IPL 2026 Latest Updates: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ కొనసాగుతుండగా బ్రాడ్‌కాస్ట్ బృందంలో తీవ్ర విషాదం నెలకొంది. బీసీసీఐతో కలిసి పని చేస్తున్న 76 ఏళ్ల బ్రిటిష్ బ్రాడ్‌కాస్ట్ ఇంజనీర్ ఇయాన్ విలియం లాంగ్‌ఫోర్డ్ మంగళవారం ముంబైలో మరణించారు. దక్షిణ ముంబైలోని ఒక ప్రముఖ హోటల్ గదిలో ఆయన అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని హోటల్ యాజమాన్యం గుర్తించింది. వెంటనే ఆయనను బాంబే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఈ విషాద వార్తపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది.
ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నివాళి"మా బ్రాడ్‌కాస్ట్ ఆపరేషన్స్‌లో అంతర్భాగంగా ఉంటూ ఎంతో నిబద్ధతతో పనిచేసిన ఇయాన్ విలియం లాంగ్‌ఫోర్డ్ అకాల మరణం మా అందరినీ కలచివేసింది. ఈ కష్టకాలంలో ఆయన కుటుంబానికి, స్నేహితులకు మా అండదండలు ఉంటాయి. లాంగ్‌ఫోర్డ్ కుటుంబానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి ఐపీఎల్ కట్టుబడి ఉంది. ఐపీఎల్ నిర్వహణలో పాలుపంచుకుంటున్న ప్రతి ఒక్కరి ఆరోగ్యం, భద్రత మాకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలు" అని ఐపీఎల్ అధికారిక ప్రకటనలో పేర్కొంది.
అసలేం జరిగింది?పోలీసుల సమాచారం ప్రకారం.. లాంగ్‌ఫోర్డ్ మార్చి 24 నుండి ముంబైలోని ట్రైడెంట్ హోటల్‌లో స్టే చేస్తున్నారు. ఆదివారం ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ ముగిసిన తర్వాత ఆయన తన గదికి చేరుకున్నారు. సోమవారం ఉదయం హోటల్ రిసెప్షనిస్ట్ ఆయన గదికి ఫోన్ చేయగా ఎలాంటి స్పందన రాలేదు. అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది గది వద్దకు వెళ్లి డోర్ కొట్టినా లోపల నుండి సమాధానం లేకపోవడంతో మాస్టర్ కీ ఉపయోగించి తలుపులు తెరిచారు. అప్పటికే లాంగ్‌ఫోర్డ్ నేలపై పడి ఉండటాన్ని గమనించిన సిబ్బంది హోటల్ ఇన్-హౌస్ డాక్టరుకు సమాచారం అందించారు. అనంతరం ఆసుపత్రికి తరలించగా ఆయన మరణించినట్లు తెలిసింది.
పోలీసు దర్యాప్తుమెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్ అధికారులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్ట్‌మార్టం నివేదికలో ఎలాంటి అనుమానాస్పద అంశాలు కనిపించలేదని ప్రాథమికంగా తెలిసింది. ప్రస్తుతం దీనిని అసహజ మరణంగా నమోదు చేసుకున్న పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు. లాంగ్‌ఫోర్డ్ ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసార విభాగానికి సాంకేతిక సహకారం అందించడానికి ముంబై వచ్చారు. సుదీర్ఘ కాలంగా బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ రంగంలో అనుభవం ఉన్న ఆయన మృతి పట్ల క్రికెట్ వర్గాలు సంతాపం వ్యక్తం చేస్తున్నాయి.
