Bank Overdraft Vs Personal Loan: ప్రతి ఒక్కరి జీవితంలో ఊహించని అవసరాలు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో డబ్బు లేకపోతే అప్పు చేయాలి. ప్రస్తుతం, ప్రజలకు చాలా రకాల లోన్‌ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో.. వ్యక్తిగత రుణం, ఓవర్‌డ్రాఫ్ట్‌ ఎక్కువ ప్రాచుర్యం పొందాయి.


వ్యక్తిగత రుణం, ఓవర్‌డ్రాఫ్ట్.. ఈ రెండు ఆప్షన్లు తక్షణం డబ్బును సమకూరుస్తాయి, అత్యవసర పరిస్థితుల్లో ఆదుకుంటాయి. కొంతమంది ప్రజలు.. పర్సనల్ లోన్, ఓవర్‌డ్రాఫ్ట్ ఒకటే అని పొరపడుతున్నారు. ఇవి రెండూ వేరు. ఈ రెండింటి మధ్య కొన్ని సారూప్యతలు, అలాగే తేడాలు కూడా ఉన్నాయి.


డబ్బు అవసరమైనప్పుడు పర్సనల్ లోన్ తీసుకోవడం మంచిదా, లేదా ఓవర్‌డ్రాఫ్ట్‌కు వెళ్లాలా అన్నది చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఈ రెండు లోన్‌ ఆప్షన్ల మధ్య తేడాల గురించి తెలుసుకుంటే, ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుంది.


పర్సనల్ లోన్ అంటే ఏంటి?
వ్యక్తిగత రుణం అనేది ఒక అసురక్షిత రుణం (Unsecured loan). అంటే, మీరు ఈ లోన్‌ తీసుకోవడానికి బ్యాంక్‌కు ఎలాంటి ఆస్తిని తనఖా పెట్టాల్సిన అవసరం ఉండదు. బ్యాంక్‌ లేదా ఆర్థిక సంస్థ.. దరఖాస్తుదారుడి క్రెడిట్ స్కోర్, జీతం, ఆదాయం, బ్యాంక్‌తో అనుబంధం వంటి కొన్ని అంశాల ఆధారంగా కస్టమర్ రుణ చెల్లింపు సామర్థ్యాన్ని అంచనా వేస్తాయి. వీటి ఆధారంగా, కస్టమర్‌కు ఇచ్చే లోన్‌ను, దానిపై వడ్డీ రేటును నిర్ణయిస్తాయి. 


వ్యక్తిగత రుణం విషయంలో, రుణగ్రహీత ఒకేసారి లోన్‌ మొత్తాన్ని తీసుకుంటాడు. ఆ డబ్బును అతని ఇష్టానుసారం ఉపయోగించుకుంటాడు. వ్యక్తిగత రుణంపై వడ్డీ రేటు స్థిరంగా ఉంటుంది. అంటే, రుణం తిరిగి చెల్లించే వ్యవధిలో వడ్డీ రేటును పెంచడం లేదా తగ్గించడం ఉండదు. రుణాన్ని EMI రూపంలో చెల్లించాలి. ఈ EMIలో అసలు + వడ్డీ రెండూ కలిసి ఉంటాయి. ప్రారంభంలో, EMIలో వడ్డీకి ఎక్కువ వెయిటేజీ ఉంటుంది. EMIలు చెల్లిస్తున్న కొద్దీ, క్రమంగా వడ్డీ వెయిటేజీ తగ్గి అసలు (Principal Amount) వెయిటేజీ పెరుగుతుంది. లోన్‌ టెన్యూర్‌ ముగిసేసరికి వడ్డీతో సహా బాకీ మొత్తం తీరిపోతుంది.


ఓవర్‌డ్రాఫ్ట్ అంటే ఏంటి?
ఓవర్‌డ్రాఫ్ట్ అనేది ఒక రకమైన సురక్షిత రుణం (Secured loan). ఇందులో, కస్టమర్‌, తన బ్యాంక్‌ నుంచి క్రెడిట్ పరిమితిని పొందుతాడు. ఓవర్‌డ్రాఫ్ట్ క్రెడిట్ పరిమితి కస్టమర్‌కు చెందిన కరెంట్ అకౌంట్‌ లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్‌లోని బ్యాలెన్స్‌పై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా, బ్యాంకులు కరెంట్ ఖాతా బ్యాలెన్స్ లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్ మొత్తంలో కొంత భాగానికి సమానమైన పరిమితిని అందిస్తాయి. ఆ పరిమితి ముగిసే వరకు, కస్టమర్‌, తన అవసరాన్ని బట్టి డబ్బును దపదఫాలుగా విత్‌డ్రా చేసుకోవచ్చు.


పర్సనల్ లోన్ వర్సెస్‌ ఓవర్‌డ్రాఫ్ట్
దీర్ఘకాలికంగా డబ్బు అవసరమైతే వ్యక్తిగత రుణం ఉపయోగకరంగా ఉంటుంది. స్వల్పకాలిక అవసరాలకు ఓవర్‌డ్రాఫ్ట్ ఉత్తమ ఎంపిక. పర్సనల్ లోన్‌లో.. రుణం మంజూరైన వెంటనే, ఆ మొత్తం డబ్బుకు వడ్డీ పడుతుంది. ఓవర్‌డ్రాఫ్ట్‌లో.. ఉపయోగించే మొత్తానికి మాత్రమే వడ్డీని ఛార్జ్ చేస్తారు. పర్సనల్ లోన్‌లో.. వడ్డీని నెలవారీ ప్రాతిపదికన లెక్కిస్తారు. ఓవర్‌డ్రాఫ్ట్‌లో.. వడ్డీని రోజువారీ ప్రాతిపదికన లెక్కిస్తారు. పర్సనల్ లోన్ రీపేమెంట్ EMI ద్వారా జరుగుతుంది. ఓవర్‌డ్రాఫ్ట్‌ విషయంలో, ఖాతాలో డబ్బును డిపాజిట్ చేయడం ద్వారా ఎప్పుడైనా చెల్లించొచ్చు.


మరో ఆసక్తికర కథనం: భారతీయ విలాసానికి ప్రపంచం ఫిదా - టాప్‌ 100లో 6 ఇండియన్‌ బ్రాండ్స్‌