Banks Hikes Interest rates: దేశంలో వడ్డీ రేట్లు పెంచుతున్న బ్యాంకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఆర్థిక వ్యవస్థ గాడిన పడడంతో, బడా కంపెనీలు లోన్ల కోసం బ్యాంకుల గడప తొక్కుతున్నాయి. వాటికి లోన్లు ఇవ్వడానికి, ప్రజల దగ్గర నుంచి స్వీకరించే కాల పరిమితి డిపాజిట్లు లేదా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను (Fixed Deposits) బ్యాంకులు పెంచుకోవాలి. ఇందుకోసం, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మీద వడ్డీ రేట్లను ఇటీవలి కాలంలో అన్ని బ్యాంకులు పెంచాయి. డిపాజిట్ల మీద వడ్డీ రేట్లను పెంచడం బ్యాంకులకు అదనపు భారం కాబట్టి, ఆ భారాన్ని రుణాల మీదకు బదిలీ చేస్తున్నాయి. అంటే, తాము ఇచ్చే రుణాల మీద వడ్డీ రేట్లను పెంచి, తమ మీద భారాన్ని బ్యాంకులు తగ్గించుకుంటున్నాయి. అప్పులు తీసుకునే వాళ్ల మీదకు దానిని నెట్టేస్తున్నాయి.


ఈ నేపథ్యంలో... చాలా బ్యాంకులు ఉపాంత నిధుల వ్యయ ఆధారిత రుణాల (MCLR) మీద వడ్డీ రేట్లను పెంచాయి. కొత్తగా తీసుకునే రుణాలతో పాటు, గతంలో తీసుకుని క్రమపద్ధతిలో (Loan EMI) తిరిగి చెల్లిస్తున్న రుణాల మీద కూడా కొత్త రేటు ప్రకారం ఛార్జీలు పెరుగుతాయి. 


కొత్తగా నాలుగు బ్యాంకులు రుణాల మీద వడ్డీ రేట్లు పెంచాయి. అవి.. ‍‌బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (Bank of Baroda), సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (Central Bank of India), ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ (Indian Overseas Bank), బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (Bank of India).


బ్యాంక్ ఆఫ్ బరోడా, తన MCLRను 35 బేసిస్ పాయింట్లు లేదా 0.35% పెంచాలని నిర్ణయించింది. ఈ వడ్డీ రేట్ల పెంపుదల నేటి (జనవరి 11, 2023) నుంచి అమలులోకి వచ్చింది. ఏడాది కాల పరిమితితో ఇచ్చే రుణాల మీద ఎంసీఎల్‌ఆర్‌ను 8.30 శాతం నుంచి 8.50 శాతానికి పెంచింది. ఓవర్‌నైట్ (ఒక్కరోజు) ఎంసీఎల్‌ఆర్‌ను 7.5 శాతం నుంచి 7.85 శాతానికి తీసుకెళ్లింది. ఒక నెల రేటును 7.95 శాతం నుంచి 8.15 శాతానికి, 3 నెలల ఎంసీఎల్‌ఆర్‌ను 8.06 శాతం నుంచి 8.15 శాతానికి, 6 నెలల ఎంసీఎల్‌ఆర్‌ను 8.25 శాతం నుంచి 8.35 శాతానికి పెంచింది. అంటే, ఈ బ్యాంక్‌ ఈ రేట్ల కంటే తక్కువకు రుణాలు ఇవ్వదు.


సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, తన MCLRను 25 బేసిస్‌ పాయింట్లు లేదా 0.25% పెంచింది. మంగళవారం (జనవరి 10, 2023) నుంచి ఈ పెంపు అమల్లోకి వచ్చింది. కొత్త రేట్లు 7.50-8.15 శాతం పరిధిలో ఉంటాయి. 6 నెలల కాల పరిమితి రుణాల మీద వడ్డీ 8.05 శాతానికి, ఏడాది రుణాల మీద వడ్డీ 8.15 శాతానికి చేరింది.


ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌, తన టర్మ్‌ డిపాజిట్ల మీద 45 బేసిస్‌ పాయింట్లు లేదా 0.45% వడ్డీని పెంచింది. దేశీయ, NRO, NRE డిపాజిట్ల మీద 444 రోజులకు 7.75 శాతం వడ్డీ అందిస్తోంది. విదేశీ నగదు డిపాజిట్ల మీద వడ్డీని 1 శాతం మేర పెంచింది.


బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, రూ. 2 కోట్ల లోపు డిపాజిట్ల మీద 444 రోజుల కాలానికి వడ్డీ రేటును జనవరి 10, 2023 నుంచి పెంచింది. సాధారణ పౌరులకు 7.05 శాతం, సీనియర్‌ సిటిజన్లకు 7.55 శాతం వడ్డీని ఆఫర్‌ చేస్తోంది. 2-5 సంవత్సరాల డిపాజిట్ల మీద 7.25 శాతం వడ్డీని ప్రకటించింది.