Pre Approved Loans : ఓ ఐదారేళ్ల కిందట బ్యాంకు వద్ద అప్పు తీసుకోవాలంటే ఎగ్జిక్యూటివ్‌ను పట్టుకుని డాక్యుమెంట్లు అన్నీ సమర్పించి ఎదురు చూస్తూ ఉండాలి. చివరికి రుణం మంజూరు కాలేదనే సమాచారం ఎక్కువ మందికి వస్తుంది. కానీ ఇప్పుడు బ్యాంకులే మీరు రుణానికి అర్హత సాధించారు.. ఏమీ చేయాల్సిన పని లేదు.. తాము పంపే లింక్‌లో వివరాలు నమోదు చేస్తే చాలు గంటలో డబ్బులు ట్రాన్స్ ఫర్ చేస్తామని ఆఫర్స్ ఇస్తున్నాయి. ఫ్రాడ్ లోన్ యాప్స్‌ను అసలు లెక్కలోకి తీసేస్తే ...బ్యాంకులు కూడా ఇలాంటి ప్రి అప్రూవుడ్ లోన్ ఆఫర్స్ ఇస్తున్నాయి. రుణం అవసరమైన వారు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇలాంటి ప్రిఅప్రూవుడ్ లోన్ ఆఫర్స్ అంగీకరించే ముందు కొన్ని అంశాలు తెలుసుకోవాలి.
మెయిల్ వచ్చిందంటే దానర్థం లోన్ ఇచ్చేస్తారని కాదు !
ప్రీ అప్రూవుడ్ లోన్‌ను కేవలం అప్పు ఇవ్వడానికి ఇచ్చే దరఖాస్తుకు ఆహ్వానం మాత్రమే. ప్రీ అప్రూవుడ్ లోన్లు ఇచ్చే ముందు బ్యాంకులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాయి. వాటిలో క్రెడిట్ ఎవాల్యువేషన్ ముఖ్యమైనది. బ్యాంకులు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటాయి కాబట్టి, ప్రీ అప్రూవుడ్ లోన్స్ తొందరగా ఆమోదిస్తారు. ప్రీ అప్రూవుడ్ లోన్‌కు అప్లై చేయాలన్నా, బ్యాంకులు అప్రూవ్ చేయాలన్నా కస్టమర్ కొన్ని వివరాలపై అవగాహన పెంచుకోవాలి. లోన్ ప్రాసెసింగ్ సిస్టం మొత్తం సులభంగా ఫోన్ ద్వారానే బ్యాంకులు పూర్తి చేస్తాయి. కస్టమర్ల క్రెడిట్ ప్రొఫైల్స్ బ్యాంకుల ఎలిజిబిలిటీ క్రైటీరియాకు సరిపోయిన తరువాతే రుణాలు మంజూరు చేస్తాయి.
క్రెడిట్ స్కోరును మెరుగ్గా ఉంచుకుంటే చాలు !
వినియోగదారుల క్రెడిట్ స్కోరు, నెలవారీ ఆదాయం, జాబ్ ప్రొఫైల్, ఉద్యోగం చేస్తున్నసంస్థ ప్రొఫైల్, గత లావాదేవీల ఆధారంగా లోన్ ఎలిజిబిటిటీ ను నిర్ధారిస్తారు. సంబంధిత బ్యాంకులో డిపాజిట్లు చేసే వినియోగదారుడికి మంచి క్రెడిట్ స్కోరు, రీపేమెంట్ హిస్టరీ, తగినంత అకౌంట్ బ్యాలెన్స్ ఉంటేనే బ్యాంకులు ప్రీ అప్రూవుడ్ లోన్‌ను ఇస్తాయి. రెడిట్ కార్డు వాడేవారి క్రెడిట్ స్కోర్లు, బిల్ రీపేమెంట్ హిస్టరీ బాగుంటే, సంబంధిత బ్యాంకులు క్రెడిట్ కార్డు వినియోగదారులకు ప్రీ-అప్రూవ్డ్ లోన్స్ ఎక్కువగా మంజూరు చేస్తాయి.
ప్రీ అప్రూవుడ్ లోన్ తీసుకుంటే లాభమే !
ప్రీ అప్రూవుడ్ లోన్ ప్రక్రియ సులభంగా పూర్తవుతుంది. తక్కువ వ్యవధిలోనే వినియోగదారుల బ్యాంకు ఖాతాకు లోన్ మొత్తాన్ని జమ చేస్తారు. లోన్ అప్రూవల్ కోసం భారీ డాక్యుమెంటేషన్, ఇతర పత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. కొ ఈ రుణాలు పొందటానికి రుణగ్రహీతలు ఎటువంటి షూరిటీలను, సెక్యూరిటీలను బ్యాంకులకు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ పద్ధతిలో లోన్ తీసుకున్నవారు ఈఎంఐల రూపంలో రీపేమెంట్ చేయొచ్చు.
అవసరం అయితేనే లోన్ తీసుకోవడం ఉత్తమం !
మన క్రెడిట్ స్కోరు..రీ పేమెంట్ హిస్టరీ చూసి ప్రి అప్రూవుడ్ లోన్ ఆఫర్స్ వస్తాయి. కానీ అప్పు ఇస్తున్నారు కదా అని తీసుకోవడం ఆర్థిక క్రమశిక్షణ ఉల్లంఘించినట్లే అవతుంది. మనకు అవసరమా లేదా అన్నడిసైడ్ చేసుకున్న తర్వాతనే ముందుకెళ్లాలి. అవసరం లేకుండా చేసే అప్పు గుదిబండే అవుతుంది.