Housing sales 2022: కొవిడ్ మహమ్మారి తర్వాత ఆర్థిక వ్యవస్థలో మళ్లీ పూర్వ స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభం కావడంతో, స్థిరాస్తి వ్యాపారం బాగా పుంజుకుంది. 2022లో, అటు వాణిజ్య పరంగా, ఇటు నివాస పరంగా రియల్‌ ఎస్టేట్‌ సేల్స్‌ బాగా పెరిగాయి.


దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో (ముంబయి, NCR దిల్లీ, బెంగళూరు, పుణె, హైదరాబాద్‌, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్‌) చేసిన సర్వే ఆధారంగా, నైట్ ఫ్రాంక్ ఇండియా (Knight Frank India) ఒక రిపోర్ట్‌ విడుదల చేసింది. 


ఈ రిపోర్ట్ ప్రకారం.. 2022లో, ఈ ఎనిమిది ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాలు 34% పెరిగి 3,12,666 యూనిట్లకు (ఫ్లాట్‌/ఇల్ల్లు) చేరుకున్నాయి. కార్యాలయ ప్రాంగణాల లీజులు 36% పెరిగి 51.6 మిలియన్ చదరపు అడుగులకు చేరుకున్నాయి.


గృహ విక్రయాల్లో వృద్ధి 


ఇటు ఇళ్ల ధరలు, అటు గృహ రుణాల మీద వడ్డీ రేట్లు రెండూ పెరిగినప్పటికీ, 2022లో గృహ విక్రయాలు వృద్ధిని నమోదు చేశాయని నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజాల్ వెల్లడించారు.


నైట్ ఫ్రాంక్ ఇండియా డేటా ప్రకారం.. 2022లో రెసిడెన్షియల్ సేల్స్‌లో 85,169 యూనిట్లతో ముంబై ముందంజలో ఉంది, మునుపటి సంవత్సరంతో పోలిస్తే ఇది 35% పెరిగింది. 


దిల్లీ-NCRర్‌లో అమ్మకాలు 67% వృద్ధితో 58,460 యూనిట్లకు చేరుకోగా, బెంగళూరులో 40% వృద్ధితో 53,363 యూనిట్లకు చేరుకున్నాయి.


పుణెలో గృహాల విక్రయాలు 17% పెరిగి 43,410 యూనిట్లకు చేరుకున్నాయి.


హైదరాబాద్‌లో రెసిడెన్షియల్ ప్రాపర్టీ సేల్స్‌ జోరు మీద ఉన్నాయి. 2022లో, హైదరాబాద్‌ పరిధిలో మొత్తం 43,847 కొత్త ఇళ్లను ప్రారంభించగా, అందులో 31,046 నివాసాలు అమ్ముడయ్యాయి. 2021తో పోలిస్తే, కొత్త గృహాల నిర్మాణంలో 23%, కొత్త ఇళ్ల అమ్మకాల్లో 28% వృద్ధి నమోదైంది. ఇళ్ల విక్రయాల్లో చదరపు అడుగు సగటు ధర రూ. 4,984 కు చేరింది. 2021తో పోలిస్తే 5.6% పెరిగింది. తెల్లాపూర్‌, కొల్లూరు, గండిపేట, నార్సింగిలో ఇళ్ల కొనుగోళ్ల కోసం డిమాండ్‌ పెరిగింది, అక్కడే ఎక్కువ కొత్త ప్రాజెక్టులు స్టార్ట్‌ అయ్యాయి.


చెన్నైలో 19% వృద్ధితో 14,248 యూనిట్లకు చేరుకోగా, అహ్మదాబాద్‌లో 58% వృద్ధితో 14,062 యూనిట్లకు చేరుకుంది.


కోల్‌కతాలో మాత్రం 10% క్షీణతతో 12,909 యూనిట్లకు పడిపోయింది.


నివాస గృహాల విభాగంలోనే కాదు, కార్యాలయాల విభాగంలోనూ 2022లో బలమైన డిమాండ్‌, అమ్మకాల్లో వృద్ధి కనిపించిందన నైట్ ఫ్రాంక్ ఇండియా పేర్కొంది.


బలమైన ఆఫీస్ స్పేస్ డిమాండ్


2022లో, 14.5 మిలియన్ చదరపు అడుగుల లీజింగ్‌తో బెంగళూరు అగ్రస్థానంలో ఉండగా, 8.9 మిలియన్ చదరపు అడుగులను NCR లీజుకు తీసుకుంది.


2022లో, హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్‌ మార్కెట్‌లో కమర్షియల్‌ స్పేస్‌ లీజింగ్‌ 12% పెరిగిందని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా నివేదికలో వెల్లడైంది. మొత్తం 67 లక్షల చదరపు అడుగుల నిర్మాణ స్థలాన్ని వ్యాపార సంస్థలు, కార్యాలయాలు లీజుకు తీసుకున్నాయి. ఈ విభాగంలో, 8 ప్రధాన నగరాల్లో హైదరాబాద్‌ మూడో స్థానంలో నిలిచింది. హైదరాబాద్‌లోని కమర్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌లో ప్రధాన పాత్ర ఐటీ కంపెనీలది. ఆఫీస్‌ స్పేస్‌ కోసం ఐటీ కంపెనీల నుంచి ఎక్కువ డిమాండ్‌ కనిపిస్తోంది. హైటెక్‌ సిటీ, కొండాపూర్‌, మణికొండ, కూకట్‌పల్లి, రాయదుర్గం ప్రాంతాల్లో ఆఫీస్‌ స్పేస్‌కు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. హైదరాబాద్‌లో చదరపు అడుగుకు సగటు అద్దె రూ. 65గా ఉంది, 2021తో పోలిస్తే 6% పెరిగింది.


హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారానికి ఐటీ రంగమే మూల స్తంభమని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా హైదరాబాద్‌ బ్రాంచ్‌ డైరెక్టర్‌ శామ్సన్‌ ఆర్థర్‌ చెప్పారు.


గత దశాబ్ద కాలంలో తొలిసారిగా అన్ని ప్రధాన రియల్ ఎస్టేట్ విభాగాల్లో ఏకకాలంలో వృద్ధి కనిపించిందని బైజల్ వెల్లడించారు. ఆఫీస్, రెసిడెన్షియల్, వేర్‌హౌసింగ్, రిటైల్ అన్నీ 2022లో గణనీయమైన పెరుగుదలను నమోదు చేశాయని ఆయన తెలిపారు. దేశీయ ఆర్థిక వృద్ధి కొనసాగడం వల్ల కొత్త సంవత్సరంలో స్థిరాస్తి వ్యాపార వృద్ధి వేగం ఎక్కువగా ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.