7th Pay Commission: గుడ్‌న్యూస్! కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల నిబంధనలను మోదీ సర్కారు సవరించింది. 7th పే మ్యాట్రిక్స్‌, పే లెవల్స్‌ను అనుసరించి ఇకపై పదోన్నతులు కల్పించనుంది. ఉన్నత పదవులు అధిరోహించేందుకు అవసరమైన కనీస సేవల కాలాన్ని మూడేళ్లకు తగ్గించింది. ఈ మేరకు 2022, సెప్టెంబర్‌ 20 తేదీతో ఆఫీస్‌ మెమోరాండాన్ని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ (DoPT) జారీ చేసింది.


డీఓపీటీ 23.3.2009 తేదీతో జారీ చేసిన నిబంధనలను కేంద్ర సమీక్షించింది. యూపీఎస్‌సీ, ఇతర కాంపిటెంట్‌ అథారిటీ సంస్థలను సంప్రదించి సవరణను ఆమోదించింది. ఏడో సీపీసీ పే మ్యాట్రిక్స్‌, పే లెవల్స్‌ను బట్టి పదోన్నతి పొందేందుకు అవసరమైన కనీస సేవా కాలాన్ని  మూడేళ్లకు తగ్గించింది. ఈ సవరణతో నియామక నిబంధనలు, సర్వీస్‌ నిబంధనల్లో మార్పు రానుంది. ఇకపై నియామకాలు చేపట్టేటప్పుడు సవరించిన నిబంధనలు పాటించాలని అన్ని మినిస్ట్రీస్‌, డిపార్టుమెంట్లను డీఓపీటీ కోరింది.


View Pdf


 


అతి త్వరలో డీఏ పెంపు


ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం అతి త్వరలోనే డీఏ పెంచనుంది. ఏడో వేతన కమిషన్‌ ప్రకారం డియర్‌నెస్‌ అలవెన్స్‌ (DA), పింఛన్‌దారులకు డియర్‌నెస్‌ రిలీఫ్‌ (DR) ప్రకటించనుందని తెలిసింది. ఇప్పటికైతే అధికారికంగా చెప్పలేదు గానీ సెప్టెంబర్‌ చివరి వారంలో ప్రకటిస్తారని సమాచారం.


ప్రస్తుతం ఉద్యోగులకు 34 శాతం డీఏ అమలు చేస్తున్నారు. సెప్టెంబర్లో మరో 4 శాతం పెంచి మొత్తం 38 శాతానికి చేరుస్తారని అంచనాలు ఉన్నాయి. త్వరలోనే ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో కేబినెట్‌ కమిటీ సమావేశం కానుంది. అందులో చర్చించాక డీఏ రేటును ప్రకటిస్తారు.


DA ఎందుకిస్తారంటే?


కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలపై ద్రవ్యోల్బణం (Inflation) ప్రభావం పడకుండా ఉండేందుకు ప్రభుత్వం డీఏను చెల్లిస్తుంది. ఇది ఉద్యోగులు, పింఛన్‌దారులకు వర్తిస్తుంది. ఏడో వేతన కమిషన్‌ (7th Pay Commission) ప్రకారం డీఏను ఏటా రెండుసార్లు పెంచుతారు. జనవరి, జులైలో వీటిని అమలు చేస్తారు. ఉద్యోగి పనిచేస్తున్న ప్రాంతాన్ని బట్టీ డీఏ పెరుగుదలలో తేడాలు ఉంటాయి. రూరల్‌, సెమీ అర్బన్‌తో పోలిస్తే అర్బన్‌ ఉద్యోగులకు ఎక్కువ డీఏ వస్తుంది.


ఎంత జీతం పెరుగుతుంది?


ఇప్పుడు బేసిక్‌ సాలరీలో డీఏ 34 శాతంగా ఉంది. 4 శాతం పెంచితే 38 శాతానికి చేరుతుంది. ఒక వ్యక్తికి రూ.35,000 బేసిక్‌ సాలరీ అయితే రూ.11,900 డీఏ ఉంటుంది. సవరించే నాలుగు శాతం కలిపితే డీఏ రూ.13,300కు పెరుగుతుంది. అంటే నెలకు రూ.1400 వరకు అదనంగా వస్తుందని అంచనా. ఈ పెరిగిన డీఏతో ద్రవ్యోల్బణం ప్రభావం ఉద్యోగులపై తగ్గుతుందన్నమాట.