Reasons To Know Why Mutual fund Units Allocated Late in Last Month : తమ ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకొనేందుకు చాలా మంది మ్యూచువల్ ఫండ్లలో (Mutual Funds) పెట్టుబడి పెడుతుంటారు. ఉద్యోగులు, పేద, మధ్య తరగతి ప్రజలు ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేసేందుకు ఇబ్బంది పడతారు. అందుకే క్రమానుగత పెట్టుబడి విధానాన్ని (SIP) ఎంచుకుంటారు.
సాధారణంగా కస్టమర్లు నిర్ణయించుకున్న తేదీ నుంచి రెండు రోజుల్లోపు మ్యూచువల్ ఫండ్ యూనిట్లు (Mutual Fund Units) ఖాతాల్లో జమ అవుతుంటాయి. గత నెల్లో మాత్రం వారం రోజుల వరకు యూనిట్ల కేటాయింపు జరగకపోవడంతో చాలామంది ఆందోళన చెందారు. అందుకు ఓ కారణం ఉంది.
మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే మొదట మనం కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఎవరో ఒక బ్రోకర్ లేదా ఫ్లాట్‌ఫామ్‌ను ఎంచుకుంటాం. ఉదాహరణకు పేటీఎం మనీ, అప్‌స్టాక్ట్స్, గ్రో మనీ వేదికల సాయం తీసుకుంటాం. మరికొందరు నేరుగా మ్యాచువల్ ఫండ్ ఏఎంసీల్లోనే ఖాతాలు తెరుస్తారు. ఆ తర్వాత సిప్ చేసే డబ్బును నిర్ణయించుకొని వారికి తెలియజేస్తాం. కొందరు ఆటో పే ఆప్షన్ ఎంచుకుంటారు.
ఇలా చేస్తున్నప్పుడు మన బ్యాంకు ఖాతాల్లోని డబ్బు మొదట బ్రోకింగ్ కంపెనీల ఖాతాల్లోకి వెళ్తుంది. అక్కడి నుంచి మ్యూచువల్ ఫండ్ హౌజ్‌లోకి బదిలీ అవుతుంది. దీనిని 'మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ పూలింగ్' అంటారు. 2022 జులై 1 నుంచి ఈ పద్ధతిని సెబీ నిలిపివేసింది. అంటే ఇకపై కస్టమర్ బ్యాంకు ఖాతా నుంచి డబ్బు నేరుగా ఫండ్ హౌజ్‌కు వెళ్తుంది. ఇందు కోసం ఇన్వెస్టర్లు క్లియరింగ్ కార్పొరేషన్ పత్రాలపై సంతకాలు చేయాల్సి ఉంటుందని తెలిసింది. పాత పద్ధతి నుంచి తప్పుకోవడంతోనే యూనిట్ల కేటాయింపు ఆలస్యమైంది.
భారీ డిస్ట్రిబ్యూటర్ల వద్ద ఖాతాలు తెరిచిన వారికే కొన్ని ఇబ్బందులు కలగొచ్చని విశ్లేషకులు అంటున్నారు. 'ఫండ్ హౌజ్‌కే నేరుగా డబ్బులు పంపించాలని మాకు ఆదేశాలు అందాయి. కాబట్టి మా కస్టమర్లకు ఇబ్బందేమీ ఉండదు. ఒకవేళ మీరు పెద్ద డిస్ట్రిబ్యూషన్ సంస్థ లేదా మ్యూచువల్ ఫండ్ వేదికతో డీల్ చేస్తుంటే వారి స్థాయిలో మార్పు ఉంటుంది. పేపర్ వర్క్ గురించి రిటైల్ ఇన్వెస్టర్లు ఆందోళన పడాల్సిన అవసరం లేదు' అని ముంబయికి చెందిన లాడర్‌అప్ వెల్త్ మేనేజ్‌మెంట్ స్థాపకులు రాఘవేంద్ర నాథ్ అంటున్నారు. ఇప్పటికే కస్టమర్ల డేటా, సిస్టమ్స్‌లో మార్పులు చేసేశామని పెద్ద కంపెనీలు చెబుతున్నాయి.