Stock Market Special Trading Session: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) శనివారం (18 మే 2024) కూడా పని చేస్తాయి. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే ఎదుర్కొనేందుకు ఎంత మేరకు సిద్ధంగా ఉన్నాయో తెలుసుకునేందుకు ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ నిర్వహిస్తున్నాయి. శనివారం రోజున ఈ రెండు ఎక్స్ఛేంజీలు ప్రాథమిక సైట్ నుంచి డిజాస్టర్ రికవరీ (DR) సైట్‌కు మారతాయి. దీని గురించి ఈ నెల 7న NSE ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.
దీనికిముందు, ఈ ఏడాది మార్చి 2న కూడా NSE & BSE ఇదే విధమైన ట్రేడింగ్ సెషన్ నిర్వహించాయి. ప్రాథమిక సైట్ మీద హ్యాకర్లు దాడి చేసినా, మరే కారణం వల్ల క్రాష్ అయినా ట్రేడర్లు నష్టపోకుండా ఉండేందుకు డిజాస్టర్ రికవరీ (DR) సైట్‌ను రూపొందించారు. అత్యవసర సమయాలు ఎదురైనప్పుడు ట్రేడింగ్‌ను ప్రైమరీ సైట్ నుంచి DR సైట్‌కు మారుస్తారు. DR సైట్ నుంచి ట్రేడింగ్ కార్యకలాపాలు యథావిధిగా సాగుతాయి.
రెండు సెషన్లుగా ట్రేడింగ్
మొదటి సెషన్‌లో... ప్రైమరీ సైట్‌లో, బ్లాక్ డీల్స్ విండో ఉదయం 8:45 - 9:00 గంటల మధ్య ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత ప్రి-ఓపెన్ మార్కెట్ ఉంటుంది, ఇది ఉదయం 9:00 గంటల నుంచి 9:08 గంటల వరకు నడుస్తుంది. ఆ తర్వాత ప్రైమరీ సైట్‌లో సాధారణ ట్రేడింగ్ ఉదయం 9:15 గంటలకు ప్రారంభమై ఉదయం 10:00 గంటల వరకు నడుస్తుంది. ఆ తర్వాత, ఉదయం 11:15 గంటల వరకు బ్రేక్ ఇస్తారు.
బ్రేక్ తర్వాత రెండో సెషన్ మొదలవుతుంది. ఈ సెషన్ డిజాస్టర్ రికవరీ సైట్ ద్వారా నడుస్తుంది. ఇందులో, ప్రి-ఓపెన్ సెషన్ ఉదయం 11:15 గంటల నుంచి 11:23 గంటల వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత సాధారణ ట్రేడింగ్ ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది. పోస్ట్-క్లోజ్ ఆర్డర్ ముగింపు, సవరణలను మధ్యాహ్నం ఒంటి గంట వరకు అనుమతిస్తారు.
F&O విభాగంలో..
F&O విభాగం విషయానికి వస్తే... మొదటి సెషన్ ఉదయం 9:15 గంటలకు ప్రారంభమై 10 గంటలకు ముగుస్తుంది. ప్రైమరీ సైట్ నుంచి ట్రేడింగ్ జరుగుతుంది. రెండో సెషన్ డిజాస్టర్ రికవరీ సైట్‌లో ఓపెన్ అవుతుంది, ఉదయం 11:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:40 వరకు కొనసాగుతుంది.
ప్రైస్ బ్యాండ్లలో మార్పులు
మే 18న జరిగే స్పెషల్ ట్రేడింగ్ సెషన్‌లో డెరివేటివ్ ప్రొడక్ట్స్ సహా అన్ని సెక్యూరిటీల్లో గరిష్టంగా 5 శాతం మార్పును మాత్రమే ఎక్సేంజీలు అనుమతిస్తాయి. ఇప్పటికే 2 శాతం లేదా అంతకంటే తక్కువ ప్రైస్ బ్యాండ్‌లో ఉన్న సెక్యూరిటీలకు పాత విధానమే కొనసాగుతుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: సిప్‌లో ఈ పని చేస్తే మీ లాభాలు గోవింద, వైట్‌వోక్ క్యాపిటల్ హెచ్చరిక