Pension Plan: ప్రతి ఒక్కరి జీవితంలో రిటైర్మెంట్‌ ప్లానింగ్‌ చాలా ముఖ్యం. కష్టపడే వయస్సును దాటిన తర్వాత, అప్పటి వరకు కూడబెట్టుకున్న డబ్బు జీవనానికి ఉపయోగపడుతుంది. ఆదాయం (ఉద్యోగం, వ్యాపారం) ఉన్నప్పుడే రిటైర్మెంట్‌ జీవితం గురించి కచ్చితమైన ప్రణాళిక చేయాలి. బంగారం, స్థిరాస్తి, షేర్‌ మార్కెట్‌, ప్రభుత్వ పథకాలు.. ఇలా చాలా రూపాల్లో డబ్బును దాచుకోవచ్చు, పెంచుకోవచ్చు. ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ స్కీమ్స్‌లో దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టడం కూడా ఒక మంచి ప్లాన్‌. దీనివల్ల, ఉద్యోగం లేదా వ్యాపారం నుంచి రిటైర్‌ అయిన తర్వాత కూడా డబ్బులు వస్తూనే ఉంటాయి. ప్రస్తుతం ఉన్న బెస్ట్‌ ప్లాన్స్‌లో ఒకటి... నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS). 


చిన్న అమౌంట్‌తోనే NPSలో ఇన్వెస్ట్‌మెంట్‌ స్టార్ట్‌ చేయవచ్చు. చందాదారుకు 60 సంవత్సరాలు రాగానే, అప్పటి వరకు పెట్టిన మొత్తం పెట్టుబడి రూ.5 లక్షలు లేదా ఆ లోపు ఉంటే, ఆ మొత్తం డబ్బును వెనక్కు తీసుకోవచ్చు. ఒకవేళ రూ.5 లక్షలు దాటితే, ఆ మొత్తం కార్పస్‌లో 60 శాతం డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని యాన్యుటీ ప్లాన్‌ కొనుగోలు చేయాలి. యాన్యుటీ ప్లాన్‌ నుంచి ప్రతి నెలా పెన్షన్ రూపంలో డబ్బు తీసుకోవచ్చు. దీంతోపాటు NPS పెట్టుబడులకు ఆదాయ పన్ను ‍‌(Income tax saving option) చెల్లించాల్సిన అవసరం లేదు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద, సెక్షన్‌ 80CCD కింద కలిపి రూ.2 లక్షల వరకు టాక్స్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చు. 


ఈ స్కీమ్‌ కింద, తక్కువ డబ్బును ఇన్వెస్ట్‌ చేసి ఎక్కువ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. రోజుకు కేవలం రూ. 100 ఆదా చేసి నెలకు రూ. 57,000 పెన్షన్ కూడా తీసుకోవచ్చు. 


నెలకు ₹1500 కూడబెడితే ₹57 లక్షలు
మీరు, మీ 25 సంవత్సరాల వయస్సులో, NPSలో నెలకు రూ.1500 (రోజుకు 50 రూపాయలు) పెట్టుబడి పెడితే, 60 ఏళ్ల వయస్సులో మొత్తం కార్పస్ రూ.57,42,416 అవుతుంది. వార్షిక వడ్డీ 10 శాతం అనుకుంటే, ఈ సంపద క్రియేట్‌ అవుతుంది. ఈ పథకంలో 100 శాతం కార్పస్‌తోనూ యాన్యుటీ ప్లాన్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. 


మీ అకౌంట్‌లో పోగయిన మొత్తం డబ్బుతో 100% యాన్యుటీ ప్లాన్‌ కొంటే, నెలకు రూ.28,712 పెన్షన్ తీసుకోవచ్చు. 40% మొత్తంతో యాన్యుటీ కొనుగోలు చేస్తే, నెలవారీ పెన్షన్ రూ.11,485 అవుతుంది. ఇంకా మీ అకౌంట్‌లో రూ.34 లక్షలు ఉంటాయి, వాటిని విత్‌డ్రా చేసుకోవచ్చు.


రోజుకు ₹100తో నెలకు ₹57,000 పెన్షన్‌
మీరు 25 సంవత్సరాల వయస్సు నుంచి ప్రతి నెలా 3 వేల రూపాయలు ‍(రోజుకు 100 రూపాయలు) పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, NPS కాలిక్యులేటర్ ప్రకారం, 60 తర్వాత రూ. 1,14,84,831 జమ అవుతుంది. ఈ మొత్తంతో 100% యాన్యుటీ కొనుగోలు చేస్తే, మొత్తం నెలవారీ పెన్షన్ రూ. 57,412 వస్తుంది. 40% మొత్తంతో యాన్యుటీ కొనుగోలు చేస్తే నెలకు రూ. 22,970 పెన్షన్‌ వస్తుంది. దీంతోపాటు పదవీ విరమణ తర్వాత ఏకమొత్తంగా రూ.68 లక్షలు విత్‌డ్రా చేసుకోవచ్చు.


మరో ఆసక్తికర కథనం: ఒక్కో సెకను రూ.3 లక్షలు, వరల్డ్‌ కప్‌ క్రికెట్‌లో ప్రకటనల ఖర్చు ఇది


Join Us on Telegram: https://t.me/abpdesamofficial