Nestle India Q4 Results: FMCG మేజర్ నెస్లే ఇండియా, డిసెంబర్ త్రైమాసికానికి బ్రహ్మాండమైన ఫలితాలను ప్రకటించింది. 2022 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్) ఈ కంపెనీ నికర లాభం సంవత్సరానికి (YoY) ఏకంగా 66% పెరిగి రూ. 628 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ. 379 కోట్లుగా ఉంది.
జనవరి-డిసెంబర్ ఆర్థిక సంవత్సరాన్ని (క్యాలెండర్ ఇయర్) నెస్లే ఇండియా అనుసరిస్తుంది. కాబట్టి, డిసెంబర్ త్రైమాసికం ఈ కంపెనీకి నాలుగో త్రైమాసికం కింద లెక్క.
రూ.75 డివిడెండ్
2022 సంవత్సరానికి ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ. 75 తుది డివిడెండ్‌ను కంపెనీ బోర్డు సిఫార్సు చేసింది.
నాలుగో త్రైమాసికంలో కంపెనీ విక్రయాలు 14% పెరిగి రూ. 4,233 కోట్లకు చేరుకున్నాయి, గతేడాది ఇదే త్రైమాసికంలో రూ. 3,715 కోట్లుగా ఉన్నాయి. కార్యకలాపాల ఆదాయం (revenue from operations) కూడా 14% జంప్ చేసి రూ. 4,257 కోట్లకు చేరుకుంది.
సమీక్ష కాల త్రైమాసికంలో కంపెనీ ఎబిటా (EBITDA లేదా ఆపరేటింగ్ ప్రాఫిట్) రూ. 973 కోట్లకు చేరింది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో నివేదించిన రూ. 851 కోట్లతో పోలిస్తే ఈసారి 14% పెరిగింది. ఇదే సమయంలో ఎబిటా మార్జిన్ 22.9%గా ఉంది.
ముడి చమురు ధర తగ్గడంతో ప్యాకేజింగ్ మెటీరియల్స్ వంటి వాటి ఖర్చులు తగ్గాయని, తమ ఉత్పత్తులకు దేశీయంగా డిమాండ్ కొనసాగుతోందని కంపెనీ తెలిపింది.
గత పదేళ్లలో గరిష్ట వృద్ధి
పూర్తి ఆర్థిక సంవత్సరం 2022లో, కంపెనీ మొత్తం అమ్మకాలు 14.5%, దేశీయ అమ్మకాలు 14.8% పెరిగాయి. గత పదేళ్లలో ఇదే అత్యధిక రెండంకెల వృద్ధి. కంపెనీలోని అన్ని విభాగాల వ్యాపారం అద్భుతంగా ఉందని నెస్లే సీఎండీ సురేష్ నారాయణన్ వెల్లడించారు.
పూర్తి సంవత్సరానికి నికర లాభం రూ. 2,390 కోట్లు కాగా, నికర అమ్మకాలు రూ. 16,970 కోట్లుగా ఉన్నాయి.
క్విక్ కామర్స్, క్లిక్ & మోర్టార్ వంటి కొత్త బిజినెస్ ఫార్మాట్‌ల ద్వారా కంపెనీ ఈ-కామర్స్ ఛానెల్ బలమైన వృద్ధిని అందించింది.
అయితే... గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగిన పాల ధరల కారణంగా పాల ఉత్పత్తుల విభాగంలో ఇబ్బందులు పడుతున్నట్లు నెస్లే పేర్కొంది. కిట్‌క్యాట్, మంచ్ వంటి ప్రొడక్ట్స్ సేల్స్ సూపర్‌గా ఉండడంతో మిఠాయి విభాగం మార్కెట్ వాటా పెరిగింది.
మొత్తంగా చూస్తే, కంపెనీ అన్ని విభాగాల్లోనూ వృద్ధి కనిపించింది.
నిజానికి నెస్లే ఫలితాలు అంత ఆశాజనకంగా ఉండవని మార్కెట్ అంచనా వేసింది. కానీ, అంచనాలన్నీ తారుమారు కావడంతో నెస్లే షేర్ ధర తారాజువ్వలా దూసుకుపోయింది. ఇవాళ ఫలితాలకు ముందు, ఉదయం 11 గంటల వరకు స్తబ్దుగా ఉన్న స్టాక్, ఫలితాల తర్వాత ఒక్కసారిగా విజృంభించింది. ఇంట్రా డే కనిష్టం నుంచి 3% పైగా పెరిగింది. మధ్యాహ్నం 2 గంటల సమయానికి 2.40% లాభంతో రూ. 19,707 వద్ద షేర్ ట్రేడవుతోంది.
గురువారం, NSEలో నెస్లే స్టాక్ 2.02% పెరిగి రూ.19,650 వద్ద ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.