Aadhar Number-PAN Linking Deadline: మీరు ఇప్పటికీ మీ ఆధార్‌ నంబర్‌-పాన్‌ అనుసంధానం చేయకపోతే ఇప్పటికైనా ఆ పని పూర్తి చేయండి. లేకపోతే ఆదాయ పన్ను విభాగమే (Income Tax Deportment) మీ బద్ధకాన్ని వదిలిస్తుంది. ఆధార్‌తో పాన్‌ను లింక్‌ చేయని పన్ను చెల్లింపుదార్ల కోసం ఐటీ డిపార్ట్‌మెంట్‌ ప్రకటించిన డెడ్‌లైన్‌ ఈ రోజుతో (31 మే 2024) ముగుస్తుంది. ఈ రోజు సాయంత్రంలోగా ఈ రెండు కీలక పత్రాలను జత చేయకపోతే, సాధారణం కంటే రెట్టింపు పన్ను వసూలు చేస్తుంది. 


ఆధార్‌ నంబర్‌-పాన్‌ను ఉచితంగా అనుసంధానించే గడువు చాలా కాలం క్రితమే ముగిసింది. ఇప్పుడు ఈ రెండు పత్రాలను అనుసంధానించాలంటే రూ. 1,000 జరిమానా చెల్లించాలి. 


ఆధార్‌-పాన్‌ అనుసంధానించకపోతే ఏం జరుగుతుంది?


వాస్తవానికి, పాన్‌-ఆధార్‌ అనుసంధానించకపోతే రెట్టింపు TDS లేదా TCS కట్‌ అవుతాయి. అయితే... పన్ను చెల్లింపుదార్లకు ఊరటనిచ్చేందుకు, ఈ రెండు పత్రాలను 31 మే 2024 లోగా అనుసంధానించుకోవడానికి ఐటీ డిపార్ట్‌మెంట్‌ వెసులుబాటు ఇచ్చింది. 2024 మార్చి 31 వరకు (2023-24 ఆర్థిక సంవత్సరం చివరి వరకు) వ్యక్తులు నిర్వహించిన లావాదేవీలకు సంబంధించి ఈ ఊరట లభిస్తుంది. అంటే.. ఈ రోజు సాయంత్రంలోగా పాన్‌-ఆధార్‌ అనుసంధానిస్తే, సదరు వ్యక్తి 2024 మార్చి 31 వరకు నిర్వహించిన లావాదేవీలపై రెట్టింపు TDS లేదా TCS వసూలు చేయరు. లేకపోతే డబుల్‌ టాక్స్‌ కట్‌ అవుతుంది, దానిని ITR సమర్పించే సమయంలో క్లెయిమ్‌ చేసుకోవాలి.


మన దేశంలో, ఒక వ్యక్తి ఆర్జించే వివిధ రకాల ఆదాయాలు TDS పరిధిలోకి వస్తాయి. జీతం, పెట్టుబడులపై వచ్చే ఆదాయం, బ్యాంక్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయం, కమీషన్ వంటివి విత్‌డ్రా చేస్తున్నప్పుడు, నిబంధనల ప్రకారం వాటిపై TDS కట్‌ అవుతుంది. ఇది, ముందస్తుగానే పన్ను చెల్లించడం లాంటిది. ఇలా మినహాయించిన టీడీఎస్‌ను ఆయా సంస్థలు ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తాయి.



వ్యక్తులకే కాదు, SFT ఫైల్‌ చేయడానికి వివిధ ఆర్థిక సంస్థలకు కూడా ఈ రోజే చివరి గడువు. బ్యాంకులు, పోస్ట్‌ ఆఫీసు, బాండ్లు/డిబెంచర్లు జారీ చేసిన సంస్థలు, మ్యూచువల్‌ ఫండ్‌ ట్రస్టీలు, షేర్లపై డివిడెండ్‌ చెల్లించిన సంస్థలు, ఫారెక్స్‌ డీలర్లు, సబ్‌ రిజిస్ట్రార్లు, NBFCలు 2024 మే 31 సాయంత్రం నాటికి SFT ఫైల్‌ చేయాలని ఆదాయ పన్ను విభాగం సూచించింది. ఈ గడువు దాటితే, రోజుకు వెయ్యి రూపాయల ఫైన్‌ చెల్లించాల్సి ఉంటుంది.


ఆధార్‌-పాన్ లింక్ చేయడం ఎలా? ‍‌(How to link Aadhaar-Pan?)


- పాన్‌ కార్డ్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి, ఆదాయ పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్ https://incometaxindiaefiling.gov.in/ లోకి వెళ్లాలి.
- వెబ్‌సైట్‌లో మీరు ఇంకా రిజిస్టర్‌ చేసుకోనట్లయితే, ముందుగా రిజిస్టర్‌ చేసుకోండి. ఇక్కడ, యూజర్‌ ఐడీగా మీ పాన్‌ నంబర్‌ను మాత్రమే ఇవ్వాలి.
- మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ ద్వారా లాగిన్ అవ్వండి.
- ప్రొఫైల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి 'లింక్ ఆధార్‌'పై క్లిక్ చేయండి.
- మీ పుట్టిన తేదీ, జెండర్‌ వివరాలను ఇప్పుడు నమోదు చేయాలి.
- మీ మిగిలిన వివరాలను ఆధార్‌తో సరిపోల్చుకోండి. అన్నీ సరిగ్గా ఉంటే, కంటిన్యూ మీద క్లిక్ చేయండి.
- పెనాల్టీగా రూ. 1,000 చెల్లించడం ద్వారా మీ పాన్‌ - ఆధార్‌ను లింక్ చేయవచ్చు.
- పాన్ - ఆధార్ లింక్ అయిన వెంటనే మీ మొబైల్ నంబర్‌కు, ఈ-మెయిల్ ఐడీకి మెసేజ్ వస్తుంది.


పాన్-ఆధార్‌ లింక్ స్టేటస్‌ను ఎలా చూడాలి? ‍‌(How To Check Aadhar-PAN Linking Status?)


- ఆదాయ పన్ను విభాగం అధికారిక పోర్టల్‌ www.incometax.gov.in/iec/foportal/ లో సైన్ ఇన్ చేయకుండానే పాన్-ఆధార్ లింక్ స్థితిని తనిఖీ చేయవచ్చు.
- ఈ-ఫైలింగ్ పోర్టల్ హోమ్‌పేజీలో, 'Quick Links' విభాగంలోకి వెళ్లి, 'లింక్ ఆధార్ స్టేటస్' మీద క్లిక్ చేయండి.
- మీ పాన్, ఆధార్ నంబర్లను సంబంధిత గడుల్లో నమోదు చేసి, 'View Linked Aadhaar Status' మీద క్లిక్ చేయండి.
- పాన్‌-ఆధార్ లింక్‌ అయిందో, లేదో స్క్రీన్‌పై కనిపిస్తుంది.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి