Aditya Birla Group Mumabi Bungalow: ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన BGH ప్రాపర్టీస్‌ (BGH Properties) ముంబైలోని ఒక ఖరీదైన ప్రాంతంలో విలాసవంతమైన బంగ్లాను కొనుగోలు చేసింది. Zapkey.com డేటా ప్రకారం, ఈ బంగ్లా ధర 220 కోట్లు. ఇది రెండు అంతస్తుల భవనం (ground-plus-two property). ముంబై ML దహనుకర్ మార్గ్‌లోని కార్మికెల్ రోడ్ పక్కన ఈ బంగ్లా ఉంది.


ఆదిత్య బిర్లా కొనుగోలు చేసిన ఆస్తి నిర్మాణ విస్తీర్ణం 18,494.05 చదరపు అడుగులు. దీనిలో 190 చదరపు అడుగుల గ్యారేజీ కూడా ఉంది. ఈ నెల 10వ తేదీన రిజిస్ట్రేషన్‌ జరిగినట్లు డాక్యుమెంట్లను బట్టి తెలుస్తోంది. ఈ ఆస్తి కోసం స్టాంప్‌ డ్యూటీ రూపంలోనే రూ. 13.20 కోట్లు చెల్లించారు. డీడ్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్ ద్వారా లావాదేవీ జరిగింది. 


2015లో, కుమార్‌ మంగళం బిర్లా (Kumar Mangalam Birla), ముంబై మలబార్ హిల్‌లోని లిటిల్ గిబ్స్ రోడ్‌లో ఉన్న ఐకానిక్ జతియా హౌస్‌ను (Jatia House) రూ. 425 కోట్లకు కొనుగోలు చేశారు. విశాలమైన బహిరంగ ప్రాంతాలు, భారీ పార్కింగ్‌ ప్రదేశాలు ఆ ఆస్తిలో భాగంగా ఉన్నాయి. 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దానిని నిర్మించారు. 2014లో రూ. 372 కోట్లకు అమ్ముడుపోయిన హోమీ భాభా ఇంటికి ఈ ఇల్లు కేవలం కూతవేటు దూరంలోనే ఉంటుంది.


ముంబై చరిత్రలోనే అతి పెద్ద ప్రాపర్టీ డీల్స్‌లో ఒకటి.. రాధాకిషన్ దమానీ (Radhakishan Damani ), అతని సోదరుడు గోపీకిషన్ దమానీ ‍‌(Gopikishan Damani) పేరిట 2021లో జరిగింది. రూ. 1,001 కోట్లతో ముంబైలోని అత్యంత ఖరీదైన మలబార్ హిల్ ప్రాంతంలో ఒక ఇంటిని ఈ సోదరులు కొనుగోలు చేశారు. మహారాష్ట్రలో, హౌసింగ్ యూనిట్ల విక్రయంపై 3 శాతం స్టాంప్ డ్యూటీ డిస్కౌంట్‌ ఇచ్చినప్పుడు, ఆ ఆఫర్‌ చివరి రోజున మార్చి 31, 2021వ తేదీన ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ జరిగింది.


బెంగళూరు ఆస్తి కొనుగోలులో కొత్త రికార్డ్‌


ఫార్మాస్యూటికల్ కంపెనీ మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ‍‌(Micro Labs Chairman & MD Dilip Surana) దిలీప్ సురానా కూడా బెంగళూరులో రికార్డ్‌ ధరకు ఒక బంగ్లా కొన్నారు. డోలో-650 టాబ్లెట్లను తయారు చేస్తున్న కంపెనీ ఓనర్‌ ఈయన. మైక్రో ల్యాబ్స్ MD కొన్న ఈ ఆస్తిలో విలాసవంతమైన బంగ్లాతో పాటు కొంత ఖాళీ స్థలం కూడా ఉంది.


సేల్ డీడ్ పత్రాల ప్రకారం, దిలీప్ సురానా 66 కోట్ల రూపాయలకు ఆస్తి కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నారు, ఈ కేటగిరీలో అతి పెద్ద డీల్‌గా ఇది నిలిచింది. బంగ్లాతో కూడిన ఈ ఆస్తి, బెంగళూరులోని ఫెయిర్ ఫీల్డ్ లే-ఔట్ ప్రాంతంలో ఉంది. గతంలో దీనిని రేస్ కోర్స్ రోడ్ అని పిలిచేవాళ్లు. ఈ డీల్‌లో 12,043.22 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఖాళీ స్థలం (ప్లాట్‌), 8,373.99 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న బంగ్లా ఉన్నాయి. దిలీప్ సురానా, తన కొత్త ఆస్తిని జీజీ రాజేంద్ర కుమార్, అతని భార్య సాధన రాజేంద్ర కుమార్, మను గౌతమ్ నుంచి కొనుగోలు చేశారు. 


రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ CRE మ్యాట్రిక్స్ వెల్లడించిన సమాచారం ప్రకారం, ఈ ఆస్తి కోసం సురానా 3.36 కోట్ల రూపాయల స్టాంప్ డ్యూటీని చెల్లించారు. సురానాకు ఇప్పటికే ఫెయిర్ ఫీల్డ్ లే-ఔట్ ప్రాంతంలో కొంత నివాస స్థలం ఉంది.


కేంద్ర బడ్జెట్ తర్వాత పెరిగిన పెద్ద ఇళ్ల అమ్మకాలు


ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన, పార్లమెంటులో కొత్త కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌, బడ్జెట్‌లో భాగంగా చేసిన ప్రకటన విలాసవంతమైన గృహాల విక్రయాలను వేగవంతం చేసింది. నివాస ఆస్తుల్లో (రెసిడెన్షియల్ ప్రాపర్టీ‌స్‌) పెట్టుబడిపై క్యాపిటల్ గెయిన్స్ టాక్స్‌ మినహాయింపును రూ. 10 కోట్లకు పరిమితం చేస్తామని బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ నిబంధన 2023 ఏప్రిల్ 01 నుంచి అమల్లోకి వచ్చింది. అందువల్ల, కొత్త నిబంధన అమల్లోకి రాకముందు, ఫిబ్రవరి & మార్చి నెలల్లో విలాసవంతమైన ఇళ్ల విక్రయాలు పెరిగాయి.