Stock Market Opening Bell 29 August 2022: మరికొన్నాళ్లు ఆర్థిక వ్యవస్థకు నొప్పి తప్పదంటూ శుక్రవారం జాక్సన్ హోల్ సమావేశంలో అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ చేసిన కామెంట్లు, ఆ రోజు అమెరికన్ మార్కెట్ల మీద అతి తీవ్ర ప్రభావం చూపాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం కాస్త తగ్గిందని, ఆ కారణం చూపి వడ్డీ రేట్లను పెంపులో దూకుడు తగ్గిస్తే, ఇప్పుడున్న పరిస్థితుల కంటే గడ్డు పరిస్థితులను భవిష్యత్తులో ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. కాబట్టి ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి కఠిన చర్యలు తీసుకుంటూనే ఉంటామని గట్టిగానే చెప్పారు. వడ్డీ రేట్ల పెంపులో దూకుడు కొనసాగుతుందని హింట్ ఇచ్చారు. పావెల్ కామెంట్లు నెగెటివ్ సంకేతం కావడంతో అమెరికన్ మార్కెట్లు పేకమేడల్లా కుప్పకూలాయి. డౌజోన్స్ ఏకంగా వెయ్యి పాయింట్లు లేదా 3 శాతం గల్లంతైంది. నాస్‌డాక్ 4 శాతం మేర, S&P 500 ఇండెక్స్ దాదాపు మూడున్నర శాతం నష్టపోయాయి. ముఖ్యంగా టెక్ స్టాక్స్‌లో స్ట్రాంగ్ సెల్లింగ్ వచ్చింది. ఈ ప్రభావం ఇవాళ్టి (సోమవారం, 29.08.2002) మన మార్కెట్ల మీదా కనిపించింది.
సెన్సెక్స్ 1466 లేదా 2.49 శాతం నష్టంతో 57,367.47 దగ్గర ప్రారంభమైంది. నిఫ్టీది కూడా ఇదే బాట. ఇది 370 లేదా 2.11 శాతం నష్టంతో 17,188.65 దగ్గర ఓపెన్ అయింది. నిఫ్టీ బ్యాంక్ 775 పాయింట్లు లేదా 2.25 శాతం నష్టంతో 38111.60 దగ్గర ప్రారంభమైంది. నిఫ్టీ ఐటీ అతి భారీగా నష్టపోయింది. ఇది ఏకంగా 1043 పాయింట్లు లేదా 3.64 శాతం గల్లంతై, 27,648 దగ్గర స్టార్టయింది. బీఎస్‌ఈ స్మాల్ క్యాప్ కూడా చిక్కటి ఎర్ర రంగు పూసుకుంది. ఇది 893 పాయింట్లు లేదా 3.14 శాతం పడిపోయి 27,522 దగ్గర ఓపెన్ అయింది.
మన మార్కెట్ ఓపెనింగ్ సమయానికే SGX నిఫ్టీ ఫ్యూచర్స్ అతి భారీ నష్టాల్లో ఉంది. దాదాపు 400 పాయింట్ల నష్టంతో ఆ సమయంలో ట్రేడవుతోంది. మన మార్కెట్‌లో నెగెటివ్ ఓపెనింగ్ ఉంటుందని స్ట్రాంగ్ సిగ్నల్‌ను ముందే ఇచ్చింది.
టెక్నికల్‌గా చూస్తే... నిఫ్టీకి 17,150 దగ్గర గట్టి సపోర్ట్ ఉంది, 17,350 వద్ద రెసిస్టెన్స్ ఫేస్ చేయవచ్చు. నిఫ్టీ బ్యాంక్‌కు 38,000 దగ్గర మంచి మద్దతుంది, 38,250 వద్ద రెసిస్టెన్స్ ఫేస్ చేయవచ్చు.
విదేశీ ఫోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) ఇప్పుడిప్పుడే నెట్ బయ్యర్స్‌గా మారుతున్న ఈ తరుణంగా పావెల్ వ్యాఖ్యలు మన మార్కెట్లకు మళ్లీ శరాఘాతమనే చెప్పవచ్చు. ఎఫ్‌ఐఐలు మళ్లీ మన మార్కెట్ల నుంచి కొంతమేర పెట్టుబడులను వెనక్కు తీసుకునే సూచనలున్నాయి.
ఇక మన దేశంలో ఇవాళ (సోమవారం) జరిగే ఈవెంట్లలో అతి ముఖ్యమైనది, మార్కెట్ మీద ప్రభావం చూపే సత్తా ఉన్నది రిలయన్స్ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం). ముంబైలో మధ్యాహ్నం రెండు గంటలకు ఈ సమావేశం జరుగుతుంది. పెట్టుబడిదారులంతా ఏజీఎంకు హాజరవుతారు. కంపెనీకి సంబంధించిన భవిష్యత్ వ్యూహాలన్నింటినీ ఏజీఎంల్లోనే రిలయన్స్ అధిపతి ముఖేశ్ అంబానీ ప్రకటిస్తుంటారు. 5జీ సేవల ప్రారంభం విషయంలో ముఖేష్ ప్రకటన చేసే అవకాశం ఉంది. దీంతోపాటు రెన్యూవబుల్ ఎనర్జీ బిజినెస్ భవిష్యత్ ప్రణాళిక గురించి కూడా మాట్లాడవచ్చు. చాలాకాలంగా నానుతున్న టెలికాం (జియో), రిటైల్ బిజినెస్‌ల పబ్లిక్ ఇష్యూల మీద ముఖేష్ అంబానీ ఇవాళ్టి భేటీలో స్పష్టత ఇస్తారని మార్కెట్ అంచనా వేస్తోంది. కాబట్టి ముఖేశ్ అంబానీ ప్రసంగాన్ని దలాల్ స్ట్రీట్ పరిగణనలోకి తీసుకుంటుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే!. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.