PAN Card Number: చాలా మందికి మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది, తనకు ఉన్న బ్యాంకు ఖాతాల నంబర్లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడీలు, వాటి పాస్‌వర్డ్‌లు చాలా చక్కగా గుర్తు పెట్టుకుంటారు. 12 అంకెల ఆధార్ కార్డ్ కూడా ఎప్పుడూ బుర్రలో గిర్రున తిరుగుతూ ఉంటుంది. అంతే కాదు... తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల మొబైల్ ఫోన్ నంబర్లు కూడా వాళ్ల నాలుక మీదే ఉంటాయి, ఫోన్ బుక్‌తో సంబంధం లేకుండా వాళ్ల నంబర్లు డయల్ చేయగలరు. ఇంత మెమరీ పవర్ ఉన్న కొంతమందికి, వాళ్ల పాన్ కార్డ్ (PAN Card) నంబర్‌ను గుర్తు పెట్టుకోవడంలో మాత్రం ప్రయాస పడుతుంటారు, తడబడుతుంటారు.
ఆంగ్ల అక్షరాలు, అంకెలతో కలిపి పాన్‌కార్డ్‌లో 10 డిజిట్స్ మాత్రమే ఉన్నా, దానిని గుర్తు పెట్టుకోవడం వాళ్లకు ఒక రాకెట్ సైన్స్‌లా అనిపిస్తుంటుంది. కొంతమందికి గుర్తు ఉన్నా, టెన్షన్ పడితే మాత్రం మర్చిపోతారు. మరికొందరు అక్షరాలు, అంకెల్ని అటు ఇటు రాస్తుంటారు. ఇంకో పెద్ద సమస్య ఏంటంటే... పాన్ నంబర్‌లో ఉండేది 'సున్నా'నా (0), ఆంగ్ల అక్షరం 'ఓ'నా (O) అన్నది ఎప్పుడూ కన్‌ఫ్యూజనే.
ఇప్పుడు, మీ పాన్ నంబర్ గుర్తు పెట్టుకోవడానికి మీకు పెద్ద మెమరీ పవర్ అక్కర్లేదు. పాన్ నంబర్ వెనుక ఉన్న కథను అర్ధం చేసుకుంటే చాలు. ఇక మీ పాన్ నంబర్‌ను మీరు ఎప్పటికీ మరిచిపోరు.
పాన్ నంబర్ ఒక సీరియల్ నంబర్ కాదు
పాన్ కార్డు మీద అంకెలు, అక్షరాలతో కలిపి ఉండే 10 డిజిట్స్ నంబర్, మొబైల్ నంబర్ లేదా వెహికల్ నంబర్‌లా ఒక సీరియల్ నంబర్ కానే కాదు. ఆ నంబర్ మీకు మాత్రమే కేటాయించే ప్రత్యకమైన, నిర్దిష్టమైన విషయం. పన్ను చెల్లింపులకు సంబంధించి, మీ వ్యక్తిగత సమాచారాన్ని తెలిపేలా పాన్ కార్డ్ నంబర్‌ను మీకు కేటాయిస్తారు.
UTI లేదా NSDL ద్వారా, ఒక క్రమపద్ధతిలో పాన్ నంబర్‌ను ఆదాయ పన్ను శాఖ కేటాయిస్తుంది. ఆ క్రమపద్ధతి ఏంటి అన్నది మీరు అర్ధం చేసుకోగలిగితే, పాన్ కార్డ్ నంబర్ మీ మెదడులో ముద్రించుకుపోతుంది.
మీ పాన్ కార్డ్ నంబర్లను మీరు పరిశీలనగా చూశారా?, మొదటి ఐదు ఆంగ్ల అక్షరాలు ఉంటాయి. ఆ తర్వాత నాలుగు అంకెలు ఉంటాయి. చివర్లో మళ్లీ ఓ ఆంగ్ల అక్షరం ఉంటుంది. ఈ అక్షరాలు, అంకెల స్థానాలు మారవు. కాబట్టి, ఆంగ్ల అక్షరాల స్థానంలో వచ్చేది 'ఓ' (O), అంకెల స్థానంలో వచ్చేది 'సున్నా' (0) అని ఇక నుంచి సులభంగా అర్ధం చేసుకోవచ్చు. సో.. 'సున్నా', 'ఓ' విషయంలో క్లారిటీ వచ్చేసినట్లేగా. ఇక, మొత్తం నంబర్‌ను ఎలా గుర్తు పెట్టుకోవాలో చూద్దాం.
4, 5 అక్షరాలకు ప్రత్యేకత
మీ పాన్ నంబర్‌లో మొదటి మూడు అక్షరాలు AAA నుంచి ZZZ వరకు ఒక సిరీస్‌లో ఉంటాయి. అంటే, ఈ మీ పాన్ నంబర్‌లోని మొదటి మూడు ఆంగ్ల అక్షరాలు సీరియల్ ప్రకారం మీకు కేటాయించడం జరుగుతుంది. నాలుగో అక్షరానికి మాత్రం చాలా ప్రత్యేకత ఉంటుంది. ఆదాయ పన్ను చెల్లింపు దృష్ట్యా, మీ హోదా ఏంటి అన్నది ఆ అక్షరం తెలియజేస్తుంది. మీరు వ్యక్తిగత (Individual) ఆదాయ పన్ను చెల్లింపుదారు అయితే, నాలుగో అక్షరం తప్పనిసరిగా ‘P’ ఉంటుంది.
ఐదో అక్షరానికి కూడా ప్రత్యేకత ఉంది. ఈ ఐదో అక్షరం మీ ఇంటి పేరులోని మొదటి అక్షరాన్ని సూచిస్తుంది. ఒకవేళ, ఒక పాన్ కార్డ్ ఒక వ్యక్తి కోసం కాకుండా ఏదైనా సంస్థ తరపున తీసుకుంటే, పాన్ కార్డు హోల్డర్ పేరులోని మొదటి అక్షరం పాన్ కార్డ్ నంబర్‌లోని ఐదో స్థానంలో ఉంటుంది. ఇక్కడితో తొలి ఐదు అంకెల మీద క్లారిటీ వచ్చేసినట్లేగా. ఇక, ఆ తర్వాత నాలుగు అంకెలు 0001 నుంచి 9999 మధ్య సిరీస్‌లో ఉంటాయి, సీరియల్ నంబర్ రూపంలో మీకు వస్తాయి. పాన్ నంబర్‌లో చివరిదైన 10వ డిజిట్ ఎప్పుడూ ఆంగ్ల అక్షరమే ఉంటుంది. కాబట్టి, ఈ 10వ అంకె స్థానంలో ఎప్పటికీ సున్నా (అంకె) ఉండదు. సున్నా రూపంలో ఉంటే, అది ఆంగ్ల అక్షరం 'ఓ' (O) అని గుర్తు పెట్టుకోవాలి. ఈ చిట్కాలను గుర్తుంచుకుంటే ఇక మీరు ఎప్పటికీ మీ మీ పాన్ నంబర్‌ను మరిచిపోరు.