Adani Group stocks: అదానీ గ్రూప్‌ స్టాక్స్‌ ‍(Adani group stocks) సంబంధించి మరో పెద్ద వార్త బయటకు వచ్చింది. స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడిదార్లను భారీ నష్టాల నుంచి కాపాడేందుకు నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ NSE ఒక అనూహ్య నిర్ణయం తీసుకుంది.
 
అదానీ గ్రూప్‌లోని మూడు కంపెనీలను అదనపు నిఘా చర్యల (additional surveillance measures -ASM) ఫ్రేమ్‌వర్క్‌లోకి చేర్చాలని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ గురువారం నిర్ణయించింది. ఈ కొత్త నిబంధన నేటి (శుక్రవారం, 03 ఫిబ్రవరి 2023) నుంచి అమల్లోకి కూడా వచ్చింది. 


NSE మార్జిన్‌ నిఘా కిందకు వచ్చిన 3 అదానీ గ్రూప్‌ కంపెనీలు - అదానీ ఎంటర్‌ప్రైజెస్ (Adani Enterprises), అదానీ పోర్ట్ అండ్‌ సెజ్‌ ‍‌(Adani Ports & SEZ), అంబుజా సిమెంట్స్‌ (Ambuja Cements). ఈ మూడు అదానీ స్టాక్స్‌ను అదనపు నిఘా కిందకు NSE తీసుకు రావడం వెనుక ఒక బలమైన కారణం ఉంది. 


అడిషనల్‌ సర్వైలన్స్‌ మీజర్స్‌ (ASM) అంటే ఏంటి?
కీలక పరిస్థితుల్లో మాత్రమే ఒక స్టాక్‌ను స్టాక్‌ ఎక్సేంజీలు అడిషనల్‌ సర్వైలన్స్‌ మీజర్స్‌ ఫ్రేమ్‌వర్క్‌లోకి తీసుకొస్తాయి. ASM కిందకు ఒక స్టాక్‌ను చేర్చారు అంటే.. ఆ స్టాక్‌లో ట్రేడింగ్‌ను టైట్‌ చేశారని, షేర్‌ ధరలో, లావాదేవీల్లో స్థిరత్వాన్ని పెంచడానికి ప్రయత్నిస్తున్నారని అర్ధం. అంటే, సదరు కంపెనీ షేర్లలో ఇంట్రాడే ట్రేడింగ్‌కు కూడా 100 శాతం ముందస్తు మార్జిన్ అవసరం అవుతుంది. ఈ నిర్ణయం ద్వారా షార్ట్ సెల్లింగ్‌ను కొంతమేర అరికట్టవచ్చు. అదానీ గ్రూప్ షేర్లలో ప్రస్తుతం కనిపిస్తున్న తీవ్ర అస్థిరతను తగ్గించడమే NSE తీసుకున్న తాజా నిర్ణయం వెనుక ఉన్న ఏకైక కారణం. 


ఈ స్టెప్‌ ఫలితంగా అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్ అండ్‌ సెజ్‌, అంబుజా సిమెంట్స్‌ షేర్ల కొనుగోళ్లు, అమ్మకాల మీద నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ పరిశీలన నేటి నుంచి పెరిగింది.


NSE ఏం చెప్పింది?
ASM ఫ్రేమ్‌వర్క్‌కు సంబంధించి.. ఒక స్టాక్‌ ధర, వాల్యూమ్ అస్థిరత, అసాధారణ హెచ్చుతగ్గులను పర్యవేక్షించడానికి అదనపు నిఘా చర్యలు (ASM) తీసుకుంటామని తన అధికారిక వెబ్‌సైట్‌లో నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ NSE పేర్కొంది. సెక్యూరిటీల షార్ట్‌ లిస్టింగ్ పర్యవేక్షణ కోసమే ASM ఫ్రేమ్‌వర్క్‌ ఉందని, సంబంధిత కంపెనీపై ఎక్సేంజ్‌ తీసుకుంటున్న చర్యగా ఈ పరిణామాన్ని చూడకూడదని పేర్కొంది.


అదానీ గ్రూప్‌నకు ₹8.79 లక్షల కోట్ల నష్టం
2023 జనవరి 24వ తేదీన బయటకు వచ్చిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) నివేదిక తర్వాత, అదానీ గ్రూప్ స్టాక్స్‌ భారీగా పతనం అయ్యాయి. అదానీ కంపెనీలు జారీ చేసే బాండ్లకు విలువ లేదని, వాటిని తాకట్టు పెట్టుకుని రుణాలు ఇవ్వబోమని క్రెడిట్‌ సూయిస్‌, సిటీ గ్రూప్‌ కంపెనీలు ప్రకటించడం కూడా అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. దీంతో అదానీ గ్రూప్ స్టాక్‌లలో గురువారం కూడా పతనం కొనసాగింది. గురువారం (02 ఫిబ్రవరి 2023), అదానీ గ్రూప్‌లోని లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ మరో ₹1.34 లక్షల కోట్లను తుడిచిపెట్టుకు పోయింది. మొత్తంగా చూస్తే, గత ఆరు ట్రేడింగ్ సెషన్‌లలో ₹8.79 లక్షల కోట్లు లేదా 110 బిలియన్‌ డాలర్ల అడ్డకోత పడింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.