National Pension System: నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద పెట్టుబడి పెట్టడం అంటే ఉద్యోగ విరమణ కోసం డబ్బు కూడబెడుతున్నట్లు మాత్రమే కాదు, ఆదాయ పన్నును ఆదా చేసే ఆప్షన్లలో ఇది కూడా ఒకటి. ఇటీవల,పన్ను ఆదా చేయడానికి ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలని SBI కూడా ఇటీవల తన ఖాతాదార్లకు సందేశాలు పంపింది. NPS వల్ల ఒక వ్యక్తికి ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో ఇప్పుడు చూద్దాం.


జాతీయ పింఛను పథకంతో లాభాలు ఏంటి?
18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఏ వ్యక్తి అయినా ఈ పథకం కింద పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో పెట్టిన పెట్టుబడికి కాల గడువు పూర్తయిన రోజున (మెచ్యూరిటీ సమయంలో), 60 శాతం మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని యాన్యుటీని కొనుగోలు చేయడం ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ ఖాతా నుంచి 60 శాతం మొత్తాన్ని విత్‌డ్రా చేసిన తర్వాత కూడా, పెట్టుబడిదారు ఈ పథకం కింద ప్రతి నెలా పెన్షన్ తీసుకోవచ్చు. దీంతోపాటు... జాతీయ పింఛను పథకంలో (NPS) పెట్టుబడులకు ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద, సెక్షన్‌ 80CCD కింద ఆదాయ పన్ను మినహాయింపును పెట్టుబడిదారు క్లెయిమ్ చేసుకోవచ్చు. 


కనీస పెట్టుబడి పరిమితి                  
జాతీయ పెన్షన్ పథకం కింద రెండు ఖాతాలు తెరిచేందుకు వీలుంది. వాటిని టైర్‌-I, టైర్‌-II అని పిలుస్తారు. టైర్-1 కింద కనీసం రూ. 500 తక్కువ కాకుండా, టైర్ 2 కింద కనీసం రూ. 1000 తక్కువ కాకుండా ఇన్వెస్ట్ చేయవచ్చు. పన్ను మినహాయింపు గురించి చెప్పుకుంటే... టైర్ వన్ కింద మాత్రమే ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది, టైర్‌ టు కింద ఈ వెసులుబాటు అందుబాటులో లేదు. 


టైర్‌-I ఖాతాలో పెట్టిన పెట్టుబడులకు ఆదాయపు పన్ను సెక్షన్ 80CCD (1B) కింద 50 వేల రూపాయల వరకు, 80C కింద 1.5 లక్షల రూపాయల వరకు రాయితీ పొందవచ్చు.


NPS ఖాతా నుంచి ఎలా నిష్క్రమించవచ్చు?          
ఖాతాదారుకు 60 ఏళ్లు వచ్చిన తర్వాత, అప్పటి వరకు పోగేసిన మొత్తంలో కనీసం 40% యాన్యుటీలో పెట్టుబడి పెట్టాలి. 60% మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ 60% మొత్తాన్ని 75 ఏళ్ల వయస్సు వరకు ఎప్పుడైనా విత్‌డ్రా చేసుకోవచ్చు. మొత్తం కార్పస్ 5 లక్షల లోపు ఉంటే, మొత్తం కార్పస్‌ను వెనక్కు తీసుకోవచ్చు. ఒకవేళ, పెట్టుబడిదారుకు 60 ఏళ్ల వయస్సు రాకుండానే మొత్తాన్ని విత్‌డ్రా చేయాల్సిన పరిస్థితి వస్తే, అలా కూడా చేయవచ్చు. అయితే, అప్పటి వరకు పోగేసిన మొత్తంలో (మొత్తం కార్పస్) 20 శాతం మొత్తాన్ని మాత్రమే విత్‌డ్రా చేసుకునేందుకు వీలుంది. మిగిలిన 80 శాతం మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. 


పెట్టుబడిదారుకు 60 ఏళ్ల వయస్సు రాకముందే NPS డబ్బును వెనక్కు తీసుకోవాలనుకున్న సందర్భంలో, కార్పస్‌ ఫండ్‌ 2.5 లక్షల రూపాయలకు మించకపోతే, ఆ మొత్తాన్ని పూర్తిగా విత్‌డ్రా చేసుకోవచ్చు. యాన్యుటీలో పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదు.