Post Office Aditya Birla Insurance:తెలుగు రాష్ట్రాల్లో ఉచిత బస్ ప్రయాణ పథకం అమల్లో ఉంటోంది. రోజూ ఉద్యోగాలకు వెళ్లే మహిళలకు ఐదు వందల రూపాయల నుంచి రెండు మూడు వేల రూపాయలు మిగులుతున్నాయి. ఇది వారి ఖర్చులు తగ్గించి ఆదాయం పెరిగే చేస్తోంది. ఓ చిన్న ప్రయత్నం చేస్తే మాత్రం రవాణా ఖర్చు డబ్బులతో మంచి బీమా పొందవచ్చు. మీ కుటుంబానికి భరోసాగా నిలబడే అవకాశం దక్కుతుంది.
భారత్ పోస్టల్ శాఖ ఆదిత్య బిర్లా క్యాపిటల్స్ సహకారంతో సరికొత్త బీమా సౌకర్యం తీసుకొచ్చింది. రోజుకు కేవలం రెండు రూపాయలు ఖర్చు చేస్తే 15 లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని కల్పిస్తోంది. యజమానికి ప్రమాదం జరిగితే అలాంటి టైంలో ఆ వ్యక్తిపై ఆధార పడిన ఫ్యామిలీకి అండగా ఉంటోంది. విద్య, వైద్యం అన్నింటిలో కూడా చేదోడుగా ఉంటుంది.
మరుక్షణం ఏం జరుగుతుందో ఎవరూ ఊహించ లేరు. కానీ ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సమాయత్తమై ఉండాలి. ఎంత సిద్ధంగా ఉన్నప్పటికీ కొన్నిసార్లు ఆర్థికంగా తట్టుకోలేని ఖర్చు మీద పడుతుంటాయి. ముఖ్యంగా ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు అందులోకి వస్తాయి. వీటిని మనం చాలా వరకు కంట్రోల్ చేయలేం. అందుకే అలాంటివి వచ్చినా తట్టుకునేలా సంసిద్ధంగా ఉండాలి. దీనికి ఉత్తమమైన మార్గం ఇన్సూరెన్స్ చేసుకోవడం.
ఊహించని ఖర్చులు, ప్రమాదాలు, అనారోగ్యాలతో ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఆదిత్య బిర్లా క్యాపిటల్, భారత్ పోస్టల్ శాఖ కలిపి ప్రజలకు ప్రయోజనం కలిగే బీమా పథకం ఉంది. రోజుకు రూపాయిన్నర ఖర్చు పెడితే మీకు పది లక్షల వరకు రోజుకు రెండు రూపాయలు కడితే 15 లక్షల రూపాయల కవర్ అయ్యే బీమా సౌకర్యం కల్పిస్తోంది. తక్కువ ఖర్చుతో ఈ ఇన్సూరెన్స్ తీసుకుంటే కుటుంబానికి ధీమా కల్పించవచ్చు.
ఈ బీమాను 18 ఏళ్లు నిండిన వ్యక్తులు ఎవరైనా తీసుకోవచ్చు. 65 లోపు వాళ్లంతా ఈ బీమాను పొందవచ్చు. వయసు పెరుగుతున్న కొద్దీ వాళ్లకు ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి చేశారు. అందుకే మెడికల్ ఇన్సూరెన్స్‌ను మాత్రం యుక్తవయసులో తీసుకోవడం ఉత్తమం. ఇప్పుడు ఉచిత ప్రయాణ సౌకర్యం ద్వారా మిగిలిన డబ్బులను ఇటు ఖర్చు పెట్టుకుంటే మీ కుటుంబానికి ధైర్యంగా ఉంటుంది. ఆపదలో ఆదుకుంటుంది.
ప్రీమియం ఎంత?
రూ. 549 వార్షిక ప్రీమియం:రూ. 10 లక్షల ప్రమాద బీమా రూ. 749 వార్షిక ప్రీమియం:రూ. 15 లక్షల ప్రమాద బీమా
ఈ పాలసీ ప్రయోజనాలు ఏంటీ?
ఈ బీమా తీసుకున్న వ్యక్తులు ప్రమాదవశాత్తు మరణిస్తే పూర్తి బీమా మొత్తం లభిస్తుంది. శాశ్వత వైకల్యం లేదా పక్షవాతం వస్తే పూర్తి బీమా ఇస్తారు. ఆసుపత్రిలో చేరడానికి 60వేల వరకు వైద్య ఖర్చులు లభిస్తాయి. ఓపీడీ సలహా కోసం 30వేలు వరకు ఇస్తారు. 10 సార్లు ఫ్రీ కన్సెల్టేషన్ ఉంటుంది. ఇద్దర పిల్లలకు లక్ష వరకు ఎడ్యుకేషన్ ఫీజులు చెల్లిస్తారు. ప్రమాదంలో కారణంగా ఇంటికి ఆదాయం కల్పించే వ్యక్తి కోమాలోకి వెళ్తే లక్ష రూపాయలు సాయం చేస్తారు. ప్రమాదంలో ఏదైనా కాళ్లు చేతులు విరిగితే లక్ష వరకు సాయం చేస్తారు. సైకో ట్రోమాను బయటపడేందుకు ఉచిత కౌన్సిలింగ్ చేస్తారు. వేరే ప్రాంతాల్లో మరణిస్తే ప్రయాణ ఖర్చుల కోసం పాతికవేలు ఇస్తారు. వీటితోపాటు ఐదు వేల అంత్యక్రియల ఖర్చులు ఇస్తారు.