌డేట్ ఇప్పుడు పూర్తిగా ఉచితం (వచ్చే ఏడాది వరకు). పెద్దలకు పేరు, చిరునామా, పుట్టిన తేదీ లేదా మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయడానికి ₹75 రుసుము ఉంటుంది. వేలిముద్రలు లేదా ఐ స్కాన్ (బయోమెట్రిక్ అప్‌డేట్) కోసం ₹125 ఛార్జ్ ఉంటుంది. అలాగే, ఇప్పుడు మీరు కొన్ని ప్రాథమిక వివరాలను - పేరు, పుట్టిన తేదీ లేదా చిరునామా - ఎటువంటి పత్రాలను అప్‌లోడ్ చేయకుండానే అప్‌డేట్ చేయవచ్చు.
3. కొత్త GST స్లాబ్‌లు అమలులోకి వస్తాయి
నవంబర్ 1 నుంచి ప్రభుత్వం GST నిర్మాణంలో పెద్ద మార్పును అమలు చేయబోతోంది. పాత నాలుగు స్లాబ్‌లను (5%, 12%, 18%, 28%) సరళీకృతం చేస్తూ రెండింటిగా మార్చారు. ఇప్పుడు 12%, 28% స్లాబ్‌లను తొలగించారు. అలాగే, లగ్జరీ, హానికరమైన వస్తువులపై ఇప్పుడు 40% వరకు GST విధించారు. GST నిర్మాణాన్ని సరళీకృతం చేయడం, పారదర్శకంగా ఉంచడం ప్రభుత్వ లక్ష్యం.
4. బ్యాంక్ నామినేషన్ కొత్త నియమాలు
నవంబర్ 1 నుంచి, బ్యాంక్ ఖాతాల కోసం నామినేషన్లకు సంబంధించిన నిబంధనలలో మార్పులు చేశారు. ఇప్పుడు ఒక ఖాతా, లాకర్ లేదా సురక్షిత కస్టడీ కోసం గరిష్టంగా నలుగురు నామినేషన్లను చేయవచ్చు. నామినీలను జోడించే లేదా మార్చే ప్రక్రియను మునుపటి కంటే సులభతరం చేశారు. ఆన్‌లైన్‌లో కూడా అందుబాటులోకి తెచ్చారు. ఇది అత్యవసర పరిస్థితుల్లో కుటుంబానికి నిధులను పొందడానికి సులభతరం చేస్తుంది.
5. NPS నుంచి UPSకి మారడానికి గడువు పొడిగింపు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉపశమనం - నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) నుంచి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS)కి మారాలనుకునే ఉద్యోగులకు ఇప్పుడు నవంబర్ 30 వరకు సమయం ఇచ్చారు. ఈ అదనపు సమయం ఉద్యోగులకు వారి ఎంపికలను సమీక్షించడానికి, ప్లాన్ చేయడానికి అవకాశం ఇస్తుంది.