Paytm Shares:
సర్‌ప్రైజ్..! సర్‌ప్రైజ్..! పేటీఎం ఇన్వెస్టర్లకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చింది! వరుసగా రెండు రోజుల నుంచీ ఆ కంపెనీ షేర్లు అప్పర్ సర్క్యూట్‌లో ట్రేడవుతున్నాయి. మంగళవారమైతే ఏకంగా 20 శాతం పెరిగింది. ఇంట్రాడే గరిష్ఠం రూ.669ని టచ్ చేసింది. ప్రాఫిట్ బుకింగ్ వల్ల ప్రస్తుతం 10 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి!
పేటీఎం షేరు మంగళవారం ఉదయం రూ.558 వద్ద మొదలైంది. గంటలోపే 20 శాతం పెరిగి ఇంట్రాడే గరిష్ఠమైన రూ.669ని అందుకుంది. ఆ తర్వాత ట్రేడర్లు లాభాలను స్వీకరించడంతో గరిష్ఠ స్థాయి నుంచి పది శాతం తగ్గింది. రూ.556 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. మధ్యాహ్నం 1:30 గంటలకు రూ.49 లాభంతో రూ.608 వద్ద కొనసాగుతోంది. తొలిసారి ఈ కంపెనీ మెరుగైన ఫలితాలు విడుదల చేయడమే ఈ ర్యాలీకి కారణం.
పేటీఎం తొలిసారి నిర్వాహక లాభాల మార్గదర్శకాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలోని మూడో త్రైమాసికంలో నష్టాలను తగ్గించుకుంది. 2022, డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.392 కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలోని రూ.779 కోట్ల నికర నష్టంతో పోలిస్తే ఇప్పుడు మెరుగ్గానే రాణించింది.
ఏడాది క్రితంతో పోలిస్తే కంపెనీ నిర్వాహక లాభం రూ.424 కోట్లకు మెరుగైంది. గతేడాది -27 శాతంతో పోలిస్తే ఆదాయం మార్జిన్ 2 శాతానికి పెరిగింది. పేటీఎం మాతృసంస్థ నిర్వాహక ఆదాయం 42 శాతం పెరిగి రూ.2,062 కోట్లకు చేరుకుంది. వ్యాపార భాగస్వాములు పెరగడం, ఆదాయంలో పెరుగుదల, రుణాల మంజూరులో వృద్ధి, కామర్స్ బిజినెస్‌లో మూమెంట్‌మ్ ఇందుకు దోహదం చేశాయి.
ఏడాది క్రితం మర్చంట్ సబ్‌స్క్రిప్షన్లు 3.8 మిలియన్లు ఉండగా ఇప్పుడా సంఖ్య 5.8 మిలియన్‌కు పెరిగింది. చందాలు చెల్లిస్తున్న వ్యాపారస్థులు పది లక్షలు పెరిగారు. 'అత్యంత ఏకాగ్రతతో పనిచేయడం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి. క్షేత్రస్థాయిలో రాబడి పెరుగుదలపై మా బృందం దృష్టి సారించింది. అభివృద్ధి అవకాశాలకు ఇబ్బందులు లేకుండానే ఈ ఫలితాలు రాబట్టాం. అన్ని నిబంధనలను పాటిస్తూనే పనిచేశాం' అని కంపెనీ సీఈవో విజయ్ శేఖర్ శర్మ ఇన్వెస్టర్లకు లేఖ రాశారు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.