Office Space Leasing: కరోనా పరిస్థితుల తర్వాత దేశంలో స్థిరాస్తి వ్యాపారం విపరీతంగా పెరిగింది. ఆర్థిక కార్యకలాపాలు తిరిగి పూర్వస్థితికి చేరుకోవడం, ప్రజల ఆదాయాలు పెరగడం, కరోనా కాలంలో దాచుకున్న డబ్బులు చేతిలో ఉండడం వంటి కారణాలతో అటు నివాస విభాగంలో, ఇటు వాణిజ్య విభాగంలో ఆస్తుల విక్రయాలు, లీజుల సంఖ్య & విలువ పెరిగింది.
కమర్షియల్ సెగ్మెంట్ విషయానికి వస్తే... వినియోగ వ్యయాలు పెరగడం, 'ఇంటి నుంచి పని' (వర్క్ ఫ్రమ్ హోమ్), హైబ్రిడ్ పని విధానం ముగిసి పూర్తిగా'ఆఫీసుల నుంచి పని' విధానం తిరిగి ప్రారంభం కావడంతో అటు వ్యాపార సంస్థలు, ఇటు ఆఫీసులు కమర్షియల్ స్పేస్ కోసం క్యూ కడుతున్నాయి.
ఏడు నగరాల్లో డిమాండ్ రెట్టింపు
స్థిరాస్తి కన్సల్టెంట్ సంస్థ జేఎల్‌ఎల్ ఇండియా (JLL India) నివేదిక ప్రకారం.. గత నెలలో (2023 జనవరి) దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో కార్యాలయాల కోసం డిమాండ్ దాదాపు రెట్టింపైంది. 2023 జనవరిలో, వివిధ కంపెనీలు మొత్తం 3.2 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకున్నాయి. సరిగ్గా సంవత్సరం క్రితం (2022 జనవరిలో) లీజుకు తీసుకున్న స్పేస్ 1.7 మిలియన్ చదరపు అడుగులు. దీంతో పోలిస్తే, ఈ ఏడాది జనవరిలో ఆఫీస్ స్పేస్ లీజ్‌లు దాదాపు రెట్టింపు అయ్యాయి, లేదా 93 శాతం పెరిగాయి. అయితే, అంతకుముందు నెలలోని (2022 డిసెంబర్) 7.4 మి.చ.అ. స్పేస్‌తో పోలిస్తే మాత్రం, 2023 జనవరి నెలలో 56 శాతం తగ్గుదల కనిపించింది.
దేశంలోని టాప్-7 నగరాలు దిల్లీ- NCR, ముంబయి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పుణె, కోల్‌కతా, లోని అన్ని రకాల భవనాలు, అన్ని రకాల కట్టడాల్లో జరిగిన ఆఫీస్ స్పేస్ లీజ్ ఒప్పందాల ఆధారంగా ఈ నివేదిక రూపొందించినట్లు JLL ఇండియా వెల్లడించింది. ముందుగా కుదిరిన ఒప్పందాలు, ఒప్పందాల పునరుద్ధరణలను (term extensions) తన రిపోర్ట్‌లోకి JLL ఇండియా తీసుకుంది. చర్చల దశలో ఉన్న ఒప్పంద లావాదేవీలను మినహాయించింది.
టాప్-3 నగరాలదే సింహభాగం
2023 జనవరిలో జరిగిన కార్యాలయాల లీజుల్లో... దిల్లీ- NCR, చెన్నై, ముంబయి తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. మొత్తం లీజ్ లావాదేవీల్లో వీటితో 77 శాతం వాటా.
JLL ఇండియా డేటా ప్రకారం... జనవరిలో జరిగిన లీజుల్ని IT/ITeS విభాగం లీడ్ చేసింది, దీనిదే అతి పెద్ద వాటా. మొత్తం మార్కెట్ కార్యకలాపాల్లో 28 శాతం వాటాను ఈ విభాగం కలిగి ఉంది.
ప్రస్తుతం ఐటీ కార్పొరేట్ ఆదాయాల వృద్ధి అంచనాలు నెమ్మదించాయి, నియామకాల్లోనూ వేగం తగ్గింది. కాబట్టి కార్యాలయాలను అద్దెకు తీసుకోవడం తగ్గే అవకాశం ఉందని జేఎల్‌ఎల్ ఇండియా చీఫ్ ఎకనామిస్ట్, హెడ్ రీసెర్చ్ సమంతక్ దాస్ చెప్పారు.
ఆఫీస్ స్పేస్ మార్కెట్ మీద కొవిడ్-19 మహమ్మారి ప్రభావాన్ని కూడా ఈ నివేదిక హైలైట్ చేసింది. సిబ్బంది ఆరోగ్యం, సంరక్షణ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ, ఆఫీస్ స్పేస్ ప్రాధాన్యతలను మేనేజ్‌మెంట్లు మార్చాయి. మంచి గాలి, తగినంత సహజ కాంతి, కాంటాక్ట్‌లెస్ వ్యవస్థలను అందించే కార్యాలయ స్థలాలకు మొగ్గు చూపారు. భవిష్యత్తులోనూ ఇవే అంశాలు ఆక్యుపైయర్లను ఆకర్షించే అవకాశం ఉందని నివేదిక సూచించింది.