Patanjali Promoted Ruchi Soya FPO Lists At 31 Per Cent Premium At Rs 850: పతంజలి ఆయుర్వేద (Patanjali Ayurveda) ప్రమోట్‌ చేస్తున్న రుచిసోయా ఇండస్ట్రీస్‌ (Ruchi Soya Industries) శుక్రవారం స్టాక్‌ మార్కెట్లో నమోదైంది. ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (FPO) ధర రూ.650తో పోలిస్తే 31 శాతం ప్రీమియంతో రూ.850 వద్ద బీఎస్‌ఈలో (BSE) లిస్టైంది. నిన్నటి ముగింపు ధర రూ.818తో పోలిస్తే 4 శాతం అధికంగా షేర్లు ట్రేడ్‌ అవుతున్నాయి. రూ.4300 కోట్ల విలువైన ఎఫ్‌పీవోతో రుచిసోయా 6.61 కోట్ల కొత్త షేర్లను ఇష్యూ చేసిన సంగతి తెలిసిందే.


రుచి సోయా ఇండస్ట్రీస్‌ ఎఫ్‌పీవోకు మొదట్లో హై నెట్‌వర్త్‌ ఇండివిజ్యువల్స్‌ ఎక్కువగా దరఖాస్తు చేసుకున్నారు. అయితే షేర్లను విత్‌డ్రా చేసుకొనేందుకు అనుమతి ఇవ్వాలని బ్యాంకులకు సెబీ ఆదేశాలు ఇవ్వడంతో మార్చి 28 వరకు నుంచి ఈ ఆప్షన్‌ అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా షేర్ల అమ్మకాలపై కొన్ని అనుచిత సందేశాలు రావడంపైనా వార్నింగ్‌ ఇచ్చింది. సెబీ ప్రకారం ఎఫ్‌పీవో మార్చి 28న ముగియగా 30 వరకు విత్‌డ్రావల్‌కు అనుమతి ఇచ్చారు.


రూ.4,300 కోట్ల ఎఫ్‌పీవో కింద 6,61,53,846 ఈక్విటీ షేర్ల కేటాయింపును అనుమతించామని స్టాక్‌ మార్కెట్లకు (Stock Markets) మంగళవారం రోజు పతంజలి గ్రూప్‌ తెలిపింది. ఈ ఆఫర్‌ వల్ల రుచిసోయా పెయిడ్‌ అప్‌ క్యాపిటల్‌ రూ.59,16,82,014 నుంచి Rs 72,39,89,706కు పెరిగింది. విత్‌డ్రా ఆప్షన్‌ ఇవ్వడంతో దాదాపుగా 97 లక్షల బిడ్లు వెనక్కి వెళ్లిపోయాయని తెలిసింది.


ప్రపంచంలోనే అతిపెద్ద ఫుడ్‌ కంపెనీగా పతంజలిని తీర్చిదిద్దాలని తాము కోరుకుంటున్నట్టు బాబా రామ్‌దేవ్‌ (Baba Ramdev) ఈ మధ్యే ఏబీపీ న్యూస్‌కు చెప్పారు. 'భారత్‌లో అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన హిందుస్థాన్‌ యునీలివర్‌ను (HUL) అధిగమించాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇతరులతో పోటీ పడాలని మేం అనుకోవడం లేదు. మాతో మేమే పోటీ పడాలని అనుకుంటున్నాం. స్వయం పోటీ, స్వయం స్ఫూర్తి, స్వయం ప్రేరణే విజయానికి తాళంచెవి' అని ఆయన అన్నారు.