Raamdeo Agrawal: 


స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం వల్ల సంపద సృష్టించొచ్చు. ఫండమెంటల్స్‌ బలంగా ఉన్న స్టాక్‌లో మదుపు చేస్తే కోటీశ్వరులు అవ్వొచ్చు. తక్కువ ధరకే దొరికే మల్టీబ్యాగర్స్‌ను నమ్ముకొంటే బ్యాంకు అకౌంట్లో డబ్బులు వర్షం కురుస్తుంది. అయితే అలాంటి విలువైన చక్కని షేర్లను కనుక్కోవడమే అతి కష్టమైన పని! ఒకవేళ వెతికి పట్టుకొన్నా సుదీర్ఘ కాలం దాంతో కొనసాగడం ముఖ్యం! బిలియన్‌ డాలర్ల విలువైన భారత స్టాక్‌ మార్కెట్లో అలాంటి వజ్రాలు ఎన్నో ఉన్నాయని చెప్తున్నారు మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ రామ్‌దేవ్‌ అగర్వాల్‌! ఎకనామిక్‌ టైమ్స్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. 


మార్కెట్లో ఎక్కువ సంపద ఆర్జించాలంటే అత్యంత జాగ్రత్తగా ఉండాలని రామ్‌దేవ్‌ చెప్తున్నారు. 'రాబోయే 12 నెలల్లో మార్కెట్‌ 25 శాతం రిటర్న్‌ ఇవ్వొచ్చు. లేదా ఫ్లాట్‌గా ఉండొచ్చు. ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అందుకే మనం కంపెనీల ఎర్నింగ్స్‌ గ్రోత్‌, పీఈ మల్టిపుల్స్‌ చూడాలి. ఒకవేళ కార్పొరేట్‌ ఆదాయ వృద్ధి నిలకడగా 15 లేదా 16 శాతం ఉంటే మార్కెట్‌ నుంచి 17 శాతం వరకు రిటర్న్స్‌ ఆశించొచ్చు. భారత జీడీపీ 7 శాతం ఉంటే కంపెనీలు కచ్చితంగా 14-15 శాతం వృద్ధి చెందుతాయి. జీడీపీ 6 శాతం ఉంటే కార్పొరేట్‌ ఎర్నింగ్స్‌ గ్రోత్‌ 10-11 శాతం ఉంటుంది. మొత్తంగా జీడీపీ ప్లస్‌ 2-3 శాతం ఎక్కువ' అని ఆయన అన్నారు.


కొవిడ్‌ సమయంలో 17-18 పీఈ మల్టిపుల్‌ వద్ద ఇన్వెస్టింగ్‌ మొదలు పెట్టినప్పుడు రీరేటింగ్‌ వల్ల 15 నుంచి 20 శాతం రాబడి వచ్చిందని రామ్‌దేవ్‌ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో 21-22 రెట్లు రీరేటింగ్ రావడం కష్టమన్నారు. రాబోయే 12 నెలల్లో కార్పొరేట్‌ గ్రోత్‌ బాగుంటే సెన్సెక్స్‌ మరో 2000-2500 వరకు పెరుగుతుందన్నారు. ప్రస్తుతం మార్కెట్లో 50 పీఈ మల్టిపుల్‌ ఉన్న కంపెనీలు చాలా ఉన్నాయన్నారు. గ్రోత్‌ పరంగా నిరాశపరిస్తే వాటి పీఈ కుంచించుకుపోతుందని పేర్కొన్నారు. మార్కెట్‌ వర్గాల అంచనాలను అందుకోకుంటే అలాంటి స్టాక్స్‌ డీరేటింగ్‌ అవుతాయన్నారు.


ఆదాయంలో నిలకడైన గ్రోత్‌ ఉండి రీరేటింగ్‌ అవ్వని స్టాక్స్‌ అత్యుత్తమం అని రామ్‌దేవ్‌ అన్నారు. ప్రస్తుతం బ్యాంకు షేర్లు బాగా పెరుగుతున్నప్పటికీ పీఈ మల్టిపుల్స్‌ ఎక్కువగా లేవన్నారు. ఎక్కడైనా 20-25% వృద్ధి కనిపిస్తే అలాంటి స్టాక్స్‌లో మంచి రాబడి పొందొచ్చని వెల్లడించారు. '10-12% పీఈ మల్టిపుల్‌ ఉన్న షేర్లు మరో రకం. చాలా వరకు ఇవి కనిపించవు. అలాంటి వాటిని వెతికి పట్టుకుంటే 25 శాతం వరకు రాబడి రావడమే కాకుండా పీఈ రెట్టింపు అవుతుంది. అక్కడే మనకు అత్యంత ఆనందం లభిస్తుంది. యాజమాన్యం బాగాలేకపోవడం, పెట్టుబడిని సరిగ్గా కేటాయించకపోవడం, వృద్ధి లేకపోవడం, వ్యూహాత్మకం వ్యవహరించని కంపెనీల పీఈ తగ్గుతుంది. కొన్నాళ్లకు ఇలాంటి వాటిని కనుగొంటారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకుంటారు. మేనేజ్‌మెంట్‌ మళ్లీ కంపెనీని పట్టాలకెక్కిస్తే గ్రోత్‌ పెరుగుతుంది. పీఈ పుంజుకుంటుంది. అయితే బిలియన్‌ డాలర్ల విలువైన ఈక్విటీ మార్కెట్లో ఇలాంటివి కనుక్కోవడం చాలా కష్టం' అని ఆయన అన్నారు.


Also Read: మ్యూచువల్‌ ఫండ్‌పై లోన్ - ఈఎంఐ లేదు, పైగా తక్కువ వడ్డీ!


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.