కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైందంటే చాలు ఎన్నో మార్పులు వస్తాయి. నేటి (ఏప్రిల్ 1) నుంచి పలు ఆర్థిక నిబంధనలలో మార్పులు అమలులోకి వస్తాయి. వీటి ప్రభావం నేరుగా సామాన్యులపై, మధ్యతరగతి వారి రోజువారీ ఖర్చులపై నేరుగా పడనుంది. ఉద్యోగస్తులకు, పన్ను చెల్లింపుదారులతో పాటు ఇన్వెస్టర్లకు నేటి నుంచి అమలులోకి వచ్చే మార్పులు తెలుసుకోవడం ముఖ్యమే.  పాన్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఆదాయపు పన్ను, హెచ్‌ఆర్‌ఏ (HRA), ఐటీఆర్ (ITR) ఫైలింగ్‌కు సంబంధించిన నిబంధనలు మారుతున్నాయి. వాటి గురించి తెలుసుకోకపోతే ఇబ్బంది పడతారు. 

పాన్ కార్డ్ మరింత సేఫ్  బుధవారం (ఏప్రిల్ 1) నుంచి పాన్ కార్డ్ పొందడానికి ఆధార్‌తో పాటు ఇతర డాక్యుమెంట్లు అవసరమవుతాయి. ఇప్పటి వరకు కేవలం ఆధార్ కార్డును ఉపయోగించి చాలా సులభంగా పాన్ కార్డు కోసం ఎవరైనా అప్లై చేసుకునేవారు. ఇప్పుడు ఇందులో మార్పులు చేస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. ఆధార్ కార్డుతో పాటు జనన ధృవీకరణ పత్రం (Birth Certificate), ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, 10వ తరగతి సర్టిఫికేట్ లేదా ఇతర ప్రభుత్వ డాక్యుమెంట్స్ సమర్పించాల్సి ఉంటుంది.  కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యతో పాన్ కార్డ్ గతంలో కంటే మరింత సురక్షితం అవుతుంది. కానీ మరో ఇబ్బందికరమైన విషయం ఏంటంటే.. పాన్ కార్డ్ రావడానికి గతంతో పోలిస్తే కొంచెం ఎక్కువ సమయం పట్టవచ్చు. పాన్ కార్డ్ కోసం మీరు కొత్త ఫారమ్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ITR ఫైలింగ్ అప్డేట్  ఐటీఆర్ ఫైల్ చేసే తేదీలలో కొన్ని మార్పులు జరిగాయి. ఎలాంటి ఆడిట్ అవసరం లేని కేసులకు సంబంధించి ITR-3, ITR-4 ఫైల్ చేయడానికి తుది గడువు ఆగస్టు 31తో ముగియనుంది. అలాగే జూలై 31 వరకు ITR-1, ITR-2 దరఖాస్తుదారులు ఫైల్ చేసుకునే వీలు కల్పించారు. 

ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ ధర పెంపు

భారత జాతీయ రహదారుల సంస్థ (NHAI) వాహనదారులకు షాకిచ్చింది. కొత్త ఆర్థిక సంవత్సరం (2026-27) ప్రారంభం కావడంతో ఏప్రిల్ 1 నుంచి ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలను పెంచింది. ఇప్పటి వరకు రూ. 3000గా ఉన్న పాస్ ధరను రూ. 3075కు పెంచారు. అంటే సుమారు 2.5 శాతం మేర అదనపు భారం పడుతుంది. మార్చి 31 అర్ధరాత్రి లోపు పాస్ రెన్యువల్ చేసుకునే వారికి మాత్రమే పాత ధర వర్తిస్తుంది. 

HRA క్లెయిమ్‌లో మార్పులు నేటి నుంచి హెచ్‌ఆర్‌ఏ (HRA) క్లెయిమ్ చేసే వారికి రూల్స్ మరింత కఠినతరం అయ్యాయి. ఒక ఉద్యోగి సంవత్సరానికి 1 లక్ష రూపాయల కంటే ఎక్కువ అద్దె చెల్లిస్తే కనుక, ఇంటి ఓనర్ పాన్ నంబర్ తప్పనిసరిగా సమర్పించాలి. అయితే కొందరు ఇంటి ఓనర్లు పాన్ నెంబర్ వివరాలు లాంటివి షేర్ చేయడానికి ఇష్టపడరు. మరోవైపు ఇంటి యజమాని ఆ కుటుంబ సభ్యుడా కాదా అనే సమాచారాన్ని స్పష్టంగా తెలియజేయాలి. ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులు దీని కోసం విడిగా ఫారమ్ నింపాలి. అయితే తప్పుడు లేదా నకిలీ క్లెయిమ్‌లను అరికట్టడమే ఈ కొత్త రూల్ ముఖ్య ఉద్దేశ్యం అని అధికారులు చెబుతున్నారు.

క్రెడిట్ కార్డ్ రూల్స్  మీరు క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తున్నారా.. అయితే కొత్త రూల్స్ తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఇప్పుడు క్రెడిట్ కార్డుకు సంబంధించిన బిగ్ ట్రాన్సాక్షన్లపై  నిఘా పెరుగుతుంది. ఏడాదిలో రూ. 10 లక్షల కంటే ఎక్కువ డిజిటల్ ఖర్చు చేసినా లేదా రూ. 1 లక్ష కంటే ఎక్కువ మనీ పే చేసినా.. ఆ విషయం ఆదాయపు పన్ను శాఖకు తెలియజేయాలి. మరోవైపు, టాక్స్ పేయర్లకు కొత్త సౌకర్యం కల్పించారు. దీని ప్రకారం ఇప్పుడు క్రెడిట్ కార్డుతో టాక్స్ సైతం చెల్లించవచ్చు. అయితే ఈ ఆప్షన్ ఉపయోగించినప్పుడు అదనపు ఛార్జీలు చెల్లించడం ఒక్కటే మీకు సమస్య. కనుక పేమెంట్ చేసే సమయంలో మీకు తప్పనిసరి అయితే, జరిమానా నుంచి తప్పించుకునేందుకు ఇలాంటి ఆప్షన్ వాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

ATM విత్‌డ్రా నిబంధనల్లో మార్పు ఏప్రిల్ 1 నుంచి పలు పెద్ద బ్యాంకులు ఎటిఎం, నగదు విత్‌డ్రా సంబంధించిన నిబంధనలను మార్చాయి. హెచ్‌డిఎఫ్‌సి (HDFC) బ్యాంక్ మెట్రో నగరాల్లో ఫ్రీ ట్రాన్సాక్షన్ పరిమితిని 3కి, నాన్-మెట్రో నగరాల్లో 5 చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కొన్ని డెబిట్ కార్డులపై రోజువారీ విత్ డ్రా లిమిట్ రూ. 1 లక్ష నుండి రూ. 50,000 కు తగ్గించింది. బంధన్ బ్యాంక్  తన ఎటిఎం నిబంధనలలో మార్పులు చేసింది. నెలకు కేవలం 5 ఉచిత లావాదేవీల సదుపాయాన్ని కల్పించనుంది. త్వరలో దీనిపై మరింత క్లారిటీ రానుంది.